100 రోజులు...ఒకే డ్రెస్‌!

ABN , First Publish Date - 2021-01-16T05:54:52+05:30 IST

ఈరోజుల్లో ఎవరైనా ఒక డ్రెస్‌ను వారంలో రెండు సార్లు వేసుకోమంటేనే అదోలా చూస్తారు. అలాంటిది ఏకంగా వంద రోజులు ఒకే డ్రెస్‌ వేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు అమెరికాలోని బోస్టన్‌ నివాసి సరాహ్‌ రాబిన్స్‌ కోలే

100 రోజులు...ఒకే డ్రెస్‌!

ఈరోజుల్లో ఎవరైనా ఒక డ్రెస్‌ను వారంలో రెండు సార్లు వేసుకోమంటేనే అదోలా చూస్తారు. అలాంటిది ఏకంగా వంద రోజులు ఒకే డ్రెస్‌ వేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు అమెరికాలోని బోస్టన్‌  నివాసి సరాహ్‌ రాబిన్స్‌ కోలే.  ఒక ఛాలెంజ్‌లో భాగంగా ఆమె ఇలా చేశారు. తక్కువలోనే సంతోషంగా, సంతృప్తిగా జీవించేలా ప్రజలను ప్రోత్సహించడం, పర్యావరణాన్ని కాపాడడం ఈ ఛాలెంజ్‌ ఉద్దేశం. 52 ఏళ్ల సరాహ్‌ గత ఏడాది సెప్టెంబర్‌ 16న ‘వంద రోజుల డ్రెస్‌ ఛాలెంజ్‌’ స్వీకరించారు. డిసెంబర్‌ 26తో ఆమె ఛాలెంజ్‌ పూర్తయింది. 


ప్రకృతిని కాపాడాలని...

‘‘సోషల్‌ మీడియాలో ఈ ఛాలెంజ్‌ గురించి చదివాను. నేను ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నా. ఈ ఛాలెంజ్‌ నాకు గొప్పగా అనిపించింది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు కొత్త దుస్తులు కొనకూడదని నిర్ణయించుకున్నాను. నా వార్డ్‌రోబ్‌లో ఇప్పటికే రకరకాల డ్రెస్సులు ఉన్నాయి. పార్టీలకు బాల్‌గౌన్‌లో వెళ్లాలని అనిపించిందనుకోండి నా వార్డ్‌రోబ్‌లో గత పదేళ్లుగా ఉంటున్న దాని దుమ్ము దులిపి ధరిస్తాను. ఒకటి రెండు సార్లు మాత్రమే ధరించి దాచిపెట్టిన దుస్తులన్నింటిని వేసుకోవాలని అనుకుంటున్నా’’ అని చెబుతారు సరాహ్‌. మొదటి రోజు నుంచి వందో రోజు వరకు అదే డ్రెస్‌లో ఆఫీసు, పార్టీలు, షాపింగ్‌కు వెళ్లేవారు సరాహ్‌.


ప్రతిసారి ఆ డ్రెస్‌ కొత్తగా, స్టయిల్‌గా కనిపించేలా చూసుకునేవారామె. ఈ ఛాలెంజ్‌ను అందరూ స్వీకరించాలనే ఆలోచనతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు కూడా పెట్టేవారు సరాహ్‌. అమెరికాలో ప్రముఖ దుస్తుల కంపెనీ ‘వూల్‌’ ఈ వంద రోజుల డ్రెస్‌ ఛాలెంజ్‌ను మొదలెట్టింది. ఈ ఛాలెంజ్‌ స్వీకరించిన వారు డ్రెస్‌ను రాత్రిపూట ఉతికి, ఉదయం తిరిగి దానినే ధరించాలి. రోజంతా ఒకే డ్రెస్‌ను ధరించడం వల్ల షాపింగ్‌, లాండ్రీ ఖర్చు తగ్గుతుంది. అంతిమంగా ప్రకృతికి హాని జరగదు. వంద రోజులు ఈ డ్రెస్‌ ధరించిన వారికి వంద అమెరికన్‌ డాలర్ల నగదు బహుమతి లభిస్తుంది.

Updated Date - 2021-01-16T05:54:52+05:30 IST