Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 22 2021 @ 02:18AM

9 నెలల్లో వంద కోట్ల డోసుల టీకాలు

వ్యాక్సినేషన్‌లో కీలక మైలురాయిని చేరుకున్న భారత్‌

18 ఏళ్లు దాటినవారిలో 75% మందికి ఒక డోసు

31 శాతం మందికి రెండు డోసుల టీకా

భారతదేశం చరిత్ర సృష్టించింది: మోదీ

ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో ప్రధాని సందడి

సిబ్బందితో, టీకా లబ్ధిదారులతో ముచ్చట్లు

రెండో డోసుపై ఇక మిషన్‌మోడ్‌లో పనిచేస్తాం

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

ప్రపంచవేదికపై భారత్‌ సత్తాకు నిదర్శనం: బీజేపీ

కొనియాడిన ఉపరాష్ట్రపతి, పలువురు మంత్రులు

భారత్‌ను ప్రశంసించిన డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌

దేశంలో 100 వారసత్వ కట్టడాలపై మువ్వన్నెల

వెలుగులను ప్రసరింపజేసిన ఏఎస్‌ఐ

4,90,03,985ఏపీలో వేసిన టీకాలు

2,95,63,211తెలంగాణలో వేసిన టీకాలు

మేడిన్‌ ఇండియా టీకాలకు ఏకగ్రీవ ఆమోదం

ప్రజల భాగస్వామ్యంతోనే వంద కోట్ల విక్టరీ


న్యూఢిల్లీ, అక్టోబరు 21: అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల కంటే ఆలస్యంగా మొదలుపెట్టినా.. అభివృద్ధి చెందిన యూరోపియన్‌ దేశాల తర్వాత ఆరంభించినా.. కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ అద్భుతమైన వేగంతో ముందుకు దూసుకుపోయింది! అనతికాలంలోనే అక్షరాలా 100 కోట్లకు పైగా డోసుల టీకాలు ప్రజలకు వేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో 18 ఏళ్లు దాటిన 94.4 కోట్ల మంది ప్రజలకు ఈ ఏడాది చివరిలోగా కరోనా టీకా వేయడమే లక్ష్యంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని జనవరి 16న ప్రభుత్వం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మొదట్లో టీకాల కొరతతో ఈ కార్యక్రమం కొంత నెమ్మదిగా సాగినా.. ఆ తర్వాత వేగం పుంజుకుని దాదాపు 9 నెలల వ్యవధిలోనే (279 రోజుల్లో) ‘శత కోటి’ మైలురాయి దాటేసింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలోని 18 ఏళ్లు దాటిన జనాభాలో దాదాపు 75% మంది ఇప్పటికే కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారు. దాదాపు 31ు మంది.. రెండు డోసులూ వేయించుకున్నారు. కాగా.. 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.‘‘భారతదేశం చరిత్ర సృష్టించింది. భారతీయ సైన్స్‌, ఎంటర్‌ప్రైజ్‌, 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తి సాధించిన విజయాన్ని మనం చూస్తున్నాం. 100 కోట్ల టీకాల మైలురాయిని దాటినందుకు శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన వైద్యులు, నర్సులు తదితరులందరికీ కృతజ్ఞతలు’’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మైలురాయికి చేరుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో కలిసి గురువారం ఉదయం ఢిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రిలోని టీకా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సిబ్బందితో, టీకాలు వేయించుకున్నవారితో ముచ్చటించారు. వీల్‌చెయిర్‌లో వచ్చి టీకా వేయించుకున్న ఒక దివ్యాంగురాలితో మాట్లాడిన ప్రధాని.. ఆమె అభిరుచుల గురించి అడిగారు. పాటలు పాడడం తనకిష్టమని ఆమె చెప్పడంతో.. ఏదైనా పాట పాడమని అడిగారు. దీంతో ఆమె పాడి వినిపించింది. ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఝజ్జర్‌ ప్రాంగణంలో ఉన్న నేషనల్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన ‘ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ విశ్రామ్‌ సదన్‌’ను వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ ఆ సందర్భంగా 100 కోట్ల డోసుల ఘనత గురించి ప్రస్తావించారు.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఎలాంటి సందేహాలు లేకుండా టీకా వేయించుకోవాలని వెంకయ్య సూచించారు. భారత్‌ సాధించిన ఈ ఘనత నవ భారత సామర్థ్యం గురించి ప్రపంచానికి మరోసారి తెలిసేలా చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కొనియాడారు. ఆరోగ్య రంగంలో ఇది మునుపెన్నడూ సాధించని ఘనత అని.. ప్రపంచవేదికపై భారత సత్తాకు ఇది నిదర్శనమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. కాగా.. వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే 100 కోట్ల డోసుల మార్కును దాటడం అసాధారణమని నీతిఆయోగ్‌ సభ్యుడు, ప్రభుత్వ టీకాల ప్యానెల్‌ చీఫ్‌ వీకే పాల్‌ అన్నారు. ఈ ఘనత సాధించడంలో ‘కొవిన్‌’ కీలకపాత్ర పోషించిందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈవో డాక్టర్‌ ఆర్‌ఎస్‌ శర్మ అన్నారు. మొత్తం యూరప్‌ ఖండంలోని జనాభా (74.8 కోట్లు) కన్నా ఎక్కువ మంది ప్రజలకు భారత్‌ ఏడాది కన్నా తక్కువ వ్యవధిలోనే టీకాలు వేసిందని గుర్తుచేశారు. వచ్చే 3-4 నెలల్లోనే మరో 100 కోట్ల డోసులు!

దేశంలో వాక్సినేషన్‌ మొదలైన 9 నెలల్లో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ మార్కును చేరుకున్నామని, మరో మూడు, నాలుగు నెలల్లోనే రెండో 100 కోట్ల డోసుల పంపిణీని పూర్తి చేస్తామని జాతీయ నిపుణుల కమిటీ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. వచ్చే మూడు నెలల్లో 80-90 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. డిసెంబరు నాటికి దాదాపుగా దేశంలోని అర్హులందరికీ కనీసం ఒక డోస్‌ అయినా వ్యాక్సిన్‌ అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.  తొలి 50 కోట్ల డోసుల పంపిణీకి 7 నెలల సమయం పట్టగా.. రెండో 50 కోట్ల డోసులను రెండున్నర నెలల్లోనే పంపిణీ చేశామని ఆయన తెలిపారు.  


చరిత్రాత్మకం: గవర్నర్‌ 

జాతీయ స్థాయిలో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి కావడం నిజంగా చరిత్రాత్మకమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.  సనత్‌నగర్‌లోని ఈఎ్‌సఐ మెడికల్‌ కాలేజీని గురువారం ఆమె సందర్శించారు. అక్కడి వైద్యులు, వైద్య విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన  శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ఆమె ప్రశంసించారు. 

 

  1.  జూలై 30 నాటికి 10 కోట్ల మంది రెండు డోసులూ తీసుకున్నారు. సెప్టెంబరు 18 నాటికి   20 కోట్లు దాటింది. అప్పటి నుంచి అక్టోబరు 19 వరకూ మరో 9 కోట్ల మంది రెండు డోసులు తీసుకున్నారు. 
  2.  సెప్టెంబరు 17న ఒకేరోజు దేశవ్యాప్తంగా 2.15 కోట్ల డోసుల టీకాలు వేశారు. జూన్‌ 28న చైనాలో ఒకే రోజు 2.24 కోట్ల డోసుల టీకాలు వేశారు. 
  3. మారుమూల ప్రాంతాలకు  టీకా అందేలా  అక్టోబరు 4న డ్రోన్‌ ద్వారా వ్యాక్సిన్లను సరఫరా చేశారు. 
  4.  దేశంలో అత్యధికంగా టీకాలు వేసి అగ్రస్థానంలో  ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ నిలిచాయి. 
  5.  దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల జనాభాలో 100ు మంది కనీసం ఒక డోసు తీసుకున్నారు. అవేంటంటే.. అండమాన్‌ నికోబార్‌ దీవులు, చండీగఢ్‌, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము-కశ్మీర్‌, లక్షద్వీప్‌, సిక్కిమ్‌, ఉత్తరాఖండ్‌, దాద్రా నగర్‌ హవేలీ.

శభాష్‌ ఇండియా..

ఈ ఘనత సాధించినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనమ్‌ కూడా నరేంద్ర మోదీని, భారత శాస్త్రవేత్తలను, ఆరోగ్య సిబ్బందిని, భారత పౌరులను అభినందించారు. బలమైన రాజకీయ నాయకత్వం, ఆరోగ్య సిబ్బంది అంకిత భావంతో చేసిన కృషి లేకుంటే ఇంత తక్కువ సమయంలో ఇలాంటి అసాధారణ విన్యాసం చేయడం అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ ప్రశంసించారు. 100 కోట్ల టీకాల మైలురాయిని చేరుకున్న భారత్‌కు ‘యునిసెఫ్‌ ఇండియా’ కూడా శుభాకాంక్షలు తెలిపింది. అలాగే.. 100 కోట్ల మైలురాయిని చేరుకోవడం పట్ల పలువురు మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇది భారతదేశానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. మరోవైపు, వ్యాక్సినేషన్‌లో భారత్‌ 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న విషయాన్ని విమానాలు, ఓడల్లో, రైల్వే స్టేషన్లలో లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సినేషన్‌పై ప్రముఖ గాయకుడు కైలా్‌సఖేర్‌ ఆలపించిన గీతాన్ని, వ్యాక్సినేషన్‌ సాగిన తీరుపై చిత్రీకరించిన వీడియోను  మన్‌సుఖ్‌ మాండవీయ ఆవిష్కరించారు. ఎర్రకోటపై 1400 కిలోల బరువైన అతి పెద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇప్పటికే ఒక డోసు తీసుకున్నవారందరికీ రెండో డోసు వేయడమే లక్ష్యంగా మిషన్‌మోడ్‌లో పనిచేస్తామని మాండవీయ తెలిపారు. ఇక, ఈ ఘనతను సాధించడంలో కీలకపాత్ర పోషించిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, టీకా తయారీదారులు, పౌరులకు నివాళిగా ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎ్‌సఐ).. దేశంలోని 100 చారిత్రక, వారసత్వ కట్టడాలను జాతీయపతాకంలోని మూడు రంగుల కాంతులతో నింపేసింది. ఈ కట్టడాల్లో.. ఎర్రకోట, కుతుబ్‌మినార్‌ వంటి వాటితో పాటు తెలంగాణలోని రామప్ప గుడి, గోల్కొండ కోట కూడా ఉన్నాయి.

ఏ మైలురాయి ఎప్పుడు?

భారతదేశం తొలి 10 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోవడానికి 85 రోజుల సమయం పట్టింది. కానీ, మలి పది కోట్ల డోసులకు పట్టింది 45 రోజులే. 30 కోట్ల మార్కు చేరడానికి ఇంకా తక్కువగా 29 రోజులు పట్టగా.. 40 కోట్ల డోసులకు చేరడానికి 24 రోజులు, 40 నుంచి 50 కోట్లకు 20 రోజులు పట్టింది. అప్పట్నుంచి 76 రోజుల్లో మిగతా 50 కోట్ల డోసులు వేశారు. తేదీలవారీగా చూస్తే..


 తొలిదశలో వైద్యులు, ఆరోగ్యసిబ్బందికి టీకాలు వేశారు. ఫిబ్రవరి 2 నుంచి పోలీసులు, పారిశుధ్య సిబ్బందివంటి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వేయడం ప్రారం భించారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, బీపీ, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడ్డవారికి టీకాలు వేశారు. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడినవారందరికీ, మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేస్తున్నారు.

Advertisement
Advertisement