భూఅక్రమాలు వాస్తవమే!

ABN , First Publish Date - 2022-08-11T06:08:57+05:30 IST

డివిజన్‌లోని పెద్దారవీడు మండలం రాజంపల్లిలో అధికార వైసీపీ నేత చేసిన భూఅక్రమాలపై విచారణకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది.

భూఅక్రమాలు వాస్తవమే!
రాజంపల్లిలో భూముల రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి

ఆర్డీవో పరిశీలనలో వెలుగులోకి  

పూర్తిస్థాయి విచారణకు ఆదేశం

మార్కాపురం, ఆగస్టు 10 : డివిజన్‌లోని పెద్దారవీడు మండలం రాజంపల్లిలో అధికార వైసీపీ నేత చేసిన భూఅక్రమాలపై విచారణకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. రాజంపల్లిలో వైసీపీ నేత భూదందాపై ఆంధ్రజ్యోతిలో ‘ష్‌... గప్‌చుప్‌’ శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైంది. దీనిపై మార్కాపురం ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి స్పందించారు. డిప్యూటీ తహసీల్దార్‌ కృష్ణారెడ్డి, మండల సర్వేయర్‌ సంజీవయ్యతో కలిసి రాజంపల్లిలో ఆక్రమిత భూములను పరిశీలించారు. రికార్డుల్లో పేర్లకు, వాస్తవంగా అనుభవంలో ఉన్న వారి పేర్లలో తేడాలను గుర్తించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని, ఆన్‌లైన్‌లో అక్రమంగా పేర్లు ఎక్కించుకున్నారని గతేడాది డిసెంబర్‌ 29న ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో సర్వే నెంబర్‌ 584పై విచారించిన అధికారులు ఆన్‌లైన్‌లో వారి పేర్లను తొలగించారు. అయితే ఆ భూములకు ఏర్పాటు చేసుకున్న కంచె రాళ్లను తొలగించలేదు. బుధవారం జరిగిన విచారణలో అధికారులు ఆ విషయాన్ని గుర్తించారు. వెంటనే రాళ్లు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి ఆదేశించారు. సర్వే నెంబర్‌ 533 ఏడబ్ల్యూగా రికార్డులలో ఉన్నట్లు గుర్తించారు. 534లో ఉన్న రామన్నకుంట, శ్మశానం భూములను గ్రామస్థులు పూర్వం నుంచి నీటి అవసరాలు, శవాలను కాల్చడానికి ఉపయోగించుకుంటున్నట్లు నిర్ధారించారు. పూర్తి విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్డీవో కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. 


Updated Date - 2022-08-11T06:08:57+05:30 IST