హౌరా ఆస్పత్రి నుంచి 101 మంది కొవిడ్-19 బాధితులు డిశ్చార్జ్

ABN , First Publish Date - 2020-05-30T00:20:59+05:30 IST

పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లా ఆస్పత్రిలో వందమందికి పైగా కొవిడ్-19 బాధితులు విజయవంతంగా కోలుకున్నారు...

హౌరా ఆస్పత్రి నుంచి 101 మంది కొవిడ్-19 బాధితులు డిశ్చార్జ్

హౌరా: పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లా ఆస్పత్రిలో వందమందికి పైగా కొవిడ్-19 బాధితులు విజయవంతంగా కోలుకున్నారు. వారిని ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఉలుబెరియాలోని సంజీబన్ హాస్పిటల్ నుంచి మొత్తం 101 మంది డిశ్చార్జ్ కాగా.. వీరిలో 54 మంది మహిళలు, 42 మంది పురుషులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. వీరందరినీ అంబులెన్సుల్లో ఇళ్లకు తరలించగా.. ఆస్పత్రి నుంచి బయల్దేరే ముందు డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది చప్పట్లు కొడుతూ అభినందించారు.


ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అడ్రిస్ అలీ, పలువురు అధికారులు, పోలీసులు కూడా ఆస్పత్రికి వచ్చారు. కాగా తాము కోలుకునే వరకు ఆరోగ్య సిబ్బంది నిరంతరం కంటికి రెప్పలా చూసుకున్నారంటూ.. కొవిడ్ నుంచి కోలుకున్న ఓ మహిళ భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటి వరకు ఈ ఆస్పత్రి నుంచి మొత్తం 354 మంది కరోనా పేషెంట్లు విజయవంతంగా కోలుకుని ఇళ్లకు వెళ్లారని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుభాశీస్ మిత్ర పేర్కొన్నారు. ఇందులో ముగ్గురు గర్భిణిలు కూడా ఉన్నారనీ.. కొవిడ్-19కు చికిత్స పొందుతుండగానే వారు ప్రసవించారని ఆయన అన్నారు. 

Updated Date - 2020-05-30T00:20:59+05:30 IST