102వ రోజు నిరసన

ABN , First Publish Date - 2021-02-25T04:59:55+05:30 IST

దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను బీడు భూములుగా చూపి నిర్వీర్యం చేయాలనుకోవడం దుర్మార్గమని ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మండిపడ్డారు.

102వ రోజు నిరసన
ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఎదుట ధర్నా చేస్తున్న వ్యవసాయ కార్మికులు

నంద్యాల, ఫిబ్రవరి 24: దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను బీడు భూములుగా చూపి నిర్వీర్యం చేయాలనుకోవడం దుర్మార్గమని ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మండిపడ్డారు. బుధవారం సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్‌, నాయకులు ఏవీ రమణ, ఖాదర్‌వలి, యల్లమ్మ, నాగేశ్వరమ్మ ఆధ్వర్యంలో 102వ రోజు ఆందోళనను నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ నంద్యాలకు మంజూరైన వైద్య కళాశాలను ప్రభుత్వ భూముల్లో నిర్మించాలని, లేకుంటే ప్రైవేటు భూముల కొనుగోలు కోసం రూ.200 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో వైద్య కళాశాలను ఏర్పాటు చేయవద్దని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ పరిశోధనా రంగంలో సరికొత్త వంగడాలను సృష్టించిన పరిశోధనా భూమిని బీడు భూములుగా కోర్టులను కూడా మోసం చేస్తుండటం దారుణమని అన్నారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి పన్నాగంతోనే ఆర్‌ఏఆర్‌ఎస్‌కు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు, ఆర్‌ఏఆర్‌ఎస్‌ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుండటం తగదని, ఇందుకు మూల్యం చెల్లించుకోకతప్పదని వారు హెచ్చరించారు. మున్సిపల్‌ ఎన్నికలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఓటు వేయాలని కోరారు. వైద్య కళాశాలకు పరిశోధనా భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 341ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోపాల్‌, పుల్లయ్య, అయ్యన్న, మైమున్నీసా, భారీ సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-25T04:59:55+05:30 IST