MLAs: టచ్‌లో పదిమంది ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2022-09-08T12:57:35+05:30 IST

పదిమంది డీఎంకే ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో వున్నారని, తమ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన

MLAs: టచ్‌లో పదిమంది ఎమ్మెల్యేలు

- ఎడప్పాడి సంచలన ప్రకటన

- నేడు పార్టీ కార్యాలయానికి 

- సీబీసీఐడీ విచారణ ప్రారంభం


చెన్నై, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పదిమంది డీఎంకే ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో వున్నారని, తమ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) సంచలన ప్రకటన చేశారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండిలో బుధవారం ఉదయం పార్టీ ప్రముఖుడి నివాసంలో జరిగిన కుటుంబ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఈపీఎస్‌ మాట్లాడుతూ రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో జరిగిన హింసాకాండపై సీబీఐ విచారణ కోరుతూ తాము హైకోర్టులో పిటిషన్‌ వేసిన తర్వాతే సీబీసీఐడీలో చలనం వచ్చిందని, ప్రస్తుతం తమ కార్యాలయం వద్ద వారు విచారణ ప్రారంభించారన్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీని బలోపేతం చేసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని ఈపీఎస్‌ ఎద్దేవా చేశారు.


నేడు పార్టీ కార్యాలయం సందర్శన...

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఈపీఎస్‌ గురువారం ఉదయం రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎంజీఆర్‌ మాళిగైని సందర్శించనున్నారు. పార్టీలో నెలకొన్న సంక్షోభాల కారణంగా 72 రోజులు గా ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్ళలేదు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి హోదాలో ఈపీఎస్‌(EPS) పార్టీ కార్యాలయానికి వెళ్తున్నారని అన్నాడీఎంకే అధిష్టానం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈపీఎస్‏తోపాటు పార్టీ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ విభాగాల నాయకులు కూడా పార్టీ కార్యాలయంలో సమావేశమవుతారని ఆ ప్రకటనలో తెలిపారు.


సీబీసీఐడీ వివరాల నమోదు ...

అన్నాడీఎంకే కార్యాలయంలో జూలై 11న జరిగిన హింసాకాండ, ఆ కార్యాలయంలోని గదుల్లో జరిగిన విధ్వంసకాండపై బుధవారం ఉదయం సీబీసీఐడీ   విచారణ ప్రారంభించింది. ఆ సంఘటనపై రాతపూర్వకంగా రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ ప్రారంభించలేదని, సీబీఐ విచారణకు ఉత్తర్వులివ్వాలని మాజీ మంత్రి సీవీ షణ్ముగం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో సీబీసీఐడీ డీఎస్పీలు రాజాభూపతి, వెంకటేశన్‌ 20 మంది పోలీసు లు అన్నాడీఎంకే కార్యాలయంలో బుధవారం ఉదయం 8.15 గంటలకు విచారణ ప్రారంభించారు. అక్కడి గదులను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. మాజీ మంత్రి సీవీ షణ్ముగం(Former Minister CV Shanmugam) సమక్షంలో ఈ విచారణ జరిగింది.


టచ్‌లో 50 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు: డీఎంకే కౌంటర్‌

అన్నాడీఎంకేకు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని డీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ ఆర్‌ఎస్‌ భారతి పేర్కొన్నారు. నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎడప్పాడి పళనిస్వామికి టచ్‌లో ఉన్న డీఎంకే ఎమ్మెల్యేల జాబితా వెల్లడిస్తే, తాము అన్నాడీఎంకే సభ్యులు పేర్లు వెల్లడిస్తామని సవాల్‌ చేశారు. ద్రావిడ ఇయక్కం డీఎంకేదని, అన్నాడీఎంకే తమ పార్టీలో విలీనం కావాలని ఆర్‌ఎస్‌ భారతి తెలిపారు.  

Updated Date - 2022-09-08T12:57:35+05:30 IST