ఐసోలేషన్‌లో 104!

ABN , First Publish Date - 2020-08-08T07:25:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గత నెల మొదటి వారంలో ప్రారంభించిన 104 కొత్త అంబులెన్స్‌ల సేవలు ఐదు వారాలు అయినా ఇంకా అందుబాటులోకి రాలేదు.

ఐసోలేషన్‌లో 104!

గత నెలలో ఆర్భాటంగా ప్రారంభోత్సవం

ఐదు వారాలు దాటినా రోడ్డెక్కని అంబులెన్స్‌లు

ఆస్పత్రుల ఆవరణల్లో విశ్రాంతి తీసుకుంటున్న వాహనాలు

ప్రభుత్వం నుంచి అందని ఆదేశాలు

సీజనల్‌ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న గ్రామీణులు

పొంచిఉన్న కరోనా వైరస్‌ ముప్పు

వైద్యానికి దూరంగా ప్రైవేటు డాక్టర్లు

పల్లెల్లో జాడలేని ఆర్‌ఎంపీలు

శివారు గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందని వైనం


విశాఖపట్నం/ నర్సీపట్నం టౌన్‌/ చింతపల్లి/ మాడుగుల రూరల్‌, జూలై 7: రాష్ట్ర ప్రభుత్వం గత నెల మొదటి వారంలో ప్రారంభించిన 104 కొత్త అంబులెన్స్‌ల సేవలు ఐదు వారాలు అయినా ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వ ఆస్పత్రు లకు దూరంగా వున్న గ్రామాల్లో ప్రతినెలా వైద్య శిబిరాలు నిర్వహించడం కోసం మంజూరు చేసిన ఈ వాహనాలు.... ఆయా మండలాల్లోని పీహెచ్‌సీ/ సీహెచ్‌సీల ఆవర ణల్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. గ్రామాల్లో 104 అంబులెన్స్‌ల ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించకపోవడంతో వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన మందులను బయట షాపుల్లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు దూరం వున్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి సుమారు 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 104 అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చింది. వైద్య సేవల కోసం ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుంది.


తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా దీనిని కొనసాగించింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం 104 వైద్య సేవల్లో మరిన్ని మార్పులు తీసుకువస్తున్నామని, మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పి... పాత వాహనాలను పక్కన పెట్టి కొత్తవాహనాలను కొనుగోలు చేసింది.అంబులెన్స్‌ల రూపురేఖలు మార్చడంతోపాటు కొత్త సంస్థతో వైద్య సేవల ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా జిల్లాకు 42 కొత్త వాహనాలను మంజూరు చేసింది. గత నెల ఒకటో తేదీన విజయవాడలో సీఎం జగన్‌, తరువాత జిల్లా కేంద్రంలో మంత్రి, కలెక్టర్‌, ఆ తరువాత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు వీటిని ప్రారంభించారు. ఇంతవరకు బాగానే వున్నప్పటికీ...  ‘104 సంచార వైద్యశాల’ల సేవలు ఇంతవరకు అందుబాటులోకి రాలేదు.


అటు సీజనల్‌ వ్యాధులు...ఇటు కరోనా మహమ్మారి

వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రజలు వైరల్‌ జ్వరాలు, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అతిసార, మలేరియా, టైఫాయిడ్‌ వంటివాటి బారిన పడుతుంటారు. పీహెచ్‌సీ/ సీహెచ్‌సీలకు దూరంగా వున్న గ్రామాల్లో ప్రైవేటు వైద్యులు కూడా అందుబాటులో వుండరు. సీజనల్‌ వ్యాధులబారిన పడిన వారితోపాటు మధుమేహం, రక్తపోటు, గుండె, కిడ్నీ సంబంధ సమస్యలు వున్న వారికి 104 అంబులెన్స్‌లే పెద్ద దిక్కు. వైద్య పరీక్షలతోపాటు అవసరమైన మందులు కూడా ఇస్తుంటారు. శివారు గ్రామాల ప్రజలకు 104 అంబులెన్స్‌లు ఎంతో దోహదపడుతున్నాయి. కానీ గత నెలలో కొత్తగా ప్రారంభించిన 104 అంబులెన్స్‌ వాహనాలు ఇంతవరకు వైద్య సేవలు ప్రారంభించకపోవడంతో మారుమూల గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులబారిన పడినవారు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు.


మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కరోనాకు భయపడి ప్రైవేటు వైద్యులు, గ్రామాల్లో సేవలు అందిస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలు వైద్యసేవలకు దూరంగా ఉంటున్నారు. అటు 104 అంబులెన్స్‌ల సేవలు అందకపోవడం, ఇటు ప్రైవేటు వైద్యులు ముందుకు రాకపోవడంతో మారుమాల గ్రామాల్లో సీజనల్‌ వ్యాధుల బారినపడిన వారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వున్న వారు సకాలంలో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 



మాడుగుల నియోజకవర్గంలోని ప్రతి మండలానికి(మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు) ఒకటి చొప్పున నాలుగు 104 వాహనాలు మంజూరు అయ్యాయి. ఇవి జూలై ఒకటో తేదీన మండలాలకు చేరాయి. దేవరాపల్లి మండలానికి కేటాయించిన 104 అంబులెన్స్‌ను జూలై నాలుగో తేదీన ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు ప్రారంభించారు. కానీ ఇంతవరకు  ఎక్కడా వైద్య శిబిరాలు నిర్వహించలేదు. ఐదు వారాల నుంచి ఆయా పీహెచ్‌సీ/ సీహెచ్‌సీల ఆవరణల్లో విశ్రాంతి తీసుకుంటున్నాయి. మాడుగుల మండలానికి కేటాయించిన అంబులెన్స్‌కు వైద్యుడిని నియమించలేదు. మిగిలిన మూడు మండలాల అంబులెన్స్‌లకు పూర్తిస్థాయిలో సిబ్బంది వున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఇంతవరకు ఆదేశాలు రాకపోవడంతో గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంలేదని చెబుతున్నారు. డాక్టర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లను స్థానిక ఆస్పత్రుల్లో కొవిడ్‌ సేవల కోసం వినియోగించుకుంటున్నారు.


నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం మండలాలకు కేటా యించిన 104 అంబులెన్స్‌లకు డాక్టర్ల నియామకం జరగలేదు. ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా పని చేయడానికి డాక్టర్లు ముందుకు రావడం లేదని, మిగిలిన సిబ్బందిని కొవిడ్‌ సేవలకు ఉపయోగించుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. చింతపల్లి, జీకేవీధి మండలాలకు జూలై 5వ తేదీన 104 అంబులెన్స్‌ వాహనాలు వచ్చాయి. ఇంతవరకు వైద్య సేవలు ప్రారంభించలేదు. 


అధికారులు ఏమన్నారంటే....

ఐదు వారాలు అయినా 104 అంబులెన్స్‌ల వైద్య సేవలు ప్రారంభం కాకపోవడంపై జోనల్‌ మేనేజర్‌ లోకశ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా... జిల్లా కలెక్టర్‌ నుంచి ఆదేశాలు రాకపోవడంతో వైద్య సేవలు ప్రారంభించ లేదని చెప్పారు. ఇదే విషయాన్ని జిల్లా మేనేజర్‌ శ్రీనివాస్‌ను సంప్రదించగా.... ప్రస్తుతం కరోనా వైరస్‌ విపరీతంగా విస్తరిస్తున్నందున వైరస్‌ వ్యాప్తికి 104 వాహనాలు కారణం కాకూడదన్న ఉద్దేశంతోనే అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదని చెప్పారు. అయినప్పటికీ అధికారులు నుంచి అనుమతి వచ్చిన వెంటనే సేవలు ప్రారంభిస్తామన్నారు.  


వైద్యుల కొరత

జిల్లాకు 104 అంబులెన్స్‌లు 42 మంజూరుకాగా వీటిల్లో పని చేసేందుకు 42 మంది డ్రైవర్లు, 42 మంది డేటాఎంట్రీ ఆపరేటర్లు, అంతే సంఖ్యలో వైద్యులు కావాలి.  డ్రైవర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్ల పోస్టులను భర్తీ చేశారు. ఇప్పటి వరకు 33 మంది డాక్డర్‌ పోస్టులు మాత్రమే భర్తీ అయ్యారు. మరో తొమ్మిది మంది వైద్యులను నియమించాల్సి ఉంది. 


గతంలో...

గతంలో ప్రతి అంబులెన్స్‌ వాహనంలో డాక్టర్‌, ఫార్మసిస్ట్‌, ఏఎన్‌ఎం, ల్యాబ్‌ టెక్నీషియన్‌, డ్రైవర్‌, వాచ్‌మన్‌... మొత్తం ఆరుగురు వుండేవారు. ప్రతి నెలా నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం 104 వాహనం ఆయా గ్రామాలకు వచ్చేది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించేవారు. వీరికి నెలకు సరిపడ మందులు ఇచ్చేవారు. 


ప్రస్తుతం...

ఒక్కో అంబులెన్స్‌ వాహనంలో వైద్యుడు, డేటాఎంట్రీ ఆపరేటర్‌, డ్రైవర్‌... ముగ్గురు మాత్రమే వున్నారు. మండలానికి కేటాయించిన 104 అంబులెన్స్‌ వాహనం షెడ్యూల్‌ ప్రకారం నెలలో ఒకసారి సామాజిక/ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రెండు కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కువ దూరంలో వున్న గ్రామ సచివాలయాల వద్దకు వెళుతుంది. దాని పరిధిలో వున్న గ్రామాల ప్రజలు ఇక్కడకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్‌, రక్తపరీక్షలు, మందులు పంపిణీ వంటి పనులను గ్రామ సచివాలయాల్లోని ఏఎన్‌ఎంలు చేయాలి. 


గిరిజన ప్రాంతంలో ఇబ్బందే...

ఏజెన్సీలో గ్రామ సచివాలయాల పరిధి చాలా అధికంగా వుంది. ఒక గ్రామ సచివాలయం పరిధిలో 20 నుంచి 30 గ్రామాలు వున్నాయి. సచివాలయానికి గరిష్ఠంగా 10 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు వున్నాయి. 104 అంబులెన్స్‌ల వైద్య సేవల కోసం గ్రామాల నుంచి వాహనాల్లో లేదా నడుచుకుంటూ రావాలి.

Updated Date - 2020-08-08T07:25:00+05:30 IST