omicron పరీక్షల నిలిపివేత.. సంపూర్ణ లాక్‌డౌన్‌ అవసరం లేదు

ABN , First Publish Date - 2022-01-12T13:51:33+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ‘ఒమైక్రాన్‌’ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన కేసుల్లో 85 శాతం కేసులు ఒమైక్రాన్‌ కేసులుగానే బయటపడుతుండటంతో ఈ

omicron పరీక్షల నిలిపివేత.. సంపూర్ణ లాక్‌డౌన్‌ అవసరం లేదు

                    - ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం


చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా ‘ఒమైక్రాన్‌’ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. పాజిటివ్‌ నిర్ధారణ అయిన కేసుల్లో 85 శాతం కేసులు ఒమైక్రాన్‌ కేసులుగానే బయటపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు అధికమవుతుండటంతో సంపూర్ణ లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన అవసరం లేదని కూడా ఆయన అభి ప్రాయపడ్డారు. సంక్రాంతి సెలవుదినాలు పూర్తయిన తర్వాత గతంలో విధించినట్లుగా కఠిన నిబంధనలతో లాక్‌డౌన్‌ను పొడిగించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక తిరువాన్మియూరులో ఇళ్ళలో ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా బాధితులకు మంగళవారం ఆయన ఆక్సీమీటర్‌ పరికరాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత అడయార్‌ కార్పొరేషన్‌ జోనల్‌ కార్యాలయంలోని కౌన్సెలింగ్‌ సెంటర్‌ పనితీరును కూడా పరిశీలించారు. గ్రేటర్‌  చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్‌, సౌత్‌ చెన్నై లోక్‌సభ నియోజకవర్గం సభ్యురాలు తమిళచ్చి తంగపాండ్యన్‌ ఆయనతోపాటు పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రతిరోజూ పాజిటివ్‌ కేసులు రెండు వేల చొప్పున నమోదవుతున్నాయని, బాధితులంతా స్వల్ప అస్వస్థత కు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొంది, ఇంటివద్దే ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యు లిచ్చే మందులు తీసుకుని త్వరగానే కోలుకుంటున్నారని చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే రాష్ట్ర ప్రజలు ఒమైక్రాన్‌ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నానన్నారు. ఐసీఎంఆర్‌ సూచనల మేరకు వైరస్‌ బాధితులూ రోజూ ఉదయం, సాయంత్రం ఆక్సీమీటర్లతో పరీక్షించుకోవాలని ఆయన సూచించారు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ 92 కౌంటింగ్‌ కంటే తక్కువగా ఉంటే వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే చాలునని చెప్పారు. రాజధాని నగరం చెన్నైలో ప్రస్తుతం 26వేల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారైతే తప్పకుండా ఆసుపత్రిలోనే చికిత్స పొందాల్సి ఉంటుందన్నారు. నగరంలో 26 వేలమందికి పైగా కరోనా బాధితులున్నారని, వీరిలో 21987 మంది ఇళ్ళ వద్దే ఐసోలేషన్‌లో గుడుపుతున్నారని తెలిపారు. స్థానిక రాజీవ్‌గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజనాస్పత్రి, గిండికింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆసుపత్రిలో 250 మంది ఒమైక్రాన్‌ వైరస్‌ తాకిడికి గురై చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 11 వైద్య కళాశాలలను ప్రధాని నరేంద్రమోదీ బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఈ కొత్త వైద్య కళాశాలల ప్రారంభంతో అదనంగా 1450 మంది విద్యార్థులు వైద్య కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుందని మంత్రి సుబ్రమణ్యం స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-12T13:51:33+05:30 IST