1 వార్డెన్‌... 2 హాస్టళ్లు!

ABN , First Publish Date - 2022-01-25T04:42:44+05:30 IST

1 వార్డెన్‌... 2 హాస్టళ్లు!

1 వార్డెన్‌... 2 హాస్టళ్లు!
బి సి వసతి గృహం

- ఇదీ బీసీ హాస్టళ్ల పరిస్థితి

- ఒక్కొక్కరికీ రెండు వసతి గృహాల బాధ్యతలు

-జిల్లా వ్యాప్తంగా 38 పోస్టులు ఖాళీ

- ఇతర సిబ్బందీ అంతంతే...

- 20 ఏళ్లుగా కొత్త నియామకాలు లేవు

(రాజాం)

జిల్లాలో బీసీ సంక్షేమ వసతిగృహాల పర్యవేక్షణ ప్రశ్నార్థకమవుతోంది. ఒక్కో వార్డెన్‌...రెండేసి హస్టళ్ల బాధ్యతలు చూస్తుండడమే దీనికి ప్రధాన కారణం. విద్యార్థులకు మెరుగైన వసతి, మెనూ ప్రకారం ఆహారం అందడం లేదు. వార్డెన్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో విద్యార్థుల బాగోగులు పట్టించుకునే వారే కరువవుతున్నారు. వాస్తవానికి ప్రతి హాస్టల్‌లో వార్డెన్‌, డిప్యూటీ వార్డెన్‌, కుక్‌, సహాయకులు, నైట్‌ వాచ్‌మెన్‌ వంటి పోస్టులు తప్పనిసరిగా ఉండాలి. కానీ జిల్లాలో సగానికిపైగా హాస్టళ్లకు అసలు వార్డెన్లే లేరు. డిప్యూటీ వార్డెన్ల ఊసే లేదు. దిగువ స్థాయి సిబ్బంది కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన కొనసాగుతున్నారు. దీంతో వసతిగృహాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. 

జిల్లాలో 71 బీసీ సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో 4,600 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. కానీ వార్డెన్లు కేవలం 33 మంది మాత్రమే ఉన్నారు. 38 హాస్టళ్లకు సంబంధించి వార్డెన్‌ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి.  పదవీ విరమణ పొందుతున్న వారి స్థానంలో కొత్తవారిని నియమించడం లేదు. కనీసం కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియామకాలు సైతం చేపట్టడం లేదు. దీంతో పక్క హాస్టళ్ల వార్డెన్లు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వార్డెన్‌ రెండు, మూడు హాస్టళ్ల చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. తమపై పనిభారం పెరుగుతోందని వార్డెన్లు చెబుతున్నారు. అదే హాస్టళ్ల పర్యవేక్షణపై ప్రభావం చూపుతోంది. వార్డెన్లు పూర్తిస్థాయిలో హాస్టల్‌లో సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దిగువ స్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో విద్యార్థులు సమయపాలన పాటించడం లేదు. కొన్ని హాస్టళ్లలో ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెళుతున్నారో తెలియడం లేదు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు తరువాత ముఖం చాటేస్తున్నారు. 


పెరగని డైట్‌ చార్జీలు

వసతిగృహాల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా డైట్‌ బిల్లులు పెంచడం లేదు. దీంతో మెనూలో కోత తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. వారానికి ఆరు రోజులు పెట్టాల్సిన కోడిగుడ్డు కూరను రెండు రోజులే పెడుతున్నారు. చికెన్‌ వారానికి ఒక రోజుకే పరిమితం చేస్తున్నారు. కూరల్లో నాణ్యత కొరవడుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో చివరిసారిగా డైట్‌ చార్జీలు పెరిగాయి. ఈ నాలుగేళ్లలో నిత్యావసరాలు, కూరగాయల ధరలు 50 నుంచి 70 శాతం పెరిగాయి. ప్రభుత్వం చెల్లించే ధరకు... బయట మార్కెట్‌లో ఉన్న ధరకు భారీ వ్యత్యాసం ఉందని వార్డెన్లు పేర్కొంటున్నారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డైట్‌ చార్జీలను పెంచాలని, పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని వార్డెన్లు కోరుతున్నారు.


కొరత వాస్తవమే

జిల్లాలో బీసీ హాస్టళ్లకు సంబంధించి వార్డెన్ల కొరత వాస్తవమే. అయినా ఉన్నవారితో సర్దుబాటు చేసి వసతిగృహాలను మెరుగైన స్థితిలో నిర్వహిస్తున్నాం. జిల్లాలో మొత్తం 71 బీసీ వసతిగృహాలకుగాను 33 మంది మాత్రమే వార్డెన్లు ఉన్నారు. 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాం. 

- రామారావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి, శ్రీకాకుళం 

Updated Date - 2022-01-25T04:42:44+05:30 IST