మిగులు ఉద్యోగుల ఆర్థిక కష్టాలు

ABN , First Publish Date - 2021-03-07T04:46:54+05:30 IST

104 విభాగంలో పని చేస్తున్న వారందరినీ మిగులు ఉద్యోగుల కింద ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. 14 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు.

మిగులు ఉద్యోగుల  ఆర్థిక కష్టాలు
ఉష

45 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి జీతాల్లేవ్‌!

14 నెలలుగా తిప్పుకుంటున్న అధికారులు

పరిధి పేరుతో కాలయాపన

నెల్లూరు (వైద్యం), మార్చి 6 : 104 విభాగంలో పని చేస్తున్న వారందరినీ మిగులు ఉద్యోగుల కింద ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. 14 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. జీతాలు ఇవ్వండి మహాప్రభో అని ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు. పాలకులైనా తమ వేదనను అర్థం చేసుకోవాలని వారు మొరపెట్టుకుంటున్నారు. 104 సంచార వైద్యవిభాగంలో హెచ్‌ఎంఆర్‌ఐ సంస్థ కింద పని చేసేందుకు 2008లో 160 మందిని ఔట్‌సోర్సింగ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మొదట్లో 104 వాహనాల్లోనే వీరంతా పని చేయగా, 2010లో మిగులు ఉద్యోగుల కింద 45 మంది ఫార్మాసి్‌స్టలు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను పినాకిని ఏజెన్సీకి అప్పగించి, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలలో నియమించారు. అయితే, పినాకిని ఏజెన్సీ కాలపరిమితి గతేడాది జూలైలో ముగిసింది. అయితే వీరి వేతనాలు మాత్రం ఎవరు ఇవ్వాలో వైద్య ఆరోగ్య శాఖలోనే స్పష్టత లేదు. ఈ గందరగోళంపై మిగులు ఉద్యోగుల సంఘం నేతలు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారిని కలిసినా తమ పరిధిలోకి రారనే సమాధానం ఎదురైంది. వైద్య ఆరోగ్యశాఖ  కమిషనర్‌ను కలిసినా అదే చేదు అనుభవం ఎదురైంది. 

86.10 లక్షల బకాయిలు

104 మిగుల ఉద్యోగులు 45 మంది వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు 27 మంది, 12 మంది ఫార్మాసి్‌స్టలు, ఏడుగురు ల్యాబ్‌ టెక్నిషియన్లు ఉన్నారు. వీరిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.15వేలు, ఫార్మాసిస్ట్‌, ఎల్టీలకు రూ.17,500 వేతనాలు చెల్లిస్తున్నారు. వీరందరికీ 14 నెలల (గతేడాది జనవరి నుంచి) వేతన బకాయిలు రూ.86.10 లక్షలు చెల్లించాల్సి ఉంది. పినాకిని ఏజెన్సీ మాత్రం జనవరి నుంచి జూలై వరకు బకాయిలు చెల్లించాలి. ఆ తర్వాత వీరి సేవలు కొనసాగుతూనే ఉన్నా ప్రస్తుతం వేతనాలకు మాత్రం ప్రభుత్వం బడ్జెట్‌ మాత్రం విడుదల చేయలేమంటూ మీరు మా పరిధిలోకి రారంటూ వైద్య శాఖ ఉన్నతాధికారులు చెబుతుండటంతో ఏం చేయాలో తోచని దుస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. 


మాకు అన్యాయం జరుగుతుంది

13 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్నాం. మొదట్లో 104లో పని చేస్తున్న మమ్మల్ని పీహెచ్‌సీలకు, జిల్లా కార్యాలయానికి బదిలీ చేశారు. మొదట్లో వేతనాలు సక్రమంగా వచ్చేవి. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. మాకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలి.

- ఉష, 104 మిగుల ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు


వెంటనే ఆదుకోవాలి

104 మిగుల ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. 14 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సరికాదు. కాంట్రాక్టు ఉద్యోగు ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వెంటనే వేతనాలు చెల్లించాలి. 

- చేజెర్ల సుధాకర్‌, హంస జిల్లా అధ్యక్షుడు





Updated Date - 2021-03-07T04:46:54+05:30 IST