ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరండి ప్లీజ్‌..

ABN , First Publish Date - 2022-05-20T09:53:05+05:30 IST

వారంతా విద్యార్థులకు పాఠాలు చెప్పి డిగ్రీ పట్టా పొందేలా చేసే గురువులు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరండి ప్లీజ్‌..

  • కొలువు నిలబెట్టుకునేందుకు కాంట్రాక్ట్‌ అధ్యాపకుల పాట్లు 
  • ప్రవేశాల కోసం ఇంటర్‌ 
  • పరీక్ష కేంద్రాల వద్ద విస్త్రత ప్రచారం

 

హైదరాబాద్‌ సిటీ, మే19 (ఆంధ్రజ్యోతి): వారంతా విద్యార్థులకు పాఠాలు చెప్పి డిగ్రీ పట్టా పొందేలా చేసే గురువులు. జీవితంలోని కీలక దశలో ఓ విద్యార్థికి దిశానిర్దేశం చేసే డిగ్రీ కళాశాల లెక్చరర్లు. సమాజానికి గొప్ప పౌరులను అందించే కీలక బాధ్యతను మోసే ఆ అధ్యాపకుల ఉద్యోగ జీవితం మాత్రం నడిసంద్రంలో నావలానే సాగుతుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తుండటమే ఇందుకు కారణం. విద్యార్థులు లేకుంటే కొలువు కోల్పోతామనే భయం వారిని రోడ్డెక్కించింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అడ్మిషన్ల కోసం ఇంటర్‌ పరీక్షా కేంద్రాల బాట పట్టించింది. ‘రండి మా కళాశాలలో చేరండి.. మీ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోండి‘ అంటూ కాంట్రాక్టు లెక్చరర్లు ఇంటర్‌ విద్యార్థులకు తమ కళాశాల గురించి వివరించే పరిస్థితి నెలకొంది.


తమ కళాశాలలో వసతులు, అందించే కోర్సులు ఇతర వివరాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ఆ అధ్యాపకులు తిరుగుతున్నారు. అంతేనా, విద్యార్థుల వివరాలు సేకరించి వారి ఇళ్లకు వెళ్లి మరీ తమ కళాశాలలో చేరమని వేడుకుంటున్నారు. ఇందుకోసం సొంత డబ్బును ఖర్చు చేస్తూ  అవస్థలు పడుతున్నారు. మరోపక్క, ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్లు మాత్రం విద్యార్థుల ప్రవేశాల విషయంలో తమకేం పట్టనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పెంచేందుకు కాంట్రాక్టు అధ్యాపకులంతా కృషి చేస్తున్నారని తెలంగాణ డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వినోద్‌కుమార్‌ వెల్లడించారు. ఇంటింటి ప్రచారం చేస్తున్నామని, పేద విద్యార్థుల ఫీజు కూడా కొన్ని చోట్ల తామే భరిస్తున్నామని వాపోయారు.


Updated Date - 2022-05-20T09:53:05+05:30 IST