1,02,320

ABN , First Publish Date - 2021-05-12T05:12:32+05:30 IST

జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా సెకండ్‌వేవ్‌ మొదలైన తరువాత ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి.

1,02,320

జిల్లాలో లక్ష దాటిన కరోనా కేసులు

తాజాగా 2,371 కేసులు రాక

12 మంది మృతి

సెకండ్‌వేవ్‌లో కొవిడ్‌ కల్లోలం

ప్రతిరోజూ వేలల్లో కేసులు రాక

మే 11 రోజుల్లోనే 22,404 

గత ఏడాది మార్చి 19న మొట్టమొదటి కేసు నమోదు


విశాఖపట్నం, మే 11 (ఆంధ్రజ్యోతి):


జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ముఖ్యంగా సెకండ్‌వేవ్‌ మొదలైన తరువాత ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం కొత్తగా 2,371 కేసులు రావడంతో జిల్లాలో మొత్తం సంఖ్య లక్ష దాటింది. జిల్లాలో మొట్టమొదటి కరోనా కేసు గత ఏడాది మార్చి 19న అల్లిపురంలో నమోదైంది. నాటి నుంచి కేసులు పెరుగుతూ వచ్చాయి. ఆ నెలలో పది, ఏప్రిల్‌లో 13, మేలో 90, జూన్‌లో 787 కేసులు, జూలైలో 10,277 నమోదయ్యాయి. ఆగస్టులో గరిష్ఠంగా 25,929 మందికి వైరస్‌ సోకగా, ఆ ఒక్క నెలలో 172 మంది మృతిచెందారు. సెప్టెంబరు నుంచి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. సెప్టెంబరులో 13,434, అక్టోబరులో 5,785 మందికి, నవంబరులో 2,350, డిసెంబరులో 1,005 కేసులు వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో 582 మందికి, ఫిబ్రవరిలో అత్యల్పంగా 279 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో వైరస్‌ వ్యాప్తి పూర్తిగా తగ్గుతోందని అంతా భావించారు. అయితే, మార్చి నుంచి మళ్లీ కేసులు ప్రారంభం కావడంతో సెకండ్‌వేవ్‌ ప్రారంభమైందని అధికారులు నిర్ధారించారు. 


సెకండ్‌ వేవ్‌ విజృంభణ.. 


జిల్లాలో మార్చి నెల ఒకటో తేదీన సరిగ్గా ఏడాది తరువాత ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనని అంతా భావించారు. అయితే, ఆ తరువాత నుంచి వైరస్‌ విజృంభణ ప్రారంభమైంది. మార్చి నెలాఖరు నాటికి 1,757 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ నెలలో ప్రతిరోజూ వందలాది కేసులు నమోదయ్యాయి. చివరి వారం వచ్చేసరికి వెయ్యికిపైగా రావడంతో ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 17,618 నమోదయ్యాయి. 


11 రోజుల్లో పరాకాష్ట.. 


ఇక, మే నెలలో తారస్థాయికి చేరిందన్నట్టుగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది.  మొదటి 11 రోజుల్లోనే 22,404 కేసులు నమోదయ్యాయి. అంటే, సగటున రోజుకు రెండు వేల మంది వైరస్‌ బారినపడుతున్నారు. ఈ క్రమంలోనే కేసుల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రంలో లక్ష కేసులు దాటిన ఆరు జి ల్లాల్లో విశాఖ ఒకటిగా నిలిచింది. విశాఖతోపాటు ఈ జాబితాలో అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. కాగా, ఈ నెల ఎనిమిదో తేదీన రికార్డు స్థాయిలో 2,505 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 11 రోజుల్లోనే 22 వేలకుపైగా నమోదు కావడంతో..ఈ నెలాఖరు నాటికి పరిస్థితి ఎలా వుంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 


ఇదీ లెక్క.. 


మంగళవారం మరో 2371 కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం  కేసుల సంఖ్య 1,02,320కు చేరింది. ఇందులో 81,011 మంది కోలుకున్నారు. చికిత్స పొందుతూ మరో 12 మంది మృతిచెందడంతో మొత్తం కొవిడ్‌ మరణాలు 719కు చేరాయి. 


నిబంధనలు పాటించడం ద్వారా వైరస్‌కు అడ్డుకట్ట 

డాక్టర్‌ పీఎస్‌ సూర్యనారాయణ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి


సెకండ్‌వేవ్‌ ప్రారంభమైన తరువాత జిల్లాలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కొద్దిరోజులపాటు జాగ్రత్తగా వుంటే వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు అవకాశముంది. ఈ నెలాఖరు నాటికి కేసులు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. ప్రజలు సహకరిస్తే సెకండ్‌ వేవ్‌ను వీలైనంత వేగంగా అరికట్టేందుకు అవకాశముంటుంది. అలసత్వం ప్రదర్శిస్తే.. భవిష్యత్తులో మరింతగా కేసులు పెరిగే ప్రమాదముంది. కాబట్టి, సామాజిక దూరం, ముఖానికి మాస్క్‌, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడంతోపాటు.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చు.


------------------------------------------------------------------------------------------------------

నెల నెలలో కేసులు ఆ నెలాఖరుకు

------------------------------------------------------------------------------------------------------

మార్చి (2020) 1 10

ఏప్రిల్‌ 13 23

మే 90 113

జూన్‌ 787 900

జూలై 10,277 11,177

ఆగష్టు 25,929 37,106

సెప్టెంబరు 13,434 50,540

అక్టోబరు 5785 56,325

నవంబరు 2350 58,675

డిసెంబరు 1005 59,680

జనవరి 582 60,262 

(2021)

ఫిబ్రవరి 279 60541

మార్చి 1757 62,298

ఏప్రిల్‌ 17,618 79,916

మే 22,404 1,02,320

(11 నాటికి)

Updated Date - 2021-05-12T05:12:32+05:30 IST