అల్లూరి సాయుధ పోరుకు ‘వంద’నం!

ABN , First Publish Date - 2021-08-22T05:51:35+05:30 IST

గిరిజనులపై..

అల్లూరి సాయుధ పోరుకు ‘వంద’నం!
పోలీస్‌స్టేన్‌పై దాడిచేసి రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న అల్లూరి తైలవర్ణ చిత్రం

1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌‌స్టేషన్‌పై సీతారామరాజు దాడి

మన్యం వీరుడి పోరాట పంథా మార్చిన ఘటన

ఆ మరుసటిరోజు కృష్ణాదేవిపేట స్టేషన్‌పై...అనంతరం రాజవొమ్మంగి, అడ్డతీగల స్టేషన్‌లపై...

ఈ ఘటనకు 99 ఏళ్లు పూర్తయి వంద సంవత్సరంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో నేడు అల్లూరి పేరిట ప్రత్యేక తపాలా కవర్‌ విడుదల 

 

చింతపల్లి/కృష్ణాదేవిపేట(విశాఖపట్నం): గిరిజనులపై బ్రిటీష్‌ పాలకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతుండడంతో ఇక శాంతియుత పోరాటంతో లక్ష్యం చేరలేమని భావించిన అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటానికి సన్నద్ధమయ్యారు. ఆయుధ సేకరణే లక్ష్యంగా 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై తొలి మెరుపుదాడి చేశారు. అల్లూరి పోరాటంలో కీలకమలుపుగా భావించే ఈ ఘటనకు వందేళ్లు కావస్తున్న సందర్భంగా భారత తపాలా శాఖ ఆయన పేరిట ప్రత్యేక కవర్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మన్యం వీరుడి పోరాట పంథాపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం. 


బ్రిటీష్‌ పాలకుల దాస్య శృంఖలాల నుంచి ఆదివాసీలను విముక్తులను చేయడమే లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు నడిపించిన సాయుధ పోరాటానికి స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యేక స్థానముంది. దాదాపు వందేళ్ల కిందట ఆ మహనీయుడు సాగించిన పోరాటం చిరస్మరణీయం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మోగల్లు గ్రామానికి చెందిన అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతుల తొలి సంతానంగా 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో సీతారామరాజు జన్మించారు. భీమవరం, రాజమండ్రి, రామచంద్రపురం, పిఠాపురం, విశాఖపట్నం, నరసాపురం తదితర ప్రాంతాల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. లంబసింగి ఘాట్‌రోడ్డు నిర్మాణానికి గిరిజనులను వినియోగించుకుంటూ, వారికి కనీసం ఆహారం కూడా ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న అప్పటి తహసీల్దార్‌ బాస్టియన్‌పై బ్రిటీష్‌ ఉన్నతాధికారులకు అల్లూరి ఫిర్యాదు చేశారు. కానీ వారు తిరిగి అల్లూరిపై కేసు పెట్టారు.


ఈ నేపథ్యంలో ఆదివాసీలకు రక్షణగా ఏజెన్సీలోనే వుండి పోరాటం సాగించాలని అల్లూరి నిర్ణయించుకున్నారు. అయితే ఆయన మన్యంలో వుంటే తిరుగుబాటు తెస్తాడని భావించిన బ్రిటీష్‌ పాలకులు నర్సీపట్నం తీసుకువెళ్లి గృహ నిర్బంధం చేశారు. తరువాత అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో బ్రిటీష్‌ ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో ఉంచారు. 1922 జూన్‌లో పోలవరం డిప్యూటీ కలెక్టర్‌ ఫజులుల్లాఖాన్‌ సహకారంతో అల్లూరి ప్రవాస శిక్షను తప్పించుకుని మన్యానికి వచ్చారు. ఖాన్‌కు ఇచ్చిన మాటకు కట్టుబడి విప్లవానికి దూరంగా ఉన్నారు. జూలై 27న ఖాన్‌ హఠాన్మరణం అనంతరం సీతారామరాజు సాయుధపోరాటానికి సన్నద్ధమయ్యారు. గాము గంటందొర, మల్లుదొర, కంకిపాటి ఎండుపడాల్‌తో పాటు మరికొంతమంది గిరిజనులను సమీకరించి, సాయుధపోరాటంపై చైతన్యవంతులను చేశారు. గెరిల్లా దాడులపై శిక్షణ ఇచ్చారు. ఆయుధాలను సమకూర్చుకునే దిశగా 1922 ఆగస్టు 19న వ్యూహరచన చేశారు. 


తొలి దాడి చింతపల్లిపైనే... 

ఇందులో భాగంగా 1922 ఆగస్టు 22న గంటందొర, మల్లుదొర, ఎండుపడాల్‌, ఎర్రేస్‌తో పాటూ 300 మంది గిరిజన విప్లవకారులతో కలిసి చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసులను తాళ్లతో బంధించి 11 తుపాకులు, 1,390 తుపాకీ గుళ్లు, 14 బాయ్‌నెట్లు, 5 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను స్టేషన్‌ డైరీలో రాసి ఇంగ్లీష్‌లో సంతకం చేశారు. బయటకు వస్తుండగా మరో ఇద్దరు పోలీసులు ఎదురవడంతో వారి వద్ద వున్న రెండు తుపాకులను లాక్కున్నారు. మరుసటిరోజు 23న కృష్ణాదేవిపేట పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. ఏడు తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండూ విజయవంతం కావడంతో పోలీస్‌ స్టేషన్‌లపై దాడుల పరంపరను కొనసాగించారు. 24న రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసి 26 తుపాకులు, 2,500కు పైగా తూటాలు ఎత్తుకెళ్లారు. అక్కడి జైలులో వున్న రంప పితూరిదారుడు మొట్టడం వీరయ్యదొరను నిర్బంధం నుంచి విడిపించారు. వరుసగా మూడు రోజుల పాటు మూడు స్టేషన్లపై అల్లూరి దాడులకు దిగడం బ్రిటీష్‌ అధికారుల్లో వణుకుపుట్టించింది. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు సెప్టెంబరు 24న ప్రత్యేక పోలీసు బలగాలను, ఇద్దరు అధికారులను నియమించారు. దీంతో అల్లూరి తన పోరాట పంథాకు మరింత పదునుపెట్టారు. ముందస్తు సమాచారం ఇచ్చి మరీ దాడులకు తెగబడాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్టోబరు 15న అడ్డతీగల పోలీసుస్టేషన్‌, సబ్‌ మేజిస్ట్రేట్‌ కార్యాలయాలపై దాడి చేశారు. అల్లూరి పోరాటాన్ని అణచివేసేందుకు నియమించిన ఇద్దరు అధికారులు సీతారామరాజు దాడిలో మరణించారు. 


చింతపల్లిలో ఆనవాళ్లు..

అల్లూరి సీతారామరాజు దాదాపు వందేళ్ల కిందట దాడి చేసిన పోలీసుస్టేషన్‌ భవనం చింతపల్లిలో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ ఆయుధ నిల్వల గదిగా దీనిని వినియోగిస్తున్నారు. బ్రిటీష్‌ పోలీసు స్టేషన్‌కు ఆనుకుని వున్న ఉపఖజానా కార్యాలయంలో నాటి అధికారులు ఉపయోగించిన ఇనుప ఖజానా పెట్టె, ఫ్యాన్‌ తిప్పేందుకు ఉపయోగించిన రోప్‌ నేటికీ పదిలంగా ఉన్నాయి. 


నేడు పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ..

అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై చేసిన దాడిని పురస్కరించుకుని తపాలా శాఖ ఉన్నతాధికారులు ఆదివారం అల్లూరి స్మారక పోస్టల్‌ కవర్‌ను విడుదల చేసేందుకు నిర్ణయించారు. అల్లూరి, గంటందొర సమాధులున్న గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట అల్లూరి సార్మక ప్రాంతం వద్ద అల్లూరి యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కవర్‌ను విడుదల చేయనున్నారు.





Updated Date - 2021-08-22T05:51:35+05:30 IST