102 ఏళ్ల రాజకీయమ్మ!

ABN , First Publish Date - 2020-07-09T05:30:00+05:30 IST

కేరళ రాజకీయ చరిత్రలో ఆమెది కీలకమైన ప్రస్థానం! సాహసాలు, సవాళ్లతో రాజకీయ జీవితం కొనసాగించిన కమ్యూనిస్టు నాయకురాలు, శతాధిక వృద్ధురాలు... కె.ఆర్‌. గౌరీ అమ్మ. తాజాగా 102వ పుట్టిన రోజు జరుపుకుని...

102 ఏళ్ల రాజకీయమ్మ!

కేరళ రాజకీయ చరిత్రలో ఆమెది కీలకమైన ప్రస్థానం! సాహసాలు, సవాళ్లతో రాజకీయ జీవితం కొనసాగించిన కమ్యూనిస్టు నాయకురాలు, శతాధిక వృద్ధురాలు... కె.ఆర్‌. గౌరీ అమ్మ. తాజాగా 102వ పుట్టిన రోజు జరుపుకుని, అనేక అంశాల్లో సాటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచిన ఆమె అంతరంగం ఇది!


కేరళ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు సంపాదించుకున్న కె.ఆర్‌. గౌరీ అమ్మ తాజా కరోనా పరిస్థితుల కారణంగా అలెప్పీలోని తన నివాసానికే పరిమితమయ్యారు. రివర్స్‌ ఐసొలేషన్‌లో భాగంగా ఇంటికే పరిమితమైన గౌరి, ఎంతో సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. 1919లో అలెప్పీలోని పత్తానక్కడలో జన్మించిన గౌరీ అమ్మ వందేళ్లు దాటినా తీవ్ర అనారోగ్యం బారిన పడిన సందర్భాలు లేవు. ఇంటి ఆవరణలోనే నడుస్తూ, దినపత్రిక చదువుతూ, కాలక్షేపం చేస్తూ ఉంటారామె. ఇప్పుడు ఇంతటి సామాన్యమైన జీవితం సాగిస్తున్న గౌరీ అమ్మ ఒకప్పుడు ఎంతో ఆసక్తికరమైన, ఉద్వేగభరితమైన రాజకీయ జీవితం గడిపారు.


‘‘కె.ఆర్‌ రామన్‌, పార్వతి దంపతుల ముద్దుల బిడ్డను నేను. న్యాయవిద్య అభ్యసించడానికి కారణం నాన్నే అయినా, నాకు రాజకీయాల పట్ల ఆసక్తి కలగడానికి కారణం మాత్రం మా పెద్దన్నయ్య సుకుమారన్‌. నాన్న మరణం తర్వాత చేర్తాళలోని కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో అన్నయ్య మా ఇంటికి వచ్చేవాడు. ఆయనతో పాటు ఒకరిద్దరు కామ్రేడ్లు కూడా భోజనానికి వచ్చేవారు. ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీ గురించీ, ట్రేడ్‌ యూనియన్ల గురించీ మా మధ్య చర్చలు నడిచేవి. ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీని బహిష్కరించారు కాబట్టి మేము రహస్యంగా సమావేశమయ్యేవాళ్లం. ఆ క్రమంలో 1948లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఏడాదే అరెస్టై, మొదటిసారి జైలుకు వెళ్లాను. ఆ తర్వాత తొమ్మిదేళ్లకు కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టి.వి. థామస్‌తో నాకు పెళ్లైంది. పెళ్లయ్యాక అలెప్పీలోని చెట్టనాడ్‌లో కాపురం పెట్టాం. 1967లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము ఇద్దరం కేరళ రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టాం’’ అని పాత సంగతులను గౌరి గుర్తుచేసుకున్నారు. 




త్రుటిలో తప్పిన ముఖ్యమంత్రి పదవి...

ఈ సీనియర్‌ మోస్ట్‌ రాజకీయ నాయకురాలు ఒక దశలో కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సింది. 1987 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘కె.ఆర్‌. గౌరీ అమ్మ కేరళను పాలిస్తారు’ అనే స్లోగన్లతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఆ సమయంలో గౌరినే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయవలసి ఉంది. కానీ అంతిమ నిర్ణయం తీసుకునే సమయంలో పార్టీ సీనియర్‌ నాయకులు ఆమెను పక్కన పెట్టారు. ‘‘నాకు పార్టీలో జరిగిన పరాభవాల్లో ఇది ఒకటి మాత్రమే! ఇలాంటివెన్నో నా జీవితంలో జరిగాయి. ఆ తర్వాత 1994లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాననే నెపంతో సిపిఐ(ఎమ్‌) నన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. దాంతో జనాధిపతి సంరక్షణ సమితి అనే సొంత పార్టీ పెట్టుకున్నాను. ఆ తర్వాత సిపిఐ(ఎమ్‌)  ప్రత్యర్థి అయిన యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యు. డి. ఎఫ్‌)లో చేరాను. 2001 నుంచి 2006 వరకూ ఆ పార్టీలో పనిచేశాను. చివరిగా 2011లో ఎన్నికల్లో పోటీ చేసినా, విజయం వరించలేదు. ఇలా అనుకోకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి, నా జీవితంలో ఏకంగా 45 ఏళ్లు రాజకీయాలకు అర్పించాను. ఈ ప్రయాణంలో ఎన్నెన్నో మలుపులు’’ అని గౌరి చెప్పుకొస్తారు. 


ఉత్తరాలే మాధ్యమాలు!

వయసు వందేళ్లు దాటినా గౌరి అమ్మ ఇప్పటికీ చురుకుగానే ఉన్నారు. అయితే ఆమె పెద్దగా ఫోన్లు వాడరు. కేరళ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌ తన కుమార్తె వీణ వివాహానికి ఆహ్వానిస్తూ, గత నెల గౌరి అమ్మకు ఫోన్‌ చేశారు. అందుకు గౌరి అమ్మ వీణకు అభినందనలు తెలుపుతూ, ఉత్తరం రాశారు. అలాగే వృద్ధ రాజకీయ నాయకుడు వీరేంద్ర కుమార్‌ మరణించినప్పుడు ఆయన కుటుంబసభ్యులకు ఉత్తరం ద్వారా సంతాపం తెలిపారు. అలాగే ఆమె తన బంధుమిత్రులతో ఫోన్‌కు బదులుగా ఉత్తరాల ద్వారానే సంప్రతింపులు జరుపుతూ ఉంటారు, క్షేమసమాచారాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. సమకాలీన రాజకీయాల్లో సీనియర్‌ మోస్ట్‌ అయిన గౌరీ అమ్మ జీవితంలోనూ, జీవనంలోనూ ఇప్పటికీ ఎందరికో ఆదర్శమే!


మితాహారమే రహస్యం!

వందేళ్లు దాటిన గౌరి ఆరోగ్య రహస్యం ఎవరికైనా ఆసక్తికరమే. ఆ మాటే అడిగితే ‘మరేమీ లేదు, నేను తీసుకునే మితాహారమే’ అంటారామె.  ఉదయం అల్పాహారంలో ఒక ఇడ్లీ, కొన్ని ఓట్స్‌ తీసుకుంటారామె. మధ్యాహ్న భోజనంలో ఒక గరిటెడు అన్నం, కూరగాయలు తింటారు. రాత్రికి తిరిగి ఓట్స్‌ తినే గౌరి అరుదుగా చేపలు తినడానికి ఇష్టపడతారు. 


Updated Date - 2020-07-09T05:30:00+05:30 IST