డోలో రాసినందుకు.. 1000 కోట్ల కానుకలు!

ABN , First Publish Date - 2022-08-19T06:15:10+05:30 IST

డోలో 650 ఎంజీ.. జ్వరం వస్తే సాధారణంగా అందరూ వేసుకునే మాత్ర! ఇది మనందరికీ తెలిసిన విషయమే. కరోనా వైరస్‌ సోకిన వారిని కూడా వైద్యులు ఈ ట్యాబ్లెటే వేసుకోమని చెబుతుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా..

డోలో రాసినందుకు.. 1000 కోట్ల కానుకలు!

వైద్యులకు ఔషధ తయారీ సంస్థ తాయిలాలు

సుప్రీంకోర్టుకు తెలిపిన పిటిషనర్లు

10 రోజుల్లో స్పందించాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం 

నాకు కొవిడ్‌ సోకినప్పుడూ డాక్టర్‌ డోలోనే వాడమన్నారు: జస్టిస్‌ చంద్రచూడ్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 18: డోలో 650 ఎంజీ.. జ్వరం వస్తే సాధారణంగా అందరూ వేసుకునే మాత్ర! ఇది మనందరికీ తెలిసిన విషయమే. కరోనా వైరస్‌ సోకిన వారిని కూడా వైద్యులు ఈ ట్యాబ్లెటే వేసుకోమని చెబుతుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ మందు తయారీ సంస్థ ‘డోలోనే వాడాలంటూ రోగులకు చీటీ రాసిచ్చిన వైద్యులకు భారీగా నజరానాలు అందజేసింది’. వైద్యులకు కానుకలు ఇచ్చేందుకు ఏకంగా రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టింది! ఈ విషయాన్ని గురువారం ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తమ కంపెనీ మందులు వాడేలా రోగులకు ప్రిస్ర్కిప్షన్‌ రాసిచ్చే వైద్యులకు ఉచిత కానుకలు అందజేసే ఔషధ కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.


జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. డోలో 650 ఎంజీ మాత్రల తయారీ కంపెనీ.. వాటిని మార్కెటింగ్‌ చేసే వైద్యులకు తాయిలాల కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెట్టిందని సాక్షాత్తూ  కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు  ఆరోపించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సంజయ్‌ పారిఖ్‌ తెలియజేశారు. స్పందించిన జస్టిస్‌ చంద్రచూడ్‌.. ఇది చాలా తీవ్రమైన అంశమన్నారు. తనకు కొవిడ్‌ సోకినప్పుడు కూడా డాక్టర్‌ డోలోనే వాడమని చెప్పినట్లు వెల్లడించారు. కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజన్‌ స్పందిస్తూ.. ఈ అంశంపై అఫిడవిట్‌ను  త్వరలోనే సమర్పిస్తామని తెలిపారు. మార్కెటింగ్‌ కోసం ఔషధ కంపెనీలు అనుసరిస్తున్న అనైతిక పద్ధతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై 10 రోజుల్లోగా సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.


కోర్టు గతంలోనే అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించగా.. కేంద్రం ఇంకా సమర్పించలేదని గుర్తుచేసింది. ఫార్మా రంగంలో భారీ అవినీతి జరుగుతోందని, ఇది రోగుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తోందని పిటిషనర్‌ పేర్కొన్నారు.. వైద్యులకు ఉచిత కానుకలు ఇచ్చే సంస్కృతి పెరిగిపోతోందన్నారు. ఫార్మా రంగం మార్కెటింగ్‌లో నైతిక విలువలు పాటించేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫార్మాస్యుటికల్‌ మార్కెటింగ్‌ విధానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోవని.. ఈ విషయంలో ఉమ్మడి విధానాన్ని తీసుకొచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-08-19T06:15:10+05:30 IST