104 సేవల నిలిపివేత

ABN , First Publish Date - 2022-01-03T06:24:50+05:30 IST

గ్రామగ్రామాన తిరుగుతూ వైద్య సేవలు, ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తున్న 104 వాహనాలు ఇక కనుమరుగు కానున్నాయి. దశలవారీగా 104 సేవలను ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశ జనవరి 1 నుంచి ప్రారంభం కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వాహనాల సేవలు నిలిచాయి.

104 సేవల నిలిపివేత

ఉమ్మడి జిల్లాలో 27 వాహనాలు, 153 మంది సిబ్బంది


భువనగిరి టౌన్‌: గ్రామగ్రామాన తిరుగుతూ వైద్య సేవలు, ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తున్న 104 వాహనాలు ఇక కనుమరుగు కానున్నాయి. దశలవారీగా 104 సేవలను ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశ జనవరి 1 నుంచి ప్రారంభం కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వాహనాల సేవలు నిలిచాయి. నిలిచిన వాహనాలను హైదరాబాద్‌కు పంపాలని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 27 వాహనాలు ఉండగా, 104 విభాగంలో పనిచేస్తున్న 153 మంది ఉద్యోగుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారనుంది. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లోన్ని వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు వైద్య సేవలకు దూరం కానున్నారు.



గ్రామీణ ప్రాంతాల్లో రోగులు న్న ప్రదేశానికే వెళ్లి వైద్య సేవలు అందించే లక్ష్యంతో 2008 అక్టోబరులో అప్పటి ఉమ్మడి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 104 వాహన సేవలను ప్రారంభించా రు. ప్రతీ వాహనంలో ఒక ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, డ్రైవర్‌తో పాటు అవసరమైన సిబ్బందిని నియమించారు. పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగించారు. ఒక్కో వాహనం నిర్దేశిత తేదీల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి రక్తపోటు, మధుమేహం, మూర్చ, అస్తమా తదితర దీర్ఘకాలిక వ్యాదులతో పాటు గర్భిణులకు వైద ్య పరీక్షలు, సాధారణ రోగులను పరీక్షించి నెలకు సరిపడా మందులు ఉచితంగా అందించేవారు. రోగులకు అత్యవసర సేవ లు అవసరమైతే ప్రభుత్వ ఆస్పత్రులకు కూడా తరలించేవారు. దీంతో పట్టణాలకు దూరంగా ఉన్న ఆవాసాలు, తండాలు, గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందేవి. కాగా, పలు కారణాలతో 104వాహన సేవలను ప్రభుత్వం ఉపసంహరించుకునేందుకు నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకు వీటి ద్వారా వైద్య సేవలు పొందుతున్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సబ్‌ సెంటర్స్‌, పీహెచ్‌సీల్లో వైద్య సేవలు మెరుగుపరిచామని, వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టి సేవలను విస్తృతం చేశామని, దీంతో 104 సేవలను వినియోగించుకునే రోగుల సంఖ్య తగ్గుతోందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం దశల వారీగా 104 సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాగా, ఇప్పటి వరకు ఉన్న 27 వాహనాల్లో చాలా వరకు మరమతులకు గురై, ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పెడ్లకే పరిమితం అయ్యాయి. ఈ విభాగంలోని సిబ్బందిని ఇతర విధులకు వైద్య ఆరోగ్యశాఖ వినియోగిస్తోంది.


153 మంది సిబ్బంది

ఉమ్మడి జిల్లాలో 104కు చెందిన 27 వాహనాలు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో 11, సూర్యాపేట జిల్లాలో 9, యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 వాహనాల ద్వారా ఇప్పటి వరకు వైద్య సేవలు అందాయి. ఒక్కో 104 వాహ నం నెలలో 50 గ్రామాలను సందర్శించి అవసరమైన సేవలను అందించింది. వీటిలో 153మంది ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సహాయ సిబ్బంది విధులు నిర్వహించారు. కాగా, 104 సేవలను దశల వారీగా నిలిపివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ విభాగంలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌కు చెందిన 153మంది సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది. 14 ఏళ్లుగా వీరు కనీస వేతనాలతోనే వైద్య సేవలు అందిస్తూ ఉద్యోగ భద్రతపై ఆశలు పెంచుకున్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో వీటిపై ఆధారపడిన సిబ్బంది కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. తమను జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో కాంట్రాక్టు విధానంలో తీసుకోవాల ని ఇటీవలే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీ్‌షరావును కలిసి వీరు కోరారు. అయితే ఎన్‌హెచ్‌ఎంలో డ్రైవర్‌ పోస్టులు లేవు. దీంతో ఇప్పటి వరకు సంచార వైద్య సేవలందించిన 104 వాహన డ్రైవర్ల భవిష్యత్‌ ప్రమాదంలో పడింది.


ఉద్యోగ భద్రత కల్పించాలి : ముదిగొండ శివప్రసాద్‌, 104 వాహన ఉద్యోగి, భువనగిరి

ఉమ్మడి జిల్లాలో 14 ఏళ్లుగా 104 వాహనాల ద్వారా ప్రజలకు విస్తృత వైద్య సేవలు అందాయి. కరోనా ఆపత్‌ కాలంలోనూ సేవలు కొనసాగించాం. అలాగే ఇతర విధుల్లోనూ పాల్గొంటున్నాం. అయితే ప్రభుత్వం 104 వాహనాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో వీటిపై ఆధారపడిన మేం వీధులపాలు కావాల్సిందే. వాహనాల ఉపసంహరణతో ప్రజలకు ప్రత్యామ్నాయ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్టుగానే, మాకు సైతం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి.


Updated Date - 2022-01-03T06:24:50+05:30 IST