వానొస్తే .. వరదొచ్చే!

ABN , First Publish Date - 2022-06-26T06:15:54+05:30 IST

జిల్లా కేంద్రమైన నిర్మల్‌ పట్టణం చుట్టూ ఉన్న తొమ్మిది గొలుసు కట్టు చెరువుల పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్థంగా మారింది.

వానొస్తే .. వరదొచ్చే!
నిర్మల్‌ పట్టణంలో వర్షానికి పట్టణంలోని ఇంద్రానగర్‌ ప్రాంతంలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు

మండుటెండల్లో సైతం తగ్గని నీటిమట్టాలు 

నిండుకుండలా చెరువులు..వర్షాలకు వరదముప్పు 

ఏళ్ల నుంచి నిలిచిపోయిన నీటిపారకం 

చెరువుల కింద సాగు అదృశ్యం 

విస్తరించిన ఇళ్ల నిర్మాణాలు, రియల్‌ వెంచర్‌లు 

చెరువులు.. నాలాలు.. కందకాలు.. కాలువలు కబ్జా

వరద నీటిప్రవాహంపై స్థానికుల ఆందోళన 

గుణపాఠం నేర్పని గత వరదముంపులు 

స్పందన లేని ప్రభుత్వం 

నిర్మల్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రమైన నిర్మల్‌ పట్టణం చుట్టూ ఉన్న తొమ్మిది గొలుసు కట్టు చెరువుల పరిస్థితి ప్రస్తుతం అస్తవ్యస్థంగా మారింది. ఈ చెరువుల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ క్రమంగా ప్రమాదపుటంచులకు చేరుకుంటున్నాయంటున్నారు. నిన్నటి వరకు పట్టణం చుట్టూ ఉన్న చెరువులు ప్రస్తుతం ఊరిమఽధ్యలోకి చేరుకున్నాయి. చెరువుల బయట కూడా నిర్మాణాలు పెద్దఎత్తున జరగడంతో వీటి ప్రస్తుత పరిస్థితి గందరగోళంగా మారింది. కాగా పోయిన వర్షాకాలంలో వర్షాలు భారీగా కురియడంతో చెరువుల్లో నీటినిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చెరువుల కింద భూముల్లో వ్యవసాయ ఇప్పుడు నిలిచిపోయింది. ప్రస్తుతం ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, భారీ ఇల్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిండిపోయాయి. ఈ నిర్మాణాల కారణంగా చెరువుల కింది భూముల్లో పంట పొలాలన్నీ మాయమైపోయాయి. కాకతీయుల కాలంలో బహుళ ప్రయోజనాలను ఆశించి నిర్మల్‌లో గొలుసు కట్టు చెరువులను నిర్మించారు. బంగల్‌పేట్‌ చెరువుతో మొదలుకొని ఖజానాచెరువు, కురాన్నపేట్‌  చెరువు, మోతి తలాబ్‌ చెరువు, కంచరోణి చెరువు, మంజులాపూర్‌ చెరువు, ధర్మాసాగర్‌ చెరువుల కింద ప్రస్తుతం వ్యవసాయ భూములు కనుమరుగైపోయాయి. ఈ భూముల్లో భారీ భవంతులు, రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌లు ఏర్పాటు చేయడం శాపంగా మారిపోయింది. అయితే ఈ గొలుసుకట్టు చెరువుల్లో గత సంవత్సరం కురిసిన భారీవర్షాల కారణంగా నీటిమట్టాలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ఎండతీవ్రతతో నీరు ఇంకిపోవడం, అలాగే మరికొన్ని కారణాల వల్ల కొంతమేరకే ఈ చెరువుల్లో నీటిమట్టాలు తగ్గినప్పటికీ ఇంకా ఆశాజనకంగానే నీరు ఉంది. ఒకవేళ ఈ సారి భారీవర్షాలు కురిస్తే మాత్రం ఈ చెరువులు పొంగి పొర్లడం ఖాయమంటున్నారు. ఇప్పటికే చాలా రోజుల నుంచి ఈ చెరువుల పారకం పూర్తిగా నిలిచిపోయింది. తూములు, మత్తడులు మొత్తం పూర్తిగా శిథిలావస్తకు చేరుకున్నాయి. నీటిపారకం లేకపోవడంతో తూములు చాలా చోట్ల మూతపడిపోయా యి. నిర్మల్‌ చుట్టూరా ఉన్న ఈ గొలుసుకట్టు చెరువుల్లో ప్రస్తుతం గుర్రపు డెక్కతో పాటు ఇతర పిచ్చిమొక్కలు పేరుకుపోయాయి. దీంతో కొద్ది చెరువుల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్ని చెరువులు మైదానాలుగా కనిపిస్తున్నాయి. చెరువుల కిందికి తూముల ద్వారా నీటిని విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో ఆందోళన రేకేత్తిస్తోందంటున్నారు. చెరువుల కింద నిర్మాణాలు చేసుకున్న వారంతా ప్రస్తుత పరిస్థితుల్లో భయాందోళనకు గురవుతున్నారు. ప్రతియేటా వర్షకాలంలో ధర్మాసాగర్‌ చెరువు కింద ఉన్న ప్రియదర్శినినగర్‌లో, అలాగే కంచరోణి చెరువు కింద ఉన్న విద్యానగర్‌, ఆదర్శనగర్‌, సిద్దాపూర్‌ ప్రాంతాలు జలమయంగా మారి ప్రవాహంలో చిక్కుకుంటున్నాయి. ఇకనైనా సంబందిత యంత్రాంగం చెరువుల నుంచి నీటిని ప్రవహించేట్లు చేయాలని కోరుతున్నారు. 

నిలిచిపోయిన నీటిపారకం

జిల్లాకేంద్రం చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువుల కింద వ్యవసాయం పూర్తిగా అదృశ్యం కావడంతో ఈ చెరువుల నుంచి నీటిపారకం స్తంభించిపోయింది. దీంతో చెరువుల్లో వర్షాల కారణంగా నీరునిండుగా ఉన్నప్పటికి ఆ నీటిని వదిలే పరిస్థితి లేకుండాపోయిందంటున్నారు. ఒకవేళ ఈ సారి వర్షకాలంలో భారీ వర్షాలు కురిస్తే మాత్రం చెరువులు నిండిపోయి నీరంతా కింది ప్రాంతాలకు భారీగా ప్రవహించే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే చెరువుల కింద నిర్మించుకున్న ఇళ్లన్నీ జలమయం గా మారడం ఖాయమంటున్నారు. 

కందకాల కబ్జాతోనే సమస్య

నిర్మల్‌ పట్టణంలోని కందకాలను యథేచ్చగా కబ్జా చేస్తున్నారు. చారిత్రక కందకాల కబ్జాకారణంగా వరదనీటి ప్రవాహానికి తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వర్షకాలంలో నీటిఉదృతి పెరుగుతుండడంతో కందకాలపై నుంచి వరదనీరు ప్రవహించి రోడ్లు, ఇళ్లలోకి చేరుకుంటున్నాయంటున్నారు. గత పది, పదిహేళ్ల క్రితం వరకు భారీగా ఉన్న కందకాలన్ని ప్రస్తుతం చిన్నచిన్న డ్రైన్‌లుగా మారిపోయాయి. దీనికి అధికారులు కబ్జాలను వదిలేసి శాశ్వతడ్రైన్‌లను నిర్మించడంతో ప్రవాహ ఉధృతి కి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇలా ఇంద్రానగర్‌, రవినగర్‌, శాస్ర్తీనగర్‌ , డాక్టర్స్‌లేన్‌, మంచిర్యాల చౌరస్తాతో పాటు తదితర ప్రాంతాలన్నీ గంట పాటు ఏకధాటిగా వర్షం కురిస్తే నీట మునుగుతున్నాయి. అధికారులు ఎండకాలంలో కందకాల నుంచి వరద రాకుండా పకడ్భంధీ చర్యలు తీసుకోకపోతుండడంతోనే ప్రతీయేటా ఈ విపత్తు తలెత్తుతోందంటున్నారు. ఎప్పటికప్పుడు కందకాల కబ్జాలను అడ్డుకొని డ్రైనేజీ వ్యవస్థను పకడ్భంధీగా చేపడితే ముంపు సమస్య తొలగిపోనుందంటున్నారు. 

చర్యలు తీసుకోవాలి

 ప్రతీయేటా ప్రియదర్శిని నగర్‌లోకి ధర్మసాగర్‌ చెరువునీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. ఇక్కడి భూముల్లో వ్యవసాయం లేకపోవడంతో చెరువు నీరంతా రోడ్లపైకి , ఇళ్ళలోకి చేరుకొని ఇబ్బందులు కల్పిస్తోంది. ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరిస్తే భాగుంటుంది. 

- నర్సయ్య, ప్రియదర్శినినగర్‌, నిర్మల్‌

Updated Date - 2022-06-26T06:15:54+05:30 IST