Advertisement
Advertisement
Abn logo
Advertisement

మాస్కు ధరించకపోతే 1000 ఫైన్‌

  • వ్యాక్సిన్‌ ధ్రువపత్రం లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో ‘నో ఎంట్రీ’
  • అందరూ 2 డోసుల టీకా వేసుకోవాలి
  • ప్రజారోగ్య సంచాలకుడు గడల 


హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ముప్పు రాష్ట్రానికీ పొంచి ఉందని ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూ చించారు. మాస్కులు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తామని, ఈ మేరకు పోలీసు శాఖను కోరామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా రెండు డోసులు వేయించుకోవాలని, దానివల్ల కొంత భద్రత లభిస్తుందన్నారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు టీకా వేసుకున్న సర్టిఫికెట్లను తీసుకెళ్లాలని సూచించారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూకే నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఆమెను గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.


మొత్తం 325 మంది ప్రయాణికులు రాగా, అందులో రాష్ట్రానికి చెందినవారు 239 మంది ఉన్నారని వివరించారు. పాజిటివ్‌ వచ్చిన మహిళ నుంచి సేకరించిన శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించినట్లు తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లో రిపోర్టు వస్తుందని, అప్పుడే ఆమెకు సోకిన వైరస్‌ ఒమైక్రానా? లేక డెల్టా వేరియంటా అనేది తేలుతుందని చెప్పారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో టెస్టింగ్‌ ఏర్పాట్లు మరింత పటిష్ఠం చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 11 ‘రిస్క్‌ దేశాల’ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నామన్నారు. ఒమైక్రాన్‌ కట్టడికి అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారన్నారు. ఇది చాలా వేగంగా విస్తరించే వైరస్‌ అని, కేవలం 3 రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాలకు విస్తరించిందని ఆయన తెలిపారు. 


రెండో డోసు తీసుకోనివారు 25లక్షల మంది

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రి య వేగంగా జరుగుతోందని గడల తెలిపారు. ఈ నెల 31లోపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను 100ు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గడువులోగా రెండో డోసు టీకా తీసుకోనివారు రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా ఉన్నారని, ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 15 లక్షల మంది ఉన్నారని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అర్హులైన 90 శాతానికి పైగా ప్రజలకు మొదటి డోసు టీకా వేశామని, 47ుమందికి రెండు డోసులు వేశామని తెలిపారు. రాష్ట్రంలో 80 లక్షలకు పైగా వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు  పండుగలు, విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. వైరస్‌ విస్తరణ తగ్గిందన్న కారణంతో చాలా మంది మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారన్నారు. ఇప్పుడు ఒమైక్రాన్‌కు అడ్డుకట్ట వేయాలంటే మాస్కులే సరైన మార్గమని తెలిపారు. పార్కులు, హోటళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు కొవిడ్‌ టీకా తీసుకు న్నట్లు సర్టిఫికెట్లు చూపించడం తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ వేసుకోనివారికి బహిరంగ ప్రదేశాలకు వెళితే ‘నో ఎంట్రీ’ అన్న నిబంధనను అమలు చేయనున్నామన్నారు. తమ ప్రజారోగ్య శాఖ బృందాలు ఆయా ప్రదేశాలకు వెళ్లి ప్రజలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాయని వివరించారు. ఈ వివరాలను ప్రభుత్వానికి సమర్పిం చి, అనుమతి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 


మళ్లీ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

ఒమైక్రాన్‌ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభమైంది. కోఠిలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో దీనిని పునరుద్ధరించారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఇది కొంత కాలంగా పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. ఇప్పుడు కేసులు పెరిగే అవకాశాలున్నట్లు భావిస్తున్న ఆరోగ్య శాఖ.. కంట్రోల్‌ రూమ్‌ను పునరుద్ధరించింది. 104 నంబరుకు ఫోన్‌ చేయడం ద్వారా కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ 10 మంది బృందం అందుబాటులో ఉంటుంది. 


అప్రమత్తతతో ఒమిక్రాన్‌ను ఎదుర్కొందాం: ఎర్రబెల్లి

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ పట్ల రాష్ట్ర ప్రజలు భయపడాల్సిన పనిలేదని.. అప్రమత్తతో ఎదుర్కొందామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేపట్టిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం.. ప్రజలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. 

Advertisement
Advertisement