Abn logo
Oct 28 2021 @ 02:03AM

అర్ధసత్యాలతో ఆర్భాటమెందుకు?

‘భారతదేశం టీకాల కార్యక్రమంలో అప్రతిహత విజయం సాధించింది. డజన్లకొద్దీ దేశాలు టీకాల సరఫరా కోసం ఎదురుచూస్తునే ఉన్నాయి. కానీ, భారతదేశం అంతలోనే 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని అధిగమించింది!’ అని నరేంద్ర మోదీ ఘనంగా చాటుకున్నారు. ఈ విజయం తనకు, తన పార్టీకి, ప్రతి ఒక్కరికీ గర్వకారణమని కూడా ఆయన అన్నారు. అయితే ఆ విజయం ఈ దేశ పౌరుల సహకారం, ఆరోగ్య భద్రతా వ్యవస్థల అనితర సాధ్యమైన కృషి వల్లే సాధ్యమయింది. అది ఒక్క రోజులో సాధించిన విజయం కాదు. బహుశా, మోదీకి 100 సంఖ్య మీద ప్రత్యేక మక్కువ ఉన్నట్టుగా కనిపిస్తోంది. 2014లో కూడా ఎన్నికలకు ముందు నిత్యావసర వస్తువుల ధరలను 100 రోజులలో తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అలాంటి 100 రోజులు ఎన్నో గడిచి పోయాయి. అయితే ఇంతవరకు ఆ హామీని నెరవేర్చనేలేదు. 


ఇదలా ఉంచితే వాక్సిన్ల గురించి కొన్ని వాస్తవాలను మోదీకి తెలియజేయాల్సిన అవసరముంది. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలు మాత్రమే వాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా 679 కోట్ల టీకాలు వేశారు. 135 కోట్ల మంది భారత జనాభాకు మొదటి, రెండవ డోసుతో సహా 100 కోట్ల కంటే తక్కువ వాక్సిన్లు వేశారు. అంటే ప్రతి వంద మందికి 72 డోసులు మాత్రమే వేశారు. చైనాలో 223 కోట్ల వాక్సిన్లు వేయగా ప్రతి 100 మందికి 155 డోసులు అందాయి. కెనడాలో ప్రతి వంద మందికి 150 వాక్సిన్లు వేశారు. ఆర్థిక స్థితిగతుల్లో మనలాంటి దేశమైన బ్రెజిల్‌లో సైతం ప్రతి 100 మందికి 121 డోసులు ఇచ్చారు. 


బ్రిటన్‌లో రికార్డుస్థాయిలో 95 మిలియన్ వాక్సిన్లు వేశారు. ప్రతి 100 మందికి 139 డోసులు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 106 దేశాలు 100 శాతం వాక్సినేషన్‌ను సాధించాయి. మనకంటే చిన్న దేశాలు, ఆర్థికంగా వెనుకబడిన దేశాలు కూడా కొవిడ్ వాక్సిన్ల విషయంలో ముందంజలో ఉన్నాయి. ఈ విషయంలో మనదేశం 132 దేశాల తరువాయి స్థానంలో ఉంది. వాక్సిన్ల ఉత్పత్తి విషయానికి వస్తే సాధారణ ప్రజలకు అవి ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి? తదుపరి ఎన్నికలకు సంసిద్ధమవడంలో భాగంగానే ప్రజలకు అర్ధసత్యాలు చెబుతున్నారా? 


కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఎత్తుగడలను ఎప్పుడూ అనుసరించలేదు? 1992లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అది త్వరితగతిన ఉద్యమస్థాయిని అందుకుని పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించింది. కేవలం మూడేళ్ల వ్యవధిలో 17 కోట్ల మంది బాలలకు పోలియో టీకాలు వేశారు. అప్పట్లో, ఇప్పటి మాదిరిగా అధునాతన రవాణా సదుపాయాలు గానీ, సాంకేతికతలు కానీ లేవనే వాస్తవాన్ని విస్మరించకూడదు. అయినా ప్రజారోగ్య రంగంలో సాధించిన ఆ మహావిజయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రచారానికి ఉపయోగించుకోలేదు. 1960–80 సంవత్సరాల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వాలు మలేరియాను నిర్మూలించాయి. అయితే నరేంద్ర మోదీ ఏడేళ్ల పాలనలో ఆ వ్యాధి పీడితుల సంఖ్య పెరుగుతోంది. 1975 మేలో చివరి మశూచి కేసు నమోదయింది. అయినప్పటికీ ఆ తరువాత రెండు సంవత్సరాల పాటు ఆ వ్యాధి విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి. 1976 మార్చి–నవంబర్ నెలల మధ్య ఐదు లక్షలకు పైగా గ్రామాలలోనూ, 260 పట్టణ ప్రాంతాలలోనూ కొత్త మశూచి కేసులు తలెత్తకుండా నిరోధించేందుకు ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించారు.


1976 డిసెంబర్ -1977 జనవరి మధ్య ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణులతో సహా ఒక జాతీయ కమిషన్ సభ్యులు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పర్యటించి మశూచి నిర్మూలన కార్యక్రమాలను నిశితంగా పరీక్షించారు. 1977 ఏప్రిల్‌లో అంతర్జాతీయ మశూచి నిర్మూలన అంచనా కమిషన్ సభ్యులు దేశ మంతటా పర్యటించి ఆ వ్యాధి భారి నుంచి భారత్ సంపూర్ణంగా బయటపడిందని నిర్ధారించారు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు అంటే 1979లో ప్రపంచవ్యాప్తంగా మశూచి వ్యాధి పూర్తిగా అంతరించిపోయింది. 


మరి కొవిడ్ మహమ్మారిని పారదోలే విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎంత అసంగతంగా వ్యవహరించిందో చూడండి. తొలుత చప్పట్లు కొట్టమన్నారు. ఆ తరువాత దీపాలు వెలిగించమన్నారు. ఇవి అహేతుక చర్యలు కావా? చప్పట్లు, దీపాలతో వైరస్‌లు అంతరిస్తాయా? మోదీ బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లే దేశవ్యాప్తంగా కొవిడ్ రెండో దఫా విజృంభించింది మరణ మృదంగం మోగించింది. ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు 72 శాతం వాక్సినేషన్ కూడా ప్రజలు, పాలనా యంత్రాంగం మధ్య సహకారం వల్లే సాధ్యమయిందని చెప్పి తీరాలి. ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పుడు వాటి ఘనత తమ ప్రభుత్వానిదేనని మోదీ చెప్పుకోవడం కద్దు. వాక్సినేషన్ ఒక కార్యక్రమమే కానీ, ఒక ఉత్పత్తి కాదు. దానిని ఒక బ్రాండ్ పేరుతో గుర్తించనవసరం లేదు. నిజమైన నాయకుడు ఎప్పుడూ ప్రజల ప్రయత్నాలను గుర్తిస్తాడు. వారి పొరపాట్లకు బాధ్యత వహిస్తాడు. అయితే మోదీ విషయం ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఆయన రంగంలోకి రాకముందే ఈ దేశం ఎన్నో కాలపరీక్షలను ఎదుర్కొని ఘనవిజయాలను సాధించింది. వివిధ రంగాలలో విప్లవాలు, ఉద్యమాలే ఇందుకు నిదర్శనం. వాటి సంపూర్ణ సాఫల్యం భారతీయులుగా మనకు ఎంతో గర్వకారణం. భారత్ ఇప్పుడు ప్రపంచ అతి పెద్ద మూడో ఆర్థికవ్యవస్థగా ఉన్నదంటే అందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వాల, దేశ ప్రజల సమష్టి కృషే కారణం కాని మోదీ పాలన కాదు. నాయకులు శాశ్వతం కాదు. ప్రజల సంక్షేమం ముఖ్యం. ఇది పార్టీలకు, నాయకులకు అతీతమైన బాధ్యత.


కొవిడ్ మహమ్మారికి ఈ దేశంలో 4.53 లక్షల మంది చనిపోయారు. మోదీ వారికి నివాళులర్పించారా? మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారా? లేదా ఏదో ఒక విధమైన ఆర్థిక సహాయాన్నయినా అందించారా? ఇటువంటి చర్యలు అర్థవంతంగా ఉండేవి. కాని ఆయన ప్రభుత్వం అలా వ్యవహరించలేదు. మాటలకే పరిమితం కాకుండా ఉన్నట్టయితే ప్రజాశ్రేయస్సు పట్ల ఆయన ఆరాటంలో చిత్తశుద్ధి ఉందని రుజువయ్యేది. 2021 డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రతి ఒక్కరికి రెండు డోసుల వాక్సిన్ వేస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుతెన్నులను గమనిస్తే వచ్చే డిసెంబర్ 31 నాటికి దేశ ప్రజలందరికీ రెండు డోసుల టీకా ఇవ్వడం సాధ్యమవుతుందా? ఈ విషయమై ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. ప్రజల ఆరోగ్య భద్రత కాదు, రాజకీయ ప్రచారమే మోదీ ప్రభుత్వానికి ముఖ్యం కదా. 


పొన్నాల లక్ష్మయ్య

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు

ప్రత్యేకం మరిన్ని...