కురిచేడు ఘటనలో 10 మంది అరెస్టు

ABN , First Publish Date - 2020-08-12T09:24:32+05:30 IST

ప్రకాశం జిల్లా కురిచేడు శానిటైజర్‌ మరణాల కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఛేదించింది.

కురిచేడు ఘటనలో 10 మంది అరెస్టు

ఒంగోలు (క్రైం), ఆగస్టు 11:  ప్రకాశం జిల్లా కురిచేడు శానిటైజర్‌ మరణాల కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఛేదించింది. శానిటైజర్‌ తాగి 16 మంది మృతి చెందిన ఈ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్టు చేసింది. శానిటైజర్‌ తయారీకి వినియోగించే ముడి సరుకును పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకుంది. కేసు వివరాలను ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ మంగళవారం ఒంగోలులో వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్‌ జిల్లా సిద్ధాపురానికి చెందిన సాలె శ్రీనివాస్‌ అలియాస్‌ జాజుల జీడిమెట్లలోని సుభా్‌షనగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఎలాంటి అనుమతులూ లేకుండా శానిటైజర్‌ తయారీ ప్రారంభించాడు. అందులో ప్రాణాంతకమైన రసాయనాలు వినియోగించాడు.


అలా తయారుచేసిన శానిటైజర్‌ను పర్ఫెక్ట్‌ గోల్డ్‌ పేరుతో అన్ని ప్రాంతాల్లోనూ విక్రయించడం ప్రారంభించాడు. దీన్ని సేవించడం వల్లే గత నెల కురిచేడులో 16 మంది మృతి చెందినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివా్‌సతోపాటు, అతని సోదరుడు సాలె శివకుమార్‌, ఆ శానిటైజర్‌ కంపెనీ డిస్ర్టిబ్యూటర్‌గా ఉన్న కేశవ్‌అగర్వాల్‌తోపాటు వారికి ప్రాణాంతక మిథనాల్‌, ఇతర రసాయనాలు సరఫరా చేసిన హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ దావూద్‌, మహ్మద్‌ హాజీలను అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. అనుమతులు లేని ఆ శానిటైజర్‌ను కురిచేడులో విక్రయించిన ఐదుగురు మెడికల్‌ షాపుల యజమానులను కూడా అరెస్టు చేశామన్నారు. హైదరాబాద్‌లోని తయారీ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున శానిటైజర్‌ బాటిళ్లు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 


 కంపెనీల్లో విస్తృత తనిఖీలు: వినీత్‌ బ్రిజ్‌లాల్‌

కురిచేడు ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైందని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా  శానిటైజర్‌ తయారీ కంపెనీల్లో పోలీసులతో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌బ్రిజ్‌లాల్‌ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated Date - 2020-08-12T09:24:32+05:30 IST