‘కోట్లా’ట

ABN , First Publish Date - 2022-01-17T06:17:22+05:30 IST

సంస్కృతీ, సంప్రదాయాల ముసుగులో వికృత క్రీడా వినోదాలు, జూదాలు, అశ్లీల నృత్య ప్రదర్శనలతో మూడు రోజులు జరిగిన సంక్రాంతి పర్వదినాలు ఆదివారంముగిశాయి. జిల్లావ్యాప్తంగా జరిగిన కోడిపందేలు, గుండాట, పేకాట పోటీల్లో రూ.వంద కోట్ల పైనే చేతులు మారినట్టు సమాచారం. ముఖ్యంగా పల్లంకుర్రు-దొంతికుర్రు మధ్య ఏర్పాటుచేసిన మెగా బరి వద్ద రూ.15కోట్లపైనే లావాదేవీలు జరిగినట్టు సమాచారం.

‘కోట్లా’ట
కాట్రేనికోన మండలం పల్లంకుర్రు-దొంతికుర్రు మెగా బరి వద్ద కోడి పందేలు నిర్వహిస్తున్న దృశ్యం

  • ముగిసిన సంక్రాంతి జూద క్రీడా వినోదం
  • కోడి పందేలు, గుండాటల్లో చేతులు మారిన రూ.100 కోట్లు
  • పల్లంకుర్రు మెగా బరిలో రూ.50 కోట్ల లావాదేవీలు
  • రాజఠీవితో తిలకించిన ప్రజాప్రతినిధులు
  • ప్రేక్షక పాత్రలోనే పోలీసులు
  • కాసుల వేటలో కొందరు, కోసల వేటలో మరికొందరు

పోలీసులు, ప్రజాప్రతినిధుల సాక్షిగా సంక్రాంతి పర్వదినాల ముసుగులో అసాంఘిక శక్తులు పేట్రేగిపోయాయి. కోట్ల రూపాయలు పణంగా పెట్టి కోడి పందేలు, గుండాట, పేకాట వంటి జూదాల క్రీడా వినోదంలో లక్షల మంది మునిగి తేలిపోయారు. పందేల నిర్వహణపై ప్రసార మాధ్యమాల్లో ఎస్పీ ప్రకటనలు చేసినప్పటికీ ఆ నిబంధనలు ఎక్కడా అమలు కాలేదు. సంక్రాంతి జాతర పేరిట గ్రామీణ ప్రాంతాల్లో గుండాట పేరిట మరో విష సంస్కృతి వ్యాపించింది. కొన్నిచోట్ల అశ్లీల నృత్య ప్రదర్శనలు హోరెత్తాయి. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలాచోట్ల జనం లేక పందేలు వెలవెలబోయాయి. మామూళ్ల మత్తులో ఉన్న కొందరు పోలీసు అధికారులు  జాతీయ రహదారుల చెంతనే పందేలు, గుండాట నిర్వహించేందుకు కల్పించిన తీరు చర్చనీయాంశమైంది. రాజఠీవితో ప్రజా ప్రతినిధులు పందాలను తిలకించి ఆనందపరవశులయ్యారు. 


(ఆంధ్రజ్యోతి-అమలాపురం)

సంస్కృతీ, సంప్రదాయాల ముసుగులో వికృత క్రీడా వినోదాలు, జూదాలు, అశ్లీల నృత్య ప్రదర్శనలతో మూడు రోజులు జరిగిన సంక్రాంతి పర్వదినాలు ఆదివారంముగిశాయి. జిల్లావ్యాప్తంగా జరిగిన కోడిపందేలు, గుండాట, పేకాట పోటీల్లో రూ.వంద కోట్ల పైనే చేతులు మారినట్టు సమాచారం. ముఖ్యంగా పల్లంకుర్రు-దొంతికుర్రు మధ్య ఏర్పాటుచేసిన మెగా బరి వద్ద రూ.15కోట్లపైనే లావాదేవీలు జరిగినట్టు సమాచారం. నిర్వాహకులు కూడా కోట్లాది రూపాయలను సొమ్ములు చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిజిటల్‌ స్ర్కీన్ల నడుమ మినీ స్టేడియాన్ని తలపించే రీతిలో ఏర్పాట్లు చేశారు. బారికేడింగ్‌, ప్రైవేటు సెక్యూరిటీ మధ్య జరిగిన పల్లంకుర్రు కోడిపందేలకు అంతర రాష్ట్రాల నుంచి అతిరథమహారఽథులంతా తరలివచ్చి తిలకించారు. వందల కార్లు, వేలల్లో మోటారుసైకిళ్లతో ఆ ప్రాంతమంతా ప్రభల తీర్థాన్ని తలదన్నే రీతిలో కనిపించింది. అధికార వైసీపీకి చెందిన అమాత్యుల నుంచి ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకుల కనుసన్నల్లోనే పందెం బరులు జరిగాయి. ముఖ్యంగా కాట్రేనికోన మండలం పల్లంకుర్రు-దొంతికుర్రు మెగా బరి వద్ద నిర్వాహకులు ఆశించిన మేర ఒప్పంద పందేలు జరగలేదు. పందేల నుంచి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆకస్మికంగా నిష్క్రమించారు. తన బంధవులకు అవమానం జరిగిదంటూ ఆయన వెళ్లిపోవడంతో ఆ తర్వాత జరిగిన పందేలు రక్తి కట్టలేదు. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య 60 ఒప్పంద పందేలు నిర్వహించాలని నిర్ణయించి అధిక పందేలు గెలుపొందిన విజేతకు ఇన్నోవా కారును బహుమతిగా ప్రకటించినప్పటికీ విజేత విషయంలో బహుమతి ఎవరికి దక్కుతుందనేది ప్రశ్నార్థకమైంది. అయితే ఒప్పంద పందేలు సక్రమంగా సాగలేదు. పల్లంకుర్రు పందెం బరి వద్ద వందలాది కారులు, వేల సంఖ్యలో మోటారు సైకిళ్లతో తిరునాళ్లను తలపించాయి. వీఐపీల కోసం కార్వాన వాహనాలను సైతం బరి వద్ద సిద్ధం చేశారు. మూడు రోజుల పాటు పందేలు వీక్షించే వారికి షడ్రసోపేతంగా విందు వసతులు ఏర్పాటుచేశారు. పేకాట పోటీలు కూడా భారీగా జరిగాయి. అయితే ఈ పందెం బరి వద్ద రూ.95లక్షలకు గుండాట దక్కించుకున్న నిర్వాహకుడికి లాభసాటిగా లేకపోవడంతో దుకాణం సర్దేశారు. గెద్దనపల్లిలో పందేల్లో గెలిచిన వారికి బుల్లెట్‌ బహుమానంగా ప్రకటించినప్పటికీ పందేలు పూర్తిస్థాయిలో జరగకపోవడం వల్ల బుల్లెట్‌ అలాగే ఉండిపోయింది. పల్లంకుర్రులో మెగా బరి వద్ద నిర్వహించిన భారీ కోడిపందేల శిబిరం వద్ద రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల మేర మూడు రోజుల పాటు లావాదేవీలు జరిగినట్టు సమాచారం. కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో 50కి పైగా కీలక బరుల్లో కోడి పందేలు, గుండాటలు హోరెత్తిపోయాయి. పలుచోట్ల రోడ్డుపక్కనే పందెంబరులు ఏర్పాటు చేశారు. మలికపురంలో పోలీస్‌స్టేషన పక్కనే పందేలు, గుండాటలు యథేచ్ఛగా నిర్వహించారు. కొన్ని కీలక గుండాట బోర్డుల వద్ద రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు చేతులు మారినట్టు అనధికారిక సమాచారం. అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడి బరిని పోలీసులు భోగి రోజు అర్ధరాత్రి నిలుపుదల చేశారు. అధికార వైసీపీకి చెందిన నిర్వాహకులు రాజకీయపరమైన వ్యాఖ్యానాలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని రికార్డింగు డ్యాన్సులు, పందేలు, గుండాటలను నిలుపుదల చేశారు. అల్లవరం మండలం ఓడలరేవులో గుండాట వద్ద తలెత్తిన వివాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. 

కాగా కోనసీమలోని పలువురు సిబ్బంది పోలీస్‌ స్టేషన్లకే పరిమితమయ్యారు. ఆయా ప్రాంతాల్లోని పందెంబరుల నిర్వాహకుల నుంచి ముందస్తు ఒప్పందాల నేపథ్యంలో మామూళ్లతో పాటు పందెంపుంజు(కోస)లను కానుకలుగా ఇచ్చారు. స్టేషన్‌ నుంచి జిల్లా స్థాయి వరకు షరా మామూళ్లే కావడంతో జిల్లావ్యాప్తంగా పందేలు, గుండాటలు, రికార్డింగు డ్యాన్సులు యథేచ్ఛగా సాగాయి. కొత్తపేట ప్రభల తీర్థంలో అశ్లీల రికార్డింగు డ్యాన్సులు జోరుగా సాగాయి. పి.గన్నవరం మండలం గంటిపెదపూడిలో వైసీపీకి చెందిన ఓ యువ నాయకుడు పుట్టినరోజును పురస్కరించుకుని భారీ స్థాయిలో డ్యాన్సర్లతో డిజిటల్‌ స్ర్కీన్ల మధ్య రికార్డింగ్‌ డ్యాన్సులు నిర్వహించారు. ఆత్రేయపురం మండలం నార్కెడుమిల్లి, రావులపాలెంల్లోను డ్యాన్సులు నిర్వహించారు. మామిడికుదురు మండలం నగరంలో రికార్డింగు డ్యాన్సులు వేసే సమయానికి పోలీసులు అడ్డగించారు. పోలీసులకు భారీగా నజరానాలను ప్రకటించారు. గతంలో ఉన్న ప్యాకేజీల కంటే పందేలు, పేకాట, డ్యాన్సుల నిర్వాహకుల నుంచి భారీగా సొమ్ములు గుంజడంలో కొన్ని సర్కిళ్ల పరిధిలోని పోలీసులు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పందేలను అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, చిర్ల జగ్గిరెడ్డి, పొన్నాడ సతీష్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, దాట్ల బుచ్చిబాబు తదితరులు వీక్షించారు.


అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినవారిపై కేసులు: ఎస్పీ 

కాకినాడ క్రైం, జనవరి 16: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో కోడిపందేలు, పేకాట, గుండాట, అశ్లీల నృత్యాలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినవారిపై స్థానిక పోలీసు అధికారులు దాడులు నిర్వహించినట్టు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దాడుల్లో కోడిపందేల బరులను ధ్వంసం చేసి పందెంరాయుళ్లు, పేకాట, గుండాట నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం, రంపచోడవరం డివిజన్ల పరిధిలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో 208 కేసులు నమోదు చేయగా 474మంది నిందితులను అదుపులోకి తీసుకుని 1125 కోడికత్తులను, 273 పందెం కోళ్లను, రూ.3,59,605 నగదు స్వాధీనపరచుకున్నట్టు తెలిపారు. శనివారం 211 కేసులు నమోదుకాగా 511 మంది నిందితులు, 283 కోడికత్తులు, 278 పందెంకోళ్లు, రూ. 2,49,590 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. జూదాలకు పాల్పడే వారిపై గేమింగ్‌ చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. 

                      


Updated Date - 2022-01-17T06:17:22+05:30 IST