కాల్‌ చేస్తే.. కలవరమే..!

ABN , First Publish Date - 2021-05-17T05:14:24+05:30 IST

రాష్ట్రస్థాయిలో ఏర్పాటుచేసిన..

కాల్‌ చేస్తే.. కలవరమే..!

జిల్లాలో అక్కరకు రాని 104 సేవలు..

బాధితులకు ప్రాణ సంకటం..

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారినీ పట్టించుకోని వైనం

కనీసం అంబులెన్స్‌ పంపే దిక్కూ లేదు

ఆసుపత్రిలో బెడ్‌ అందని పరిస్థితి

సరిగ్గా స్పందించని 104 సిబ్బంది

బాధితుల నుంచి విమర్శలు


సీఎం సార్‌ ఏమన్నారంటే..

104 కాల్‌ సెంటర్‌.. దటీజ్‌ అవర్‌ సిగ్నేచర్‌.. వి ఆర్‌ సైనింగ్‌ ఆఫ్‌.. వి నీడ్‌ టు ఓన్‌ దెమ్‌.. జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు పూర్తిగా ఓన్‌ చేసుకోవాలని రిక్వెస్ట్‌ చేస్తున్నాను. రాష్ట్రస్థాయిలో ఏర్పాటుచేసిన 104 కాల్‌ సెంటరుకు ప్రతి జిల్లాలోని 104 కాల్‌ సెంటర్లను అనుసంధానం చేయాలి. ప్రభుత్వపరంగా వైద్య సహాయం కోసం కరోనా బాధితులు ఫోన్‌ చేసినప్పుడు రెస్పాన్స్‌ సరిగ్గా లేదనే మాట వస్తే కలెక్టర్‌ తల తీసేసినట్టుగా భావించాలి. జాయింట్‌ కలెక్టర్లు, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జులు కూడా అదే రకమైన ప్రెస్టేజ్‌తో పనిచేయాలి. ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేయకపోవడం, సరిగ్గా రిప్లై ఇవ్వకపోవడం వంటి ఫిర్యాదులు ఉండకూడదు. హాస్పిటల్‌లో బెడ్స్‌ను సిద్ధంగా ఉంచి బాధితులను చేర్పించడం లేదా క్వారంటైన్‌ సెంటరులో చేర్పించడం, ఎస్‌ఎల్‌ఏ (సర్వీస్‌ లెవల్‌ అగ్రిమెంట్‌) ప్రకారం మందులు సరఫరా చేయడం.. ఇవన్నీ మన బాధ్యతలే. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో 104 నెంబరుకు ఫోన్‌ చేస్తే ప్రతి పేదవాడికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉచితంగా కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌ అందిస్తున్న రాష్ట్రం మనదేనని గర్వంగా చెప్పగలను. ఈ పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు.


రాష్ట్రంలో 25వేల మంది కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. కాల్స్‌ అన్నింటినీ రిసీవ్‌ చేసుకునేందుకు గానూ రాష్ట్రస్థాయిలోనూ, జిల్లాస్థాయిలోనూ కాల్స్‌ సెంటర్లకు లైన్స్‌, అవసరమైన సిబ్బందిని పెంచుకోవాలి. ప్రతి కాల్‌ను చాలా ముఖ్యమైనదిగా గుర్తు పెట్టుకోవాలి. మన కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు ఫోన్‌ చేసినప్పుడు మనం ఏవిధంగా స్పందిస్తామో అదే రకమైన రెస్పాన్స్‌ కరోనా బాధితులకు ఇవ్వగలగాలి. కొవిడ్‌ టెస్టింగ్‌, టెలీ కన్సల్టేషన్‌, ఆసుపత్రుల్లో బెడ్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌.. ఏదైనా సరే ఎస్‌ఎల్‌ఏ ప్రకారం 3 గంటల్లోగా బాధితులకు అవసరమైన సేవలందించేలా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జులు బాధ్యత తీసుకోవాలి.

..కరోనా విపత్కర పరిస్థితులపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నతాధికారులకు ఇచ్చిన ఆదేశాలివి. 


క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేంటంటే..

రెండు రోజుల క్రితం విజయవాడకు చెందిన ఓ బ్యాంక్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆందోళనకు గురైన ఆయన బ్రీతింగ్‌ సమస్య ఎక్కువవుతుండటంతో వెంటనే ఆసుపత్రిలో ఆక్సిజన్‌ బెడ్‌ కోసం 104 కాల్‌ సెంటరుకు ఫోన్‌ చేశారు. ఆయన వివరాలు నమోదు చేసుకున్న రాష్ట్రస్థాయి కాల్‌ సెంటర్‌ సిబ్బంది విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి 104 కాల్‌ సెంటరుకు పంపించారు. ఈ కాల్‌ సెంటరులో ఉన్న తెలిసిన ఉద్యోగి ద్వారా సిఫార్సు చేయించుకుంటే డోర్నకల్‌ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో రెండు ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయని చెప్పి పంపించారు. నాలుగైదు గంటలు కూర్చోబెట్టిన ఆసుపత్రి సిబ్బంది చివరికి బెడ్స్‌ ఖాళీ లేవని చెప్పి పంపేశారు.


నందిగామ మండలం తొర్రగుడిపాడులో 62 ఏళ్ల చావా ఝాన్సీ తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో మే 13న 104కు ఫోన్‌ చేశారు. ఆ తర్వాత విజయవాడ సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి ఆమెకు ఫోన్‌ వచ్చింది. 104 వాహనం గంటలో మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్తుందని చెప్పారు. 24 గంటలు గడిచినా దాని జాడ లేదు. 14వ తేదీ ఉదయం ఆమె కన్నుమూసింది.  


విజయవాడ, ఆంధ్రజ్యోతి: కరోనా బాధితులెవరైనా 104కు ఫోన్‌చేస్తే అక్కడి సిబ్బంది కాల్‌ లిఫ్ట్‌ చేసి పేరు, ఫోన్‌ నెంబరు, చిరునామా.. వివరాలు తీసుకుంటారు. ఆ కాలర్‌కు ఒక సీరియల్‌ నెంబరు ఇచ్చి సంబంధిత జిల్లాలోని 104 కాల్‌ సెంటరుకు పంపిస్తారు. ఇలా మన జిల్లాకు చెందిన కరోనా బాధితుల ఫోన్‌ కాల్స్‌ రోజూ 750 నుంచి 800 వరకు లాగిన్‌లో ఉంటున్నాయి. వీటిలో 90 శాతానికి పైగా కాల్స్‌ హాస్పిటల్స్‌లో అడ్మిషన్లు కావాలనే అభ్యర్థనలకు సంబంధించినవే. వాటన్నింటినీ విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌-19 కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ (104 కాల్‌ సెంటర్‌)కు పంపిస్తున్నారు. ఇక్కడ కాల్‌ సెంటరులో మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్న 80 నుంచి 100 మంది సిబ్బంది వచ్చిన కాల్స్‌ ఆధారంగా బాధితులకు ఫోన్లు చేస్తున్నారు. ఆసుపత్రిలో అడ్మిషన్‌ కావాలని అడిగారు కదా? సమస్య ఏంటని ప్రశ్నిస్తున్నారు. కరోనా సోకడం వల్ల ఊపిరి ఆడటం లేదని, ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ 85కు పడిపోయిందని, బాగా నీరసించిపోయి లేవలేని స్థితిలో ఉన్నానని, వెంటనే ఆక్సిజన్‌ అందించాలని, ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ కావాలని, వెంటిలేటర్‌తో కూడిన బెడ్‌ కావాలని బాధితులు, వారి బంధువులు మొర పెట్టుకుంటున్నారు. ఆ వివరాలన్నింటినీ నమోదు చేసుకుంటున్న సిబ్బంది 108 విభాగానికి వివరాలను పంపిస్తున్నారు. అక్కడితో తమ పని అయిపోయిందని చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ, ముఖ్యమంత్రి చెప్పినట్టు మూడు గంటల్లో కాదు కదా.. మూడు రోజులు వేచి చూసినా ఆ కరోనా బాధితుడిని ఆసుపత్రికి తరలించడానికి 108 వాహనం వెళ్లదు. ఎందుకని అడిగితే ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీలు లేకపోవడమేనని చెప్పి తప్పించుకుంటున్నారు.

 

ఆన్‌లైన్‌లో ఆక్సిజన్‌ బెడ్స్‌ నిల్‌ 

నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రుల్లో రోజూ ఖాళీ అవుతున్న వెంటిలేటర్‌, ఆక్సిజన్‌, నాన్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీల వివరాలను ఆయా ఆసుపత్రుల నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. కానీ, ఏ ఆసుపత్రి నుంచి బెడ్‌ వేకెన్సీ రిపోర్టును ఆన్‌లైన్‌లో చూపించడం లేదు. ఉదాహరణకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 750 పడకలుండగా, అవన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. ఇక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితులు రోజుకు 40 మందికి పైగా మరణిస్తుండటంతో ఆ మేరకు బెడ్స్‌ ఖాళీ అవుతున్నాయి. ఇలా ఏరోజుకారోజు ఖాళీ అవుతున్న బెడ్స్‌ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడం లేదు. ఆసుపత్రిలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఖాళీ అవుతున్న బెడ్స్‌ను ఎప్పటికప్పుడే స్వాధీనం చేసుకుని తమ బంధువులని, తెలిసిన వారని చెబుతూ కరోనా బాధితులను పడుకోబెడుతున్నారు. కొంతమంది బెడ్స్‌ను అమ్ముకుంటూ రూ.వేలల్లో సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రులు, ప్రభుత్వ అనుమతులు పొందిన 70 పైగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. 


ప్రైవేట్‌ దోపిడీ..

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్‌ను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఏ ఒక్క ప్రైవేట్‌ ఆసుపత్రిలోనూ అమలు కావడం లేదు. కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బెడ్స్‌ ఖాళీలున్నప్పటికీ ధనవంతులైన కరోనా బాధితులకు రూ.లక్షల్లో ప్యాకేజీలు నిర్ణయించి అమ్ముకుంటున్నారు. ఈ కారణంగా 104 కాల్‌ సెంటరుకు ఫోన్‌ చేస్తున్న బాధితులకు ఆక్సిజన్‌ బెడ్స్‌ ఒక్కటి కూడా అందుబాటులో ఉండటం లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులు 104కు కాల్‌ చేయడం ద్వారా ఆసుపత్రిలో ఉచితంగా ఆక్సిజన్‌ బెడ్‌ పొందడమనేది దుర్లభంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కొవిడ్‌ ఆసుపత్రుల్లో బెడ్స్‌ ఖాళీలను ఏ రోజూ ఆన్‌లైన్‌లో ఖాళీగా చూపించట్లేదు. ప్రతి ఆసుపత్రిలోనూ బెడ్స్‌ను అమ్ముకుంటున్నారు. ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రతి కొవిడ్‌ ఆసుపత్రికి జిల్లాస్థాయి అధికారిని నోడల్‌ ఆఫీసర్లుగా నియమించినా వారంతా ఏమీ పట్టించుకోకుండా ఉత్సవ విగ్రహాల్లా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


కాల్‌ సెంటరుపై ఆధారపడితే ఇక అంతే.. 

ప్రైవేట్‌ ఆసుపత్రులకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించుకునే ఆర్థిక స్థోమత లేని కరోనా బాధితులు 104 కాల్‌ సెంటర్‌పైనే ఆశలు పెట్టుకుని ఇళ్ల దగ్గరే మందులు వాడుతూ వారం పదిరోజుల వరకు ఎదురుచూస్తూ ఉండిపోతున్నారు. సహాయం కోసం పదేపదే 104 కాల్‌ సెంటరుకు ఫోన్లు చేస్తున్నా కలవడం లేదు. ఫోన్లు కలిసినా స్పందన లేకపోవడంతో అనేక మంది బాధితులు ఇళ్ల దగ్గరే చనిపోతున్నారు. కొంతమంది ఎదురుచూస్తూ ఉండలేక అప్పోసొప్పో చేసుకుని ప్రైవేట్‌  ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఏ దిక్కూ లేని బాధితులు ఇళ్లలోనే ఉండిపోతున్నారు. కాల్‌ సెంటరుకు ఫోన్‌ చేసిన బాధితుల వివరాలతో రిజిస్టర్‌ చేసిన కేసులను పెండింగ్‌లో చూపించడానికి లేదు. ఒకటి, రెండు రోజుల్లోనే వాటిని క్లోజ్‌ చేసేస్తున్నారు. 

Updated Date - 2021-05-17T05:14:24+05:30 IST