కోరలు చాస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-07-01T10:44:28+05:30 IST

కరోనా కోరలు చాస్తోంది. జిల్లాలో రికార్డులు బద్దలు కొడుతోంది. మంగళవారం ఒక్కరోజే 104 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కోరలు చాస్తున్న కరోనా

ఒకే రోజు 104 పాజిటివ్‌ కేసులు

భయాందోళనలో జనం

వర్షాలతో మరింత వణుకు

అనంతలో ఆంక్షలు మరింత కఠినం

నేటి నుంచి కంటైన్మెంట్‌ జోన్లలో వాహన రాకపోకలు బంద్‌

పాతూరులో పాదచారులకు మాత్రమే అనుమతి


అనంతపురం వైద్యం/క్రైమ్‌, జూన్‌ 30: కరోనా కోరలు చాస్తోంది. జిల్లాలో రికార్డులు బద్దలు కొడుతోంది. మంగళవారం ఒక్కరోజే 104 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇది అధికారులు, ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పది రోజుల్లో పరిస్థితి భయానకంగా మారింది. తాజాగా నమోదైన 104 కేసులతో కలిపి జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం బాధితుల సంఖ్య 1571కి చేరింది. ఇందులో 915 మంది కోలుకుని, డిశ్చార్జ్‌ అయ్యారు. 8 మంది మరణించారు. 647 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లా కేంద్రంలో కరోనా జడలు విప్పుతోంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం నగరంలో 600కి పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో కట్టుదిట్టమైన చర్యలకు అధికార యంత్రాంగం నడుం బిగిస్తోంది. ఇప్పటికే 20 ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా నిర్ణయించి, అధికారులు రాకపోకలను నియంత్రించే పనిలో పడ్డారు. మంగళవారం జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు, జాయింట్‌ కలెక్టర్‌ సిరి పాతూరు కూరగాయల మార్కెట్‌ను తరలించేందుకు వివిధ ప్రాంతాలను పరిశీలించారు. జనం గుమికూడకుండా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో కొత్త ప్రాంతాలకూ కరోనా విస్తరిస్తుండటం మరింత ఆందోళనకు లోనుచేస్తోంది. 


నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు మరింత కఠినం చేశారు. కంటైన్మ్‌ంట్‌ జోన్లలో వాహన రాకపోకలు నిషేఽ దించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మంగళవారం రాత్రి నుంచి ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు, తదితర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పాతూరు, తిలక్‌రోడ్డు, గాంధీబజార్‌, గుత్తిరోడ్డు, నీలం సర్కిల్‌ మీదుగా వాహన రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. దీంతో ఆయా ప్రాంతాలకు కాలినడకను వెళ్లాల్సిందే. నిబంధనలు తప్పక పాటించాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.


పురంలో ఒకరికి పాజిటివ్‌

పట్టణంలోని లక్ష్మీపురంలో ఒకరికి కరోనా సోకింది. మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో అనుమానితులు పరీక్షలకు పరుగులు పెడుతున్నారు.


కొత్తచెరువు: మండల కేంద్రంలో ఉంటూ కియ పరిశ్రమలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇతడిది కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం.


పెనుకొండ: పట్టణంలోని వజ్రాలపేటలో ఉంటూ కియలో పనిచేస్తున్న తమిళనాడు వాసికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. అదే ప్రాంతంలో ఉన్న బాబయ్యదర్గాను మూసివేయించారు.


ఉరవకొండ: పట్టణానికి చెందిన ఐదుగురిలో కరోనా అనుమానిత లక్షణాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో డ్రైవర్స్‌ కాలనీకి చెందిన నలుగురు, అంబేడ్కర్‌ నగర్‌ వాసి ఒకరు ఉన్నారన్నారు.


రాయదుర్గంటౌన్‌: పట్టణంలో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయిందని కొవిడ్‌-19 వైద్యుడు రంగస్వామి తెలిపారు. 16వ సచివాలయంలో పనిచేస్తున్న ఇద్దరు వార్డు వలంటీర్లతోపాటు 6వ వార్డులో నివాసముంటున్న ఓ యువకుడు వైరస్‌ బారిన పడ్డాడన్నారు. వీరిని అనంతపురం ఐసోలేషన్‌కు తరలించనున్నారు.


బుక్కరాయసముద్రం: మండలకేంద్రంలో 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దుకాణదారుడు, బ్యాంకు ఉద్యోగి, వీరభద్ర కాలనీలో ముగ్గురు వైరస్‌ బారిన పడ్డారు. దీంతో మండలంలో కేసుల సంఖ్య 35కి చేరింది.


తాడిపత్రి: జిల్లాకేంద్రంలోని బ్యాంకులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. తాడిపత్రి పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌లో నివాసముంటున్న ఆమె రోజూ విధి నిర్వహణ నిమిత్తం అనంతపురం వెళ్లివస్తున్నారు. పట్టణంలోని పడమటిగేరికి చెందిన మెడికల్‌ రెప్రజెంటేటివ్‌, పుట్లూరు మండలం తక్కళ్లపల్లికి చెందిన వ్యక్తి పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.


క్వారంటైన్‌లో ఉండి, రెండురోజుల క్రితం వచ్చారు. క్వారంటైన్‌ సమయంలో నమూనాలు తీసుకున్నారు. పాజిటివ్‌ అని తేలటంతో ఐసోలేషన్‌కు తరలించారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఆంక్షలను కఠినతరం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలు తెరచుకోవాలని ఆయన తెలిపారు.


కరోనా కట్టడిపై ఆటోలతో అవగాహన

అనంతపురంలో కరోనా కట్టడికి వన్‌టౌన్‌ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆటోలతో ప్రజలకు అవగాహన కల్పించారు. సీఐ ప్రతాపరెడ్డి స్థానిక వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కంటైన్మ్‌ంట్‌ జోన్లలో ఆటోలలో మైకుల ద్వారా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను తెలియజే శారు. ప్రతిఒక్కరూ మాస్కులు, గ్లౌజులు ధరించి, భౌతికదూరం పాటించాలని వివరించారు.

Updated Date - 2020-07-01T10:44:28+05:30 IST