పంజాబ్ సీఎంపై అధిష్ఠానానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ

ABN , First Publish Date - 2021-07-18T22:08:25+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను నిరుత్సాహపరచవద్దని

పంజాబ్ సీఎంపై అధిష్ఠానానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ

చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను నిరుత్సాహపరచవద్దని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటానికి కారణం ఆయన కృషేనని తెలిపారు. 


పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధిష్ఠానానికి ఆదివారం రాసిన లేఖలో, పంజాబ్‌లో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ అవిశ్రాంతంగా శ్రమించారని తెలిపారు. ఆయనకు సహకరించాలని కోరారు. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఎవరిని నియమించాలో నిర్ణయించే అధికారం అధిష్ఠానానికే ఉందని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల మధ్య పొరపొచ్చాలపై బహిరంగంగా చర్చించడం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోయిందని తెలిపారు. 


ఈ లేఖపై సంతకాలు చేసిన పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో హర్మిందర్ సింగ్ గిల్, ఫతేహ్ బజ్వా, గుర్‌ప్రీత్ సింగ్, కుల్ దీప్ సింగ్ వైద్, బల్వీందర్ సింగ్ లడ్డి, సంతోష్ సింగ్, జోగిందర్ పాల్, జగ్‌దేవ్ సింగ్ కమలు, పిర్మల్ సింగ్ ఖల్సా, సుఖ్‌పాల్ సింగ్ ఖైరా ఉన్నారు. 


ఈ ఎమ్మెల్యేలు విడుదల చేసిన ఓ ప్రకటనలో, కెప్టెన్ అమరీందర్ సింగ్ కృషి వల్లే పంజాబ్‌లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. 1984లో దర్బార్ సాహిబ్‌పై దాడి, తదనంతరం ఢిల్లీలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో సిక్కులపై మారణహోమం తర్వాత కెప్టెన్ సింగ్ కృషి వల్లే పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఆయనను ఎంతో గౌరవిస్తున్నాయన్నారు. పంజాబ్ శాసన సభ ఎన్నికలు జరగడానికి మరొక ఆరు నెలలు మాత్రమే మిగిలిందని, ఇటువంటి సమయంలో పార్టీని వేర్వేరు దిశల్లోకి లాగడం వల్ల 2022 ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. 


నవజోత్ సింగ్ సిద్ధూ ఓ సెలబ్రిటీ అని, పార్టీకి ఆయన గొప్ప ఆస్తి వంటివారని, అయితే ఆయన బహిరంగంగా సొంత పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల పార్టీ కేడర్‌లో విభేదాలు ఏర్పడుతున్నాయని, పార్టీ బలహీనపడుతోందని తెలిపారు. 


Updated Date - 2021-07-18T22:08:25+05:30 IST