ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-20T05:43:11+05:30 IST

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
తాండూరు : శ్రీసాయిమేథ విద్యాలయంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో కృష్ణుడు, గోపికల వేషాధారణలో విద్యార్థులు

తాండూరు/ధారూరు/వికారాబాద్‌/కీసర/ఘట్‌కేసర్‌రూరల్‌/దోమ/ పరిగి/కులకచర్ల/కొడంగల్‌/కొడంగల్‌రూరల్‌/బొంరా్‌సపేట్‌/దౌల్తాబాద్‌/పూడూర్‌/మోమిన్‌పేట్‌/నవాబుపేట, ఆగస్టు 19 :   కృష్ణాష్టమిని వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ఈమేరకు శుక్రవారం తాండూరు పట్టణం గాంధీనగర్‌లో కౌన్సిలర్‌ సంగీతాఠాగూర్‌ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషాధారణలో ఆకట్టుకున్నారు. పట్టణంలోని శ్రీసాయిమేధ విద్యాలయం, ఆపిల్‌ కిడ్స్‌ పాఠశాలల్లో ఉట్టే కొట్టే కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ముఖ్యవక్తగా పాల్గొన్న విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌, కరస్పాండెంట్‌ పెరుమాళ్ల వెంకట్‌రెడ్డిలు మాట్లాడుతూ దేశ సంస్కృతి, సాంప్రదాయాలను మరవకుండా పండుగలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కరస్పాండెంట్‌ పెరుమాళ్ల వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే ధారూరు మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో కోలాటం ఆడుతూ ఉట్లు కొడుతూ పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. వికారాబాద్‌ నియోజకవర్గంలో చిన్నారులను వారి తల్లిదుండ్రులు కృష్ణుడు, గోపికల వేషాధారణల్లో అలంకరించి వివిధ సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.

వికారాబాద్‌ పట్టణంలోని పాఠశాలల్లో వేడుకలు ఘనంగా నిర్వహించగా, పిల్లలు ఆనందంగా గడిపారు. పట్టణంలోని భృంగీ సంకల్ప విద్యాపీఠం, గీతాంజలి, వివేకావాణి తదితర పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా వికారాబాద్‌ పట్టణంలోని ఏకల్‌ గ్రామోత్తన్‌ ఫౌండేషన్‌, జనని నైపుణ్య శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి, వరలక్ష్మీవ్రతం, రాఖీ పౌర్ణమిని సామూహికంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో వందమంది మహిళలు పాల్గొన్నారు. కృష్ణుడి డోలారోహణం, ఉట్టి కొట్టడం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమిని నిర్వహించారు. కార్యక్రమంలో మహావీర్‌ ఆసుపత్రి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పావని, సంఘం లక్ష్మీబాయి గురుకుల ప్రిన్సిపాల్‌ రమణమ్మ, బార్యాద్‌ కృష్ణ సమితి అధ్యక్షులు అజిలప్ప, కార్యదర్శి వేణు, ఎ.కిష్టయ్య, రవితేజ, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేపట్టారు.

కీసరలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో జరిగిన వేడుకల్లో శుక్రవారం ఉదయం పండితులచే శ్రీ కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి  ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఘట్‌కేసర్‌ మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. దోమ మండల కేంద్రంతో పాటు ఆయా పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బడెంపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు గోపిక, కృష్ణుడి వేషధారణతో ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయులు కరుణాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పరిగి పట్టణంలోని సుదీక్ష, భృంగి తదితర  పాఠశాలల్లో  వేర్వేరుగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. బాలబాలికలచే కృష్ణుడు, గోపికల వేషధారణలతో నిర్వహించిన ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా పెరుగుబసంతం నిర్వహించారు. పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. సుదీక్ష స్కూల్‌లో ప్రతిభ కనబరించిన చిన్నారులకు మాజీ జడ్పీటీసి పి.చంద్రయ్య, ప్రిన్సిపాల్‌ చంద్రమ్మల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.

కులకచర్ల మండలంలోని పలు గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కులకచర్ల, పుట్టపహాడ్‌, బండవెల్కిచర్ల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో గ్రామాల్లో ఊరేగుతూ ఉట్లు కొట్టారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కొడంగల్‌ పట్టణంలోని కృష్ణవేణి పాఠశాల, మండల పరిధిలోని ఆలేడ్‌, రుద్రారం, అన్నారం, పాత కొడంగల్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థినీవిద్యార్థులు కోలాటం, నృత్యాలు, ఆటపాటలతో అలరించారు. బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌, పూడూర్‌ మండల కేంద్రాలతో పాటు వివిధ గ్రామాల్లో వేడుకలు జరుపుకున్నారు. పూడూరు మండలం తిర్మాలాపూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో చిన్నారులు గోపిక, కృష్ణుడి వేషధారణలతో ఆకట్టుకున్నారు. మోమిన్‌పేట్‌, నవాబుపేట్‌ మండలాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు గోపిక, కృష్ణుడి వేషాధారణలతో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయా పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. మేడ్చల్‌లోని పలు పాఠశాలల్లో చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో అలరించారు. ఈ సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - 2022-08-20T05:43:11+05:30 IST