49% వాటాకు రూ.2,450 కోట్లు

ABN , First Publish Date - 2020-03-08T06:53:11+05:30 IST

యెస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటాను రూ.2,450 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. 49 శాతం వాటా కొనుగోలుతో ఎస్‌బీఐకి 245 కోట్ల షేర్లు లభిస్తాయని, ఒక్కో షేరుకు...

49% వాటాకు రూ.2,450 కోట్లు

యెస్‌ బ్యాంక్‌లో పెట్టుబడి కోసం రూ.10,000 కోట్లు సిద్ధం చేశాం.. 

ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌  


ముంబై: యెస్‌ బ్యాంక్‌లో 49 శాతం వాటాను రూ.2,450 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. 49 శాతం వాటా కొనుగోలుతో ఎస్‌బీఐకి 245 కోట్ల షేర్లు లభిస్తాయని, ఒక్కో షేరుకు రూ.10 చొప్పున మొత్తం రూ.2,450 కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయంది. పునర్నిర్మాణం తర్వాత కూడా యెస్‌ బ్యాంక్‌కు చెందిన అన్ని డిపాజిట్లు, అప్పులు యధావిధిగా కొనసాగుతాయని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. యెస్‌ బ్యాంక్‌ పునర్నిర్మిత బోర్డులో సీఈఓ, ఎండీతోపాటు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారని, ఎస్‌బీఐ కూడా తన తరఫున డైరెక్టర్లను నియమిస్తుందని తెలిపింది. ఆర్‌బీఐ కూడా అదనపు డైరెక్టర్లను నియమించవచ్చని ప్రకటనలో వెల్లడించింది. కాగా, యెస్‌ బ్యాం క్‌ కోసం రూ.10,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు. ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న యెస్‌ బ్యాంక్‌ను పునరుద్ధరించేందుకు శుక్రవారం ఆర్‌బీఐ ముసాయిదా పథకాన్ని విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం.. యెస్‌ బ్యాంక్‌లో ప్రతిపాదిత ఇన్వెస్టర్‌ (ఎస్‌బీఐ) 49 శాతం వాటా  కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో పెట్టుబడులు పెట్టిన తేదీ నాటి నుంచి మూడేళ్ల వరకు ఇన్వెస్టర్‌ తన వాటాను 26 శాతం కంటే తగ్గించుకోరాదు. యెస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఎస్‌బీఐ బోర్డు ఇప్పటికే సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. రజనీశ్‌ ఇంకా ఏమన్నారంటే.. 


యెస్‌ బ్యాంక్‌ పునర్నిర్మాణం కోసం ఆర్‌బీఐ రూపొందించిన ముసాయిదా పథకం ఎస్‌బీఐకి అందింది. అందులోని నియమ, నిబంధనలతోపాటు ఇతర విషయాలపై తమ బ్యాంక్‌ లీగల్‌ టీమ్‌ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఈ ప్రక్రి య పూర్తి కాగానే, ఆర్‌బీఐకి బ్యాంక్‌ తన తుది అభిప్రాయాన్ని తెలియజేయనుంది 


పునర్నిర్మాణ పథకం విడుదల తర్వాత యెస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నవారిలో చాలా మంది తమను సంప్రదించారు. వారితో ప్రాథమిక చర్చలు సాగించాం.  


ఆర్‌బీఐ ముసాయిదా పథకం ఎస్‌బీఐ బ్యాలెన్స్‌షీట్‌పై ఎలాంటి ప్రభావం చూపబోదు. ఎస్‌బీఐ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలపైనా ఎలాంటి ప్రభావం ఉండదు 


యెస్‌ బ్యాంక్‌లో వాటా కొనుగోలుకు మా ర్కెట్‌ నుంచి నిధులు సేకరించాల్సిన లేదా  ప్ర భుత్వాన్ని అభ్యర్థించాల్సిన అవసరముండదు


ఈ ప్రైవేట్‌ బ్యాంక్‌లో పెట్టుబడులతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు వంటి సమస్యలకు దారితీసే అవకాశాలూ లేవు


మనీలాండరింగ్‌ ఆరోపణల కేసులో యెస్‌ బ్యాంక్‌ సహ-వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరపడం, ఆయన్ని ప్రశ్నించడం బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళికపై ఎలాంటి ప్రభావం చూపబోదు 


యెస్‌ బ్యాంక్‌ సంక్షోభ పరిష్కారంలో ఎస్‌బీఐ పాలుపంచుకోవడం ద్వారా ఇన్వెస్టర్లు, డిపాజిటర్లలో ఆందోళనలు సద్దుమణుగుతాయి. ఆర్థిక మార్కెట్లో స్థిరత్వానికి దోహదపడుతుంది 


యెస్‌ బ్యాంక్‌ డిపాజిటర్లకు ఎలాంటి భయాలు అక్కర్లేదు. వారి సొమ్ము భద్రం


రూ.8,000-10,000 కోట్ల ప్రత్యేక ద్రవ్య వసతి 

సంక్షోభంలోకి జారుకున్న యెస్‌ బ్యాంక్‌కు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఆర్‌బీఐ రూ.8,000-10,000 కోట్లతో ప్రత్యేక ద్రవ్య వసతిని ఆఫర్‌ చేయనున్నట్లు సమాచారం. తద్వారా బ్యాంక్‌కు తక్షణమే నిధులు అందుబాటులోకి వస్తాయని, బ్యాంక్‌ కస్టమర్లలో ఆందోళనలు తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు సమాచారం. 


బ్రాంచీలు, ఏటీఏంల వద్ద కస్టమర్ల క్యూ 

యెస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారటోరియం విధించడంతో బ్యాంక్‌ కస్టమర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరుసగా రెండ్రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఈ బ్యాంక్‌ బ్రాంచీలు, ఏటీఎంల వద్ద కస్టమర్లు నగదు విత్‌డ్రా కోసం భారీగా క్యూ కట్టిన దృశ్యాలు కన్పించాయి. చాలా వరకు ఏటీఎంలలో ఇప్పటికే క్యాష్‌ అయిపోయింది. ఒకవేళ ఏటీఎంలో నగదు ఉన్నప్పటికీ రూ.3,000-4,000 మించి విత్‌డ్రా చేసుకోలేకపోతున్నామని ఓ కస్టమర్‌ వాపోయారు. బ్యాంక్‌ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు, క్రెడిట్‌ కార్డు పనిచేయడం లేదని ఖాతాదారులు ఆరోపించారు. 


రెండో రోజూ రాణా కపూర్‌ విచారణ 

మనీలాండరింగ్‌ ఆరోపణల కేసులో యెస్‌ బ్యాంక్‌ సహ వ్యవస్థాపకుడైన రాణా కపూర్‌కు చెందిన ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం రాత్రి సోదాలు జరిపింది. ఈ సందర్భంగా కపూర్‌తో పాటు తదితరులను విచారించిన ఈడీ అధికారులు.. శనివారం తమ కార్యాలయానికి తరలించి మరీ ప్రశ్నించారు. అంతేకాదు, తన సోదాలను  మరింత విస్తృతం చేసింది. రెండో రోజు కపూర్‌ ముగ్గురు కూతుళ్ల ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహించింది. దివాలా తీసిన ఎన్‌బీఎఫ్‌సీ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(డీహెచ్‌ఎ్‌ఫఎల్‌)కు యెస్‌ బ్యాంక్‌ ఇచ్చిన రుణాలు మొండిపద్దుల్లోకి చేరాయి. దీంతోపాటు కొన్ని కార్పొరేట్‌ కంపెనీలకు రుణాల మంజూరుకు సంబంధించి ఆ కంపెనీల నుంచి రాణా కపూర్‌ కుటుంబానికి ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయి.  


ఒకవేళ బ్యాంకులు వ్యాపార నిర్వహణలో విఫలమైతే, ఇందుకు బాధ్యులైన ఉన్నతాధికారులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలి. కఠినంగా శిక్షించాలి. అంతేతప్ప వారి పట్ల ఉపేక్ష తగదు. ఈమధ్య కాలంలో ప్రైవేట్‌ బ్యాంక్‌లు ఒకదాని తర్వాత మరొకటి విఫలమవుతున్నాయి. ఇందుకు ఆర్‌బీఐ బాధ్యత వహించాలి. 1969 సంవత్సరంలో లాగే ప్రైవేట్‌ బ్యాంకులన్నింటినీ ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకోవాలి. 

- సీహెచ్‌ వెంకటాచలం, ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ 


యెస్‌ బ్యాంక్‌ చాలా కాలంగా మొండిబకాయిలతో సతమతం అవుతోంది. మోదీ ప్రభుత్వానికి సన్నిహితుడైన అనిల్‌ అంబానీతోపాటు ఆర్థికంగా దివాళా తీస్తూ వచ్చిన పలువురు కార్పొరేట్‌ వర్గాలకు ఇచ్చిన రుణాలదే మొండి పద్దుల్లో మెజారిటీ భాగం. యెస్‌ బ్యాంక్‌ పతనం ప్రైవేట్‌ బ్యాంకుల నిర్వహణ తీరును పశ్నించేలా ఉంది. అంతేకాదు, ఆర్‌బీఐ సకాలంలో కలుగజేసుకోవడంలో విఫలమైనట్లు అన్పిస్తోంది. దేశంలో క్రోనీ క్యాపిటలిజానికి యెస్‌ బ్యాంక్‌ ఉదంతం మరో ఉదాహరణ. 

- సీపీఎం 


ఆర్థిక సంస్థల నిర్వహణలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే యెస్‌ బ్యాంక్‌ సంక్షోభానికి కారణం. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన బ్యాంకులో 49 శాతం వాటా కోసం ఎస్‌బీఐ రూ.2,450 కోట్లు పెట్టుబడి పెట్టడం హాస్యాస్పదమే. 

- పీ చిదంబరం, ఆర్థిక శాఖ మాజీ మంత్రి

Updated Date - 2020-03-08T06:53:11+05:30 IST