దశాబ్దాల కల నెరవేరి దశాబ్దం

ABN , First Publish Date - 2021-04-02T14:49:09+05:30 IST

క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ సిక్సులు కొట్టడం సహజం. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముంబై వాంఖడేలో కొట్టిన కొట్టిన ఓ సిక్స్‌ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. దేశంలోని కోట్లమంది క్రికెట్ అభిమానుల గుండెల్లో..

దశాబ్దాల కల నెరవేరి దశాబ్దం

‘ఆఖరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా..’ ఈ డైలాగ్ సినిమాలోదే అయినా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకిది సరిగ్గా సరిపోతుంది. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చివర్లో సిక్సర్‌తో అతడిచ్చిన ఆఖరి పంచ్ వాంఖడే స్టేడియం దద్దరిల్లేలా చేసింది. ఆ సిక్స్.. సచిన్ టెండూల్కర్ రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదింపి అతడి క్రికెట్ కెరీర్‌కు పరిపూర్ణత తెచ్చింది. టీమిండియాకూ యువీ రూపంలో ఓ స్టార్ అల్‌రౌండర్ ఉన్నాడని ప్రపంచానికి తెలియజేసింది. ధోనీని నిజమైన మ్యాచ్ ఫినిషర్‌గా కోట్ల మంది ప్రేక్షకుల మనసుల్లో నిలిపింది. ఆ సిక్స్..‌ టీమిండియా 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడేలా చేసింది. వన్డే ప్రపంచకప్ 2011ను కైవసం చేసుకునేందుకు భారత్‌కు క్లీన్ టికెట్ ఇచ్చింది. దశాబ్దాల నాటి భారతదేశ కలను నెరవేర్చింది. అందుకే ఆ సిక్స్ దేశంలోని కోట్లమంది క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆ టోర్నీ జరిగిన నేటికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి అనేక జ్ఞాపకాలను క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 


ఆదుకున్న గంభీర్ :

2011 ప్రపంచకప్‌ను టీమిండియా అందుకోవడానికి ప్రధాన కారణం ఎవరనగానే అందరికీ గుర్తొచ్చేది ఎంఎస్ ధోనీ ఇన్నింగ్స్. అయితే అంతకంటే 31 పరుగులకే సెహ్వాగ్(0), సచిన్(18) వంటి కీలక వికెట్లను కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆ సమయంలో ఎడమ చేతి బ్యాట్స్‌మన్ టీమిండియాను ఆదుకున్నాడు. ఆచి తూచి ఆడుతూ వికెట్ పడకుండా కాపాడుతూ విరాట్(35), ధోనీ సాయంతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. వన్‌ డౌన్‌‌గా వచ్చిన గంభీర్ 42వ ఓవర్ వరకు క్రీజులో పాతుకుపోయి శ్రీలంక బౌలర్లకు చెమటలు పట్టించాడు. 122 బంతుల్లో 9 ఫోర్లతో 97 పరుగులు చేసిన గంభీర్.. జట్టు స్కోరు 223 వద్ద నాలుగో వికెట్‌గా వెనుతిరిగాడు. ఆ తర్వాత ధోనీ ధాటిగా ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ధోనీ ఆటతో గంభీర్ పోరాటం కొంత మరుగున పడింది. అయితే అతడి పోరాటపటిమను ఈ సమయంలో కచ్చితంగా గౌరవించాల్సిందే.


అసలైన ఫినిషర్‌గా ధోనీ:

టీమిండియాకు కెప్టెన్‌గా 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను అందించాడు ఎంఎస్ ధోనీ. ఆ తర్వాత ఏకంగా వన్డే ప్రపంచకప్‌ను అందించే అవకాశం లభించడంతో ఆ అవకాశాన్ని ధోనీ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఏకంగా తన చేతులతోనే ఆఖరి సిక్స్ కొట్టి దాదాపు మూడు దశాబ్దాల కలను నెరవేర్చాడు. గంభీర్ అందించిన అదిరిపోయే ఆరంభానికి అద్భుతమైన ఫినిష్ ఇచ్చి మరో 10 బంతులు మిగిలుండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. ఏకంగా 78 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 91 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కొని మైదానంలో బౌండరీల మోత మోగించాడు. టీమిండియా 28 ఏళ్ల కలను భారీ సిక్సర్‌తో నెరవేర్చాడు.


రవిశాస్త్రి కామెంట్రీ:

టీమిండియా ప్రపంచకప్‌ను అందుకోవడం క్రికెట్ అభిమానులందరికీ ఎంతలా గుర్తుంటుందో.. ధోనీ చివరి సిక్స్ కొట్టినప్పుడు కామెంటేటర్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కామెంట్రీ కూడా గుర్తుండిపోయింది. ‘‘ధోని ఫినిషెస్‌ ఆఫ్‌ ఇన్‌ స్టైల్‌. ఏ మేగ్నిఫిషెంట్‌ స్ట్రైక్‌ ఇన్‌టూ ది క్రౌడ్‌! ఇండియా లిఫ్ట్‌ ది వరల్డ్‌ కప్‌ ఆఫ్టర్‌ 28 ఇయర్స్‌ (ధోని తనదైన శైలిలో ముగించాడు. అద్భుతమైన షాట్‌తో బంతిని జనాల్లోకి పంపాడు. 28 ఏళ్ల తర్వాత భారత్‌ ప్రపంచకప్‌ అందుకుంది)’’ అని గంభీరమైన గొంతుతో వ్యాఖ్యాతగా రవిశాస్త్రి చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. 


సచిన్ చిరకాల కల నేరవేరిన వేళ:

క్రికెట్ గాడ్‌గా పేరు గడించినప్పటికీ సచిన్ టెండూల్కర్‌కు తన కెరీర్ మొత్తం ప్రపంచకప్ సాధించలేకపోయాననే బాధ గుండెల్లో మిగిలిపోయింది. అంతేకాదు అప్పటికే తన కెరీర్లో 5 వన్డే ప్రపంచకప్‌లలో ఆడినా ఒక్కసారి కూడా టీమిండియా విజేత కాలేకపోయింది. ఇక 2011 ప్రపంచకప్ తనకు ఆఖరిదని సచిన్‌కు తెలుసు. అందుకే టోర్నీ ఆసాంతం చెమటోడ్చి ఆడాడు. టోర్నీ ఆది నుంచి అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 482 రన్స్ సాధించి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అందులో రెండు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలున్నాయి. చివర్లో మ్యాచ్ గులిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా సచిన్‌‌ను భుజాలపై ఎత్తుకుని స్టేడియం మొత్తం తిప్పారు. త్రివర్ణ పతాకాన్ని భుజాలపై వేసుకుని సచిన్ చెమ్మగిల్లిన కళ్లతో ప్రేక్షకులను అభివాదం చేశాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సచిన్.. ఇంతకంటే తనకు ఇంకేం వద్దని, తన చిరకాల కల ఈ నాటితో నెరవేరిందని భావోద్వేగానికి లోనయ్యాడు.


ప్రత్యర్థులను వణికించి కన్నీళ్లు పెట్టుకున్న యువీ:

ప్రపంచకప్ 2011 భారత్ గెలిచిందంటే అందులో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో కీలకం. భారత జట్టుకు ఎప్పుడూ సరైన ఆల్‌రౌండర్ దొరకలేదు. అయితే ఈ ప్రపంచకప్‌లో మాత్రం యువీ ఆ పాత్రను అద్భుతంగా పోషించాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించాడు. టోర్నీలో ఒక సెంచరీ, నాలుగు అర్థ సెంచరీలతో 362 పరుగులు చేసిన యువీ.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. అలాగే బౌలింగ్‌లోనూ 5.02 ఎకానమీతో 15 వికెట్లు కూడా తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో ప్రమాదకరంగా మారుతున్న శ్రీలంక కెప్టెన్ కుమార సంగర్కర(48) వికెట్ తీసి ఆ జట్టును భారీ దెబ్బ తీశాడు. ఇక.. మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన అనంతరం మైదానంలోనే మోకాళ్లపై కూర్చొని యువీ కన్నీళ్లు కార్చిన దృశ్యం ఇప్పటికీ మన కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తుంది. 


కాగా.. అప్పటి జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఒక్క కోహ్లీ మాత్రమే ప్రస్తుత టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులో ఉన్నాడు. అశ్విన్ కూడా ఉన్నా.. అతడు కేవలం టెస్టులకే పరిమితమైపోయాడు. ఇక మిగతా ఆటగాళ్లలో సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌, జహీర్‌, నెహ్రా, ధోని, యువరాజ్‌ లాంటి దిగ్గజాలు ఒకరి తర్వాత ఒకరుగా ఆటకు వీడ్కోలు పలికారు. రైనా, పియూష్‌ చావ్లా, మునాఫ్‌ పటేల్‌, యూసుఫ్‌ పఠాన్‌, ప్రవీణ్‌ కుమార్‌లు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఇంకా ఆటకు వీడ్కోలు పలకనప్పటికీ హర్భజన్‌ జాతీయ జట్టుకు దూరమై చాలా కాలమవుతోంది. ఫిక్సింగ్‌ నిషేధం నుంచి బయటపడ్డ శ్రీశాంత్‌ తిరిగి పోటీ క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. 


అప్పటితో పోల్చితే ఇప్పటి టీమిండియా మరింత పటిష్ఠంగా ఉంది. ఆ ప్రపంచకప్ తరువాత టీమిండియా మరో ఐసీసీ కప్ ఏదీ గెలవలేకపోయింది. గత పదేళ్ల కాలంలో ఒక్క విశ్వ టోర్నీలో కూడా విజేత కాలేకపోయింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ల్లో కనీసం సెమీస్ దాటలేకపోయింది. ఇక 2012 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్, 2014లో ఫైనల్, 2016లో సెమీస్ వరకు మాత్రమే వెళ్లగలిగింది కానీ.. ఒక్కసారి కూడా విజేత కాలేకపోయింది. అయితే రానున్న మూడేళ్లలో వరుసగా మూడు ప్రపంచకప్‌‌లు..2021, 2022లో టీ20 ప్రపంచకప్‌లు, 2023లో వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ఈ సారైనా విజయలక్ష్మి మనల్ని వరిస్తుందేమో వేచి చూడాలి. 

Updated Date - 2021-04-02T14:49:09+05:30 IST