వదలని వాన

ABN , First Publish Date - 2022-09-28T07:47:43+05:30 IST

మళ్లీ మొదలైన మాయదారి వాన రాష్ట్రాన్ని వదలడం లేదు. మంగళవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం పడింది.

వదలని వాన

  • హైదరాబాద్‌లో భారీ వర్షం..
  • పలు కాలనీలు, ఇళ్లలోకి నీరు
  • సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు మహిళ మృతి
  • గోదావరి ప్రాజెక్టులకు వరద
  • రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
  • శ్రీరాంసాగర్‌లోకి 42,620 క్యూసెక్కుల వరద

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మళ్లీ మొదలైన మాయదారి వాన రాష్ట్రాన్ని వదలడం లేదు. మంగళవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం పడింది. ప్రభావిత ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా రెండువేల ఎకరాల్లో మొక్కజొన్న, పసుపు, పత్తి పంటలకు నష్టం జరిగింది. సూర్యాపేట జిల్లా నాగారంలో పత్తిచేనులో కూలీలు పనిచేస్తుండగా పిడుగు పడటంతో కాట్రేగుల గంగమ్మ (55) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలంలో పెద్దవాగు ఉప్పొంగడంతో ఆవలి వైపు హనుమంతు అనే రైతు చిక్కుకుపోయాడు. గజ ఈతగాళ్ల సాయంతో ఆయన్ను ఈవలి ఒడ్డుకు సురక్షితంగా చేర్చారు. హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. చాలాచోట్ల 5సెం.మీపైగానే వర్షపాతం నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు  ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకొని పలు ప్రదేశాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. 


లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతకుముందు రాత్రి కురిసిన వర్షం నుంచి తేరుకోకముందే మళ్లీ  వర్షం కురియడంతో ఇళ్ల ఎదుట నిలిచిన, ఇళ్లలోకి వచ్చిన వరదను బయటకు పంపించేందుకు ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. హయత్‌నగర్‌లోని భాగ్యలత వద్ద జాతీయ రహదారి, హయత్‌నగర్‌ బస్‌ డిపో రోడ్డు, రాఘవేంద్రనగర్‌ కాలనీ ఫేజ్‌-2, ఆర్‌టీసీ బస్‌ డిపో, కోర్టు ప్రాంగణం మొత్తం వర్షం నీటితో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగోలు డివిజన్‌ అయ్యప్ప కాలనీలో ఇళ్లలోకి వరద రావడంతో గృహోపకరణాలు పాడయ్యాయి. మన్సూరాబాద్‌ డివిజన్‌ సహారా స్టేట్స్‌లోని కళ్యాణి బ్లాక్‌ అపార్టుమెంట్‌ వద్ద ప్రహరీ కూలింది. కూకట్‌పల్లిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వివేకానందనగర్‌కాలనీ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీకాలనీ, బాలాజీనగర్‌, మూసాపేట ప్రాంతాల్లోని రోడ్లపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మౌలాలి డివిజన్‌లోని ఈస్ట్‌ దీన్‌దయాళ్‌నగర్‌, సుభా్‌షనగర్‌, నెహ్రునగర్‌, ఈస్ట్‌ మారుతీనగర్‌, ఆర్టీసీ కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు చేరాయి. కంటోన్మెంట్‌లోని మారేడుపల్లి, కార్ఖానా, రసూల్‌పురా, అన్నానగర్‌, బోయినపల్లి, తిరుమలగిరి, లాల్‌బజార్‌, బొల్లారం తదితర ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.


 యాదాద్రి జిల్లా వలిగొండలో 10.5 సెం.మీ, నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలంలో 7.2 సెం.మీలు, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో 6 సెం.మీ, జగిత్యాల జిల్లా భీర్‌పూర్‌లో 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు.. వర్షాలకు గోదావరి పరిధిలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 698.575 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి 6041 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా, రెండు గేట్లను ఎత్తి దిగువకు 12150 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా.. ప్రస్తుతం 358.70 మీటర్లుగా ఉంది. ప్రాజెక్ట్‌లోకి 3700 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఒక గేటు ఎత్తి దిగువన ఉన్న సుద్దవాగులోకి 7100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీరామసాగర్‌లోకి 42,620 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది పది గేట్ల ద్వారా 34,320 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090.95 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. 

 

మరో రెండ్రోజులు వానే 

  రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మంగళవారం కూడా కొనసాగిందని.. ఈ క్రమంలో సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు వ్యాపించిందని సంచాలకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావంతో రెండ్రోజులపాటు తేలికపాటి, మోస్తరు, భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు.  

Updated Date - 2022-09-28T07:47:43+05:30 IST