Abn logo
Apr 8 2021 @ 01:30AM

100 కోట్ల మాట నిజమే

1,650 బార్లు, రెస్టారెంట్ల నుంచి 3 లక్షల చొప్పున బార్ల నుంచి వసూలుకు అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశం

మాజీ మంత్రిపై ఆరోపణలకు బలం.. ఎన్‌ఐఏకు వాజే వాంగ్మూలం


ముంబై, ఏప్రిల్‌ 7: అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరై.. తన పదవికే ఎసరుతెచ్చుకున్న మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు మరిన్ని కష్టాలు తప్పేట్లు లేవు. ఆయనపై వచ్చిన ‘వంద కోట్ల వసూలు’ ఆరోపణ కేసు కీలక మలుపు తిరిగింది. దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌ చేసిన అవినీతి ఆరోపణలకు బలం చేకూరే పరిణామం సంభవించింది. సస్పెండైన అధికారి సచిన్‌ వాజే, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఎదుట నోరు విప్పారు. బార్లు, పబ్బుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని తనకు అనిల్‌ దేశ్‌ముఖ్‌ నిర్దేశించారని అంగీకరించారు. అలాగే ఓ సంస్థ నుంచి రూ.50 కోట్లు వసూలు చేసి పెట్టాలని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, శివసేన నేత అనిల్‌ పరబ్‌ తనకు పురమాయించారని కుండబద్దలు కొట్టారు. బుధవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఎన్‌ఐఏ ఎదుట వాజే హాజరయ్యారు. ఇద్దరు మంత్రులకు వ్యతిరేకంగా వాజే లిఖితపూర్వకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఎన్‌ఐఏ నమోదు చేసింది. ఈ వసూళ్ల పనులు తన వల్ల కావని ఇద్దరు మంత్రులకు తాను స్పష్టం చేశానని పేర్కొన్నారు. దేశ్‌ముఖ్‌, పరబ్‌ వసూళ్ల డిమాండ్లపై తాను అప్పట్లోనే ముంబై పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న పరంబీర్‌ సింగ్‌కు చెప్పానని, వారు చెప్పిన పనికి అసలు పూనుకోవొద్దని తనకు ఆయన చెప్పారని వెల్లడించారు. కాగా గత నెలలో దేశ్‌ముఖ్‌పై పరంబీర్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాల్సిందిగా ఓ పోలీసు ఉన్నతాధికారికి దేశ్‌ముఖ్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయని, ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


స్టేట్‌మెంట్‌లో వాజే ఏం చెప్పారు?

గత ఏడాది అక్టోబరులో సహ్యాద్రి గెస్ట్‌హౌ్‌సకు తనను అనిల్‌ దేశ్‌ముఖ్‌ పిలిపించుకున్నారని, ముంబైలో ఉన్న 1,650 బార్లు, రెస్టారెంట్ల నుంచి డబ్బు వసూలు చేయాలని నిర్దేశించారని ఎన్‌ఐఏకు రాతపూర్వకంగా ఇచ్చిన లేఖలో వాజే వెల్లడించారు. అయితే ఇది తన వల్ల అయ్యేపని కాదని ఆయనకు అప్పుడే స్పష్టం చేసినా, ఈ ఏడాది జనవరిలో మళ్లీ దేశ్‌ముఖ్‌ నుంచి తనకు పిలుపొచ్చిందని చెప్పారు. ఈసారి నేరుగా దేశ్‌ముఖ్‌ అధికార నివాసంలో నే సమావేశం జరిగిందని, ఆ సమయంలో అక్కడ మంత్రితో  పాటు ఆయన పీఏ కుందన్‌ కూడా ఉన్నారని వెల్లడించారు. ముంబై వ్యాప్తంగా ఉన్న బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల చొప్పున వసూలు చేయాలని తనకు దేశ్‌ముఖ్‌ ఆదేశించారని వాజే వెల్లడించారు.


ఇక విచారణను ఎదుర్కొంటున్న సైఫీ బుర్హానీ అప్‌లి్‌ఫ్టమెంట్‌ ట్రస్ట్‌ (ఎస్బీయూటీ) నుంచి రూ.50 కోట్లు వసూలు చేయాలని మరో మంత్రి అనిల్‌ పరబ్‌ ఆదేశించారని వాజే వెల్లడించారు. గత ఏడాది జూలై-ఆగస్టులో తనను అధికారిక బంగ్లాకు పిలిపించుకుని ఈ వసూలు ప్రక్రియను ఎలా నడిపించాలనేదీ ఆయన నిర్దేశించారని వెల్లడించారు. ట్రస్ట్‌ మీద దాఖలైన ఫిర్యాదుపై ప్రాథమిక విచారణకు తెరతీయాలని, ఆ పేరుతో ఎస్బీయూటీ ట్రస్టీలను పిలిపించుకొని మాట్లాడాలని, దర్యాప్తును తొక్కిపెట్టేందుకు సిద్ధమని, అయితే ఈ పని జరగాలంటే రూ.50 కోట్లు ఇవ్వాల్సిందేని వారికి స్పష్టం చేయాలని సూచించారని చెప్పారు. ఈ విషయంలోనూ తాను అశక్తతను వ్యక్తం చేశానని, ట్రస్ట్‌ మీద కొనసాగుతున్న విచారణ గురించి తనకు తెలియదని, ట్రస్టీల్లో ఎవరూ తనకు తెలియదని పరబ్‌కు స్పష్టం చేశానని వాజే వెల్లడించారు.


2 కోట్లు ఇవ్వు.. పవార్‌ను మేనేజ్‌ చేస్తాను

వసూలు పర్వంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మరో కోణాన్నీ ఎన్‌ఐఏ ఎదుట వాజే వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో గత ఏడాది తన పునరాగమనాన్ని ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ తీవ్రంగా వ్యతిరేకించారని, తనను ఆ శాఖలోంచి పంపించి వేయాలని ఆయన భావించారని తన స్టేట్‌మెంట్‌లో వాజే పేర్కొన్నారు. అయితే తాను రాష్ట్ర పోలీసు శాఖలోనే పనిచేసేవిధంగా పవార్‌ను ఒప్పించే బాధ్యతను తీసుకుంటానని అనిల్‌దేశ్‌ముఖ్‌ తనతో అన్నారని, అయితే ఈ పని జరగాలంటే రూ.2కోట్లు ఇచ్చుకోవాలని స్పష్టం చేశారని వెల్లడించారు. అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చుకోలేని తాను చెబితే.. ఇప్పుడంటే ఇప్పుడు కాదు తర్వాత చెల్లిద్దువులే అంటూ తనను ఆయన ఒప్పించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement