మైలేజీ తగ్గిందంటూ డ్రైవర్‌ వేతనంలో 10 వేలు కోత!

ABN , First Publish Date - 2022-05-08T09:14:08+05:30 IST

ఆర్టీసీ మిధాని డిపోలో పనిచేసే డ్రైవర్‌ వెంకన్నకు డిపో మేనేజర్‌ ఇటీవల షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ‘‘సూపర్‌లగ్జరీ బస్సు నడిపే మీరు ఏప్రిల్‌

మైలేజీ తగ్గిందంటూ డ్రైవర్‌ వేతనంలో 10 వేలు కోత!

ఆర్టీసీలో నయా పెనాల్టీలు


హైదరాబాద్‌,  మే 7 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ మిధాని డిపోలో పనిచేసే డ్రైవర్‌ వెంకన్నకు డిపో మేనేజర్‌ ఇటీవల షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. ‘‘సూపర్‌లగ్జరీ బస్సు నడిపే మీరు ఏప్రిల్‌ నెలలో 102 లీటర్ల మేర డీజిల్‌ను అదనంగా వినియోగించారు. దీనికి కారణం చెప్పకుంటే.. ఆ డీజిల్‌కు సరిసమానమైన మొత్తం.. అంటే.. మీ వేతనంలో రూ. 10,710 మేర కోత తప్పదు’’ అనేది అందులోని సారాంశం. ఈ షోకాజ్‌ నోటీసుతో యావత్‌ ఆర్టీసీ కార్మికులు కంగుతిన్నారు. ఐదారేళ్లుగా జీతాలు పెంచకుండా పెనాల్టీలేంటని ప్రశ్నిస్తున్నారు. 


డొక్కు బస్సులతో మైలేజీ సాధ్యమా?

మిధాని డిపో మేనేజర్‌ ఇచ్చిన షోకాజ్‌ నోటీసుతో ఇప్పుడు డ్రైవర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నిజానికి సూపర్‌ లగ్జరీ బస్సు లీటర్‌కు 5.20కిమీ మేర మైలేజీ ఇవ్వాలనేది ఆర్టీసీ లక్ష్యం. కానీ, డ్రైవర్‌ వెంకన్న న గత నెలలో 4.64 కిమీ మైలేజీతో బస్సును నడిపారు. ఇప్పుడున్న డొక్కుబస్సులకు 4.64 కిమీ మైలేజీ చాలా గొప్పదేనని కార్మికులు చెబుతున్నారు. ఏడేళ్లుగా ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోళ్లు లేవు. నిబంధనల ప్రకారం 15 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులను పక్కనపెట్టాలి. కానీ, ఆర్టీసీ యాజమాన్యం వాటి విషయంలో మసిపూసి మారేడుకాయ చేసిన చందంగా.. పైపై మెరుగులతో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకుంటూ.. రోడ్డెక్కిస్తోందని డ్రైవర్లు చెబుతున్నారు.


నిజానికి హైదరాబాద్‌ నగరంలో ఉండే ట్రాఫిక్‌ రద్దీ నేపథ్యంలో లీటర్‌ డీజిల్‌కు సూపర్‌ లగ్జరీ బస్సు మైలేజీ 4.5-5కిమీని మించదు. అదే సూపర్‌ లగ్జరీ బస్సు దూర ప్రాంతాలకు వెళ్తే.. 5-5.5 కిమీ మేర మైలేజీ ఇస్తుంది. హైదరాబాద్‌ నగరంలో కాలం చెల్లిన సూపర్‌ లగ్జరీ బస్సుకు 4.64 కిమీ మైలేజీ వచ్చిందంటే.. అది గొప్పేనని, డ్రైవర్‌ పూ ర్తిస్థాయిలో సమర్థుడని స్పష్టమవుతుందన్నారు. డ్రైవర్ల జీతాల్లో కోత పెడుతున్న యాజమాన్యం.. రేపు కండక్ట ర్లు కూడా తక్కువ కలెక్షన్‌ తెస్తే.. నష్టం పేరుతో జీతా ల్లో కోతలు ప్రారంభిస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. రో జూ 12-14 గంటలు పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి పా టుపడుతుంటే.. ఈ వేధింపులేంటని నిలదీస్తున్నారు.

Read more