భారత‌దేశపు తొలి ఓటర్‌కు కరోనా టీకా..!

ABN , First Publish Date - 2021-03-10T00:27:13+05:30 IST

కరోనా టీకాలపై ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్న సమయంలో భారత్ దేశపు తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి ఓ స్ఫూర్తివతంమైన నిర్ణయం తీసుకున్నారు. టీకాపై అనుమానాలు అర్థరహితమని స్పష్టం చేస్తూ ఆయన మంగళవారం నాడు కరోనా టీకా తీసుకున్నారు.

భారత‌దేశపు తొలి ఓటర్‌కు కరోనా టీకా..!

న్యూఢిల్లీ: కరోనా టీకాలపై ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్న సమయంలో భారత్ దేశపు తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి ఓ స్ఫూర్తివతంమైన నిర్ణయం తీసుకున్నారు. టీకాపై అనుమానాలు అర్థరహితమని స్పష్టం చేస్తూ ఆయన మంగళవారం నాడు కరోనా టీకా తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ కిన్నూర్ జిల్లాకు చెందిన నేగి వయసు 103 ఏళ్లు. ఆయన భారత్‌దేశపు తొలి ఓటరే కాకుండా.. అందరికంటే సీనియర్ ఓటర్ కూడా..! టీకా తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజలందరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచించారు. కుటుంబసభ్యులతో పాటు వ్యాక్సినేషన్ కేంద్రానికి చేరుకున్న ఆయనకు డాక్టర్లు టీకా వేసి.. అరగంట పాటు ఆయన ఆరోగ్యం తీరుతెన్నులను పరిశీలించారు. అంతా సవ్యంగానే ఉందని నిర్ధారించుకున్నాక నెగీని ఇంటికి పంపించారు.


శ్యామ్ నెగీ 1917 జులై 1న జన్మించారు. స్కూల్ ఉపాధ్యాయుడిగా చేసి పదవీ విరమణ పొందారు. స్వతంత్ర భారత దేశంలో 1951-52లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో నెగీ ఓటు వేశారు. నాటి నుంచి నేటి వరకూ జరిగిన ప్రతి పార్లమెంట్, శాసనసభ, స్థానికల్లో నెగీ ఓటు వేశారు. తాను ఎలా దేశంలో తొలి ఓటర్ అయిందీ ఇప్పటికీ స్పష్టంగా గుర్తుందని అంటారు నెగీ! భారత దేశంలో తొలి ఎన్నికలు ఫిబ్రవరి 1952లో జరిగాయి. అయితే హిమాచల్ ప్రదేశ్‌లోని మారుమూలన ఉన్న గిరిజన ప్రాంతాల్లో కాస్తంత ముందుగానే ఎన్నికలు జరిగాయి. చలికాలం కారణంగా వాతావరణం వల్ల ఆటంకం ఏర్పడుతుందేమోననే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ఉపాధ్యాయుడుగా ఉన్న ఆయనకు ఎన్నికల విధులను అప్పగించింది. ఆ సందర్భంగా నెగీ చిని నియోజకవర్గంలో (ప్రస్తుత కిన్నార్ నియోజకవర్గం) తొలిసారిగా ఓటు వేశారు. 

Updated Date - 2021-03-10T00:27:13+05:30 IST