దశ మారేనా?

ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST

దశ మారేనా?

దశ మారేనా?

10 కీలక ప్రాజెక్టులకు భూ సమస్య   

రెవెన్యూ శాఖ గడప దాటని భూ సేకరణ 

జిల్లాల పునర్విభజన తర్వాత సమీక్షలే లేవు 

పది ప్రాజెక్టులకు భూములు ఇస్తేనే పురోగతి 

స్వల్ప భూ సేకరణలోనూ అధికారుల అలసత్వం

ముందుకు కదలని పనులు


ఒకటేమో కేంద్రప్రభుత్వ ప్రతిపాదిత గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే.. మరొకటేమో ముఖ్యమైన స్టేషన్లను కలిపే రైల్వేలైన్‌.. ఓపక్క బుడమేరు మోడ్రనైజేషన్‌.. ఇంకోపక్క వేదాద్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌.. ఒకటి కాదు.. రెండు కాదు.. కీలకమైన 10 ప్రాజెక్టులకు భూ సమస్య ప్రధాన ప్రతిబంధకమైంది. అధికారుల అలక్ష్యం, నిధుల విడుదలలో జాప్యం, రైతులతో సంప్రదింపులు జరపకపోవడం, నష్టపరిహారంపై ఓ అంచనా లేకపోవడం వెరసి ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. - (ఆంధ్రజ్యోతి, విజయవాడ)


1.గుణదల ఆర్‌వోబీ

విజయవాడ నార్త్‌ మండల పరిధిలోని గుణదల ఆర్‌వోబీ అసంపూర్ణంగా ఉంది. ఇటీవల ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. భూ సేకరణకు అడ్డు తొలగింది. ఈ క్రమంలో 22 సెంట్ల స్థలాన్ని సేకరించాల్సి ఉంది. కొందరు కోర్టును ఆశ్రయించారు. ఇంత స్వల్ప  భూమిని కూడా సేకరించలేకపోతున్నారు. కోర్టుకు వెళ్లిన వారితో సంప్రదింపులు చేయటం ద్వారా సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వారం కిందట కలెక్టర్‌ దిల్లీరావు ఈ అంశంపై సమీక్ష నిర్వహించి కోర్టుకు వెళ్లిన వారితో సంప్రదింపులు చేయమని చెప్పినా పురోగతి లేదు. స్థానిక తహసీల్దార్‌ దృష్టి పెట్టకపోవడం ప్రధాన కారణం.

2.విజయవాడ-ఖమ్మం (ఎన్‌హెచ్‌-163జీ)

కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగా ప్రకటించిన విజయవాడ-ఖమ్మం రహదారి (ఎన్‌హెచ్‌-163జీ) ప్రాజెక్టుకు సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లాలో 30 ఎకరాలను సేకరించాల్సి ఉంది. విజయవాడ, తిరువూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో విజయవాడ రూరల్‌, జి.కొండూరు, గంపలగూడెం మండలాల్లో భూమి సేకరించాల్సి ఉంది. చాలామంది రైతులు భూములు ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నారు. కొంతమంది మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వారితో సమావేశాలు నిర్వహిస్తే సమస్య పరిష్కారమవుతుంది. జేసీ నుపూర్‌ దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ఇంకా త్రీడీ స్టేజ్‌లోనే ఉంది. పెగ్‌ మార్కింగ్‌, సర్వే వంటివే జరుగుతున్నాయి.

3.రైల్‌ ఓవర్‌ రైల్‌

విజయవాడ రూరల్‌ మండలం పరిధిలోని ముస్తాబాద, రాయనపాడు సెక్షన్ల మధ్య విజయవాడ-విశాఖపట్నం లైన్‌, విజయవాడ-కాజీపేట థర్డ్‌లైన్ల పరిధిలో రైల్‌ ఓవర్‌ రైల్‌ (ఆర్‌వోఆర్‌) ఏర్పాటుకు 27.88 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఆర్‌వోఆర్‌ అంటే కృష్ణానదిలో రైల్వే బ్రిడ్జిల మాదిరిగా ఉంటాయి. దీనికోసం గొల్లపూడి, జక్కంపూడి గ్రామాల్లో భూములు సేకరించాల్సి ఉంది. గతంలో రైతులతో ఒకటి, రెండుసార్లు సంప్రదింపులు జరిపారే, తప్ప ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. 

4.ముక్త్యాల రోడ్డు

జగ్గయ్యపేట మండలం పరిధిలో ముక్త్యాల రోడ్డుకు కూడా కేవలం 35 సెంట్ల స్థలాన్ని సేకరించాల్సి ఉంది. ఇంకా అవార్డు స్టేజ్‌లోనే ఉంది. నష్టపరిహారంగా పూర్తి సొమ్మును చెల్లించలేదు. కేవలం 80 శాతమే అందజేశారు. ఆర్‌అండ్‌బీ నుంచి నిధులు రావాల్సి ఉంది. అవార్డు పాస్‌ చేశాక మిగిలిన బ్యాలెన్స్‌ చెల్లిస్తామని కూర్చున్నారు. దీంతో ప్రాజెక్టు పనులు కాలాతీతమవుతున్నాయి. 

5.విజయవాడ-గుడివాడ-భీమవరం డబ్లింగ్‌

విజయవాడ రూరల్‌ మండల పరిధిలో విజయవాడ రైల్వే డివిజన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన 221 కిలోమీటర్ల విజయవాడ- గుడివాడ-మచిలీపట్నం-భీమవరం-నర్సాపూర్‌-నిడదవోలు డబ్లింగ్‌ - విద్యుదీకరణ పనులు పురోగతిలో ఉన్నాయి. దశలవారీగా జరుగుతున్న పనుల కారణంగా ఇప్పటి వరకు 140 కిలోమీటర్లకు పైగా అందుబాటులోకి వచ్చింది. విజయవాడ-గుడివాడ-భీమవరం డబ్లింగ్‌ మార్గంలో కేవలం 13 సెంట్ల భూ సేకరణ మాత్రం ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి దాదాపు ఐదేళ్లు కావస్తోంది. సబ్‌ కలెక్టర్‌ పరిధిలోని ఈ అంశం ఇంకా డిక్లరేషన్‌ దశ దాటలేదు. 

6.ఇన్‌ ల్యాండ్‌ వాటర్‌ టెర్మినల్‌

జగ్గయ్యపేట మండల పరిధిలోని ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి 7.57 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ఇంకా అవార్డు దశలోనే ఉంది. నందిగామ రెవెన్యూ డివిజన్‌ కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో, కొత్తగా వచ్చిన ఆర్‌డీవో ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంది. ప్రతిపాదిత సేకరణ భూముల్లో ఎకరం మేర సబ్‌ మెర్జ్‌డ్‌ ల్యాండ్‌ ఇష్యూ కూడా ఉంది. ఈ సమస్యను పరిష్కరిస్తే కానీ, ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ టెర్మినల్‌ అందుబాటులోకి రాదు..

7.కాజీపేట-కొండపల్లి థర్డ్‌లైన్‌ 

జి.కొండూరు మండల పరిధిలో కాజీపేట-కొండపల్లి సెక్షన్‌లో మూడో లైన్‌ (ట్రిప్లింగ్‌)కు సంబంధించి 10.23 ఎకరాలు అవసరమవుతుంది. దీనికి సంబంధించిన భూ సేకరణకు టెండర్‌ పిలిచారు. భూములను స్వాధీనం చేసుకోవటమే మిగిలుంది. భూములను స్వాధీనం చేసుకునే విషయంలో కొంతమేర జాప్యం ఏర్పడుతోంది. 

8.బుడమేరు డ్రెయిన్‌ ఆధునికీకరణ

విజయవాడ రూరల్‌ మండల పరిధిలో బుడమేరు డ్రెయిన్‌ మోడ్రనైజేషన్‌-చానలైజేషన్‌ పనుల కోసం 16.87 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ నోటిఫికేషన్‌ దశలోనే ఉంది. డ్రెయినేజీ విభాగం నుంచి నిధులు రావాల్సి ఉంది. నిధులు వస్తే కానీ సమస్య పరిష్కారం కాదు. అప్పుడే నష్టపరిహారం చెల్లించే వీలుంటుంది. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టాలి. 

9.వేదాద్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌

జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల పరిధిలో వైఎస్సార్‌ వేదాద్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లకు సంబంధించి 51.58 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు టెండర్లను పిలవలేదు. ఈ విషయం కూడా కొత్తగా ఏర్పడిన నందిగామ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి వస్తోంది. నందిగామ ఆర్‌డీవో దృష్టి పెట్టాలి. 

10.కనకదుర్గ ఫ్లై ఓవర్‌ సర్వీసు రోడ్డు

విజయవాడ పశ్చిమ మండలం పరిధిలోని కనకదుర్గ ఫ్లై ఓవర్‌ సర్వీసు రోడ్డు నిర్మాణంలో స్వల్ప భూ సేకరణ సమస్య ఉంది. కేవలం 16 సెంట్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ భూమిని సేకరించకపోవటం వల్ల మొత్తం సర్వీసు రోడ్డుకే ఇబ్బందిగా మారింది. ఈ వ్యవహారం ఇంకా ప్రీ నోటిఫికేషన్‌ స్టేజ్‌లోనే ఉంది. 

Updated Date - 2022-05-22T05:30:00+05:30 IST