ఫార్మా ఎగుమతుల్లో 10% వృద్ధి

ABN , First Publish Date - 2022-08-01T07:09:33+05:30 IST

ఫార్మా ఎగుమతులు గాడిన పడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో మన దేశం నుంచి 626 కోట్ల డాలర్ల (సుమారు రూ.49,767 కోట్లు) విలువైన ఔషధాలు ఎగుమతయ్యాయి.

ఫార్మా ఎగుమతుల్లో 10% వృద్ధి

 ఫార్మెగ్జిల్‌ అంచనా

క్యు1లో 8 శాతం వృద్ధి


హైదరాబాద్‌: ఫార్మా ఎగుమతులు గాడిన పడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో మన దేశం నుంచి 626 కోట్ల డాలర్ల (సుమారు రూ.49,767 కోట్లు) విలువైన ఔషధాలు ఎగుమతయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఎనిమిది శాతం ఎక్కువ. భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ భాస్కర్‌ ఈ విషయం వెల్లడించారు. ఇందులో  అమెరికా వాటా 30 శాతం. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమెరికాకు ఔషధ ఎగుమతులు 3.6 శాతం పెరిగాయి. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఫార్మా ఎగుమతులు 10 శాతం వృద్ధితో 2,700 కోట్ల డాలర్లకు చేరతాయని భావిస్తున్నట్టు ఉదయ భాస్కర్‌ తెలిపారు. కొవిడ్‌ ఇతర సమస్యల కారణంగా 2021-22లో మన దేశం నుంచి ఔషధ ఎగుమతులు ఒక శాతం మాత్రమే పెరిగాయి.

యుద్ధ ప్రభావం: భారత ఫార్మా ఎగుమతులపై రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంపై మాట్లాడుతూ యుద్ధం ఒక కొలిక్కి వస్తే తప్ప ఐరోపా, మాజీ సోవియట్‌ దేశాలకు (సీఐఎస్‌) భారత ఔషధ ఎగుమతులు పెరిగే అవకాశం లేదన్నారు. మన ఔషధ ఎగుమతుల్లో ఐదో వంతు సీఐఎస్‌ దేశాలకే పోతున్న విషయాన్ని గుర్తు చేశారు. అందులో 60 శాతం రష్యా వాటా అన్నారు. రష్యాకు ఔషధ ఎగుమతులు పెంచడంపై ఇటీవల ఒక వెబినార్‌ నిర్వహించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు వందకుపైగా దేశాలకు మన దేశం 23.9 కోట్ల డోసుల కొవిడ్‌ టీకాలు సరఫరా చేసినట్టు ఆయన వెల్లడించారు. 

Updated Date - 2022-08-01T07:09:33+05:30 IST