ప్రతినెలా 1.20 కోట్ల కొవాగ్జిన్‌ డోసులు!

ABN , First Publish Date - 2021-04-13T07:56:43+05:30 IST

కొవాగ్జిన్‌ టీకాల ఉత్పత్తిని పెంచే దిశగా భారత్‌ బయోటెక్‌ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో ప్రతినెలా 50 లక్షల డోసులను తయారు చేస్తుండగా, జూలైకల్లా ప్రతినెలా 1.20 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది

ప్రతినెలా 1.20 కోట్ల కొవాగ్జిన్‌ డోసులు!

జూలైకల్లా కొవాగ్జిన్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంపుపై భారత్‌ బయోటెక్‌ దృష్టి

బెంగళూరు ప్లాంట్‌లో టెస్టింగ్‌కు సన్నాహాలు


కొవాగ్జిన్‌ టీకాల ఉత్పత్తిని పెంచే దిశగా భారత్‌ బయోటెక్‌ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో ప్రతినెలా 50 లక్షల డోసులను తయారు చేస్తుండగా, జూలైకల్లా ప్రతినెలా 1.20 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని తమ టీకా ప్లాంట్‌లోనూ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వ్యాక్సిన్ల ఉత్పత్తికిగానూ ఇప్పటికే భారత్‌ బయోటెక్‌కు టెస్ట్‌ లైసెన్సు కూడా లభించింది. ప్రొడక్షన్‌ టెస్టింగ్‌లో భాగంగా తొలుత ఇక్కడ తయారు చేయనున్న టీకాను, హైదరాబాద్‌లోని ప్లాంట్‌లో వయల్స్‌లో నింపి సెంట్రల్‌ డ్రగ్‌ లేబొరేటరీ అనుమతుల కోసం పంపనున్నారు. టీకా ఉత్పత్తి ఒప్పందాలను కుదర్చుకునేందుకు పలు కంపెనీలతోనూ భారత్‌ బయోటెక్‌ సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. బయో సేఫ్టీ లెవల్‌-3 ప్రమాణాల ప్రకారం పనిచేసే ప్లాంట్లను కలిగిన కంపెనీలు లేదా ఆ స్థాయి లేబొరేటరీకి అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు ఆసక్తి చూపే సంస్థలకు కొవాగ్జిన్‌ తయారీ పరిజ్ఞానాన్ని బదిలీ చేసేలా ఈ ఒప్పందాలు ఉండొచ్చని అంటున్నారు. కొవాగ్జిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు రూ.150 కోట్లు కావాలని భారత్‌ బయోటెక్‌ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఈ నిధుల్లో చెరో రూ.75 కోట్లను హైదరాబాద్‌, బెంగళూరుల్లోని ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగిస్తామని పేర్కొంది. 

Updated Date - 2021-04-13T07:56:43+05:30 IST