ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు బస్సులో ప్రయాణించాలి

ABN , First Publish Date - 2022-01-28T05:01:51+05:30 IST

ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కోరారు.

ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు బస్సులో ప్రయాణించాలి
పల్లెవెలుగు బస్సులో సంగారెడ్డికి వస్తున్న సజ్జనార్‌

 ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ 

సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేట ఆర్టీసీ బస్టాండ్‌, డిపోల సందర్శన


  సంగారెడ్డి అర్బన్‌, జనవరి 27: ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కోరారు. సంగారెడ్డి డిపో, కొత్త బస్టాండ్‌ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జహీరాబాద్‌ డిపో పల్లెవెలుగు బస్సులో ప్రయాణిస్తూ సదాశివపేట నుంచి సంగారెడ్డి కొత్త బస్టాండ్‌కు చేరుకున్నారు. బస్సులోనే ప్రయాణికుల సలహాలు, ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం డిపోలోని గ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. జహీరాబాద్‌, సంగారెడ్డి డిపోల పనితీరు బాగుందన్నారు. కేఎంపీఎల్‌, ఓఆర్‌, ఈపీకే బాగున్నందుకుగాను ఆర్‌ఎం సుదర్శన్‌, సంగారెడ్డి డిపో మేనేజర్‌ నాగభూషణంను సజ్జనార్‌ అభినందించారు. జిల్లాకు అనుకుని మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలున్నాయి కాబట్టి ప్రజల కదలిక ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో సమగ్ర విశ్లేషణ చేసి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీని ప్రజలు ఆదరిస్తున్నారని, గురువారం బస్సుడే నిర్వహించి ప్రయాణికుల సలహాలు తీసుకుంటున్నామన్నారు. ఇంకా సర్వీసెస్‌ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్‌ సమయంలో ఆదాయం చాలా తగ్గిందన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను లాభాల బాటలో తేవడంతో పాటు ఆర్టీసీకి పూర్వవైభవం తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ప్రజలు అపోహల మధ్య బస్సులో ప్రయాణిస్తున్నారని, అపోహలు లేకుండా ప్రయాణించాలని కోరారు. పజాప్రతినిధులు ప్రజల్లో విశ్వాసం నింపేలా బస్సులో ప్రయాణించినప్పుడే ఆదాయం పెరిగే ఆస్కారం ఉంటుందన్నారు. ప్రజలు ఏదో ఒక రోజు  సొంత వాహనాన్ని పక్కన పెట్టి బస్సులో ప్రయాణించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులను సంస్థ కాపాడుకుంటుందని, మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తున్నామన్నారు. మెకానికల్‌ స్టాఫ్‌కి కూడా ఇన్‌సెంటీవ్స్‌ ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నామన్నారు. ఆదాయం పెరిగిన తర్వాత డీఏ, ఏరియర్స్‌ కూడా ఇస్తామన్నారు. ఏమైనా సమస్యలుంటే వెల్ఫేర్‌ బోర్డు ద్వారా తమ దృష్టికి తెస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌, డీఎస్పీ బాలాజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. డీఏ, ఏరియర్స్‌ చెల్లించాలని, వేతన సవరణ చేయాలని కోరుతూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ నేత పల్లె కృష్ణమూర్తి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు సంగారెడ్డి డిపో ఆవరణలో సజ్జనార్‌ మొక్కను నాటారు.  కార్యక్రమంలో ఆర్‌ఎం సుదర్శన్‌, డీఎం నాగభూషణం, అసిస్టెంట్‌ మేనేజర్‌ నవీన్‌యాదవ్‌ పాల్గొన్నారు.


 మెరుగైన సేవలు అందిస్తాం

జహీరాబాద్‌ జనవరి 27: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచి, సంస్థను ప్రోత్సహించినపుడే ప్రయాణికులకు రవాణా సౌకర్యంలో మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. గురువారం ఆయన జహీరాబాద్‌ ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ఆర్టీసీ డిపోకు చేరుకున్న ఎండి సజ్జనార్‌ డిపోలోని కార్గో సర్వీస్‌ సేవలను పరిశీలించారు. ఆర్టీసీ డిపోలోని పలు వ్యాపార దుకాణాలను పరిశీలించిన ఎండి సజ్జనార్‌ మాట్లాడుతూ నాసిరకం వస్తువులు అమ్మినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కరోనా కారణంగా నష్టాల్లోకి కూరుకుపోయిన ఆర్టీసీని త్వరలోనే లాభాలు తీసుకువచ్చే స్థాయికి తెస్తామన్నారు. జహీరాబాద్‌ ఆర్టీసీ డిపోలో అన్ని సేవలు మెరుగ్గా ఉన్నాయన్న ఎండీ ఈ సందర్భంగా డిపో మేనేజర్‌ రమే్‌షను, సిబ్బందిని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ సేవలను మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. బస్సు కోసం వేచి ఉన్న న్యాల్‌కల్‌ మండలం హద్నుర్‌ గ్రామానికి చెందిన వీరన్నను ఆర్టీసీ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. జహీరాబాద్‌ ఆర్టీసీ డిపోకు త్వరలోనే  కొత్త బస్సులను సర్దుబాటు చేస్తామని సజ్జనార్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న జహీరాబాద్‌కు కర్ణాటక, మహారాష్ట్ర అనుసంధానంగా ఉండడం వల్ల ఇక్కడి డిపోలో మంచి లాభాలు వస్తున్నాయని చెప్పారు. బస్సులో ప్రయాణించే సమయంలో ఖచ్చితంగా మాస్కులు ధరించి సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలన్నారు. ఆర్టీసీ సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. డిపోలో పూల మొక్కను నాటిన అనంతరం బస్సులో సదాశివపేట వరకు వెళ్లారు. ఆయన వెంట ఆర్‌ఎం సుదర్శన్‌, డీఎం రమేష్‌, జహీరాబాద్‌ డీఎస్పీ శంకర్‌ రాజ్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.


ఆర్టీసీ స్థలాలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తాం

సదాశివపేట, జనవరి 27 : నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ స్థలాలను వాణిజ్యపరమైన అవసరాలకు అందజేసి లాభాలు పొందేందుకు ఆర్టీసీ యోచిస్తుందని ఆ సంస్థ ఎండీ  సజ్జనార్‌ అన్నారు. సదాశివపేటలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ను ఎండీ సజ్జనార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు రవాణా సేవలతో పాటు కొరియర్‌, కార్గో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రూ.కోటి60లక్షలతో నిర్మించిన బస్టాండ్‌లో ఆధునిక హంగులు కల్పిస్తామని ఆయన చెప్పారు. త్వరలోనే మరిన్ని నిధులు విడుదల చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సదాశివపేట బస్టాండ్‌ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తామన్నారు. కొత్తగా నిర్మించిన బస్టాండ్‌లో 12వ వార్డు కౌన్సిలర్‌ పులిమామిడి రాజు ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్‌ లాంజ్‌ కుర్చీలను అందజేయడాన్ని సజ్జనార్‌ కొనియాడారు.సజ్జనార్‌ వెంట స్థానిక  సీఐ గూడురి సంతో్‌షకుమార్‌, సంగారెడ్డి ఆర్‌ఎం సుదర్శన్‌, డిఎం నాగభూషణం, ఎఎం నవీన్‌యాదవ్‌, డీఈ వెంకటేశ్వర్లు ఉన్నారు.


Updated Date - 2022-01-28T05:01:51+05:30 IST