గుట్టకాయస్వాహా!

ABN , First Publish Date - 2021-11-27T05:30:00+05:30 IST

గుట్టల్లో గుట్టుగా అక్రమ మొరం దందా జోరుగా సాగుతోంది. అక్రమార్కుల ధన దాహానికి కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి.

గుట్టకాయస్వాహా!
బాన్సువాడ, నస్రుల్లాబాద్‌ మండలలోని బస్వాయిపల్లి, రాంపూర్‌ శివారులో గుట్టల్లో అక్రమంగా మొరం తవ్వకాలు జరిపిన దృశ్యాలు

- బాన్సువాడ డివిజన్‌ పరిధిలో అక్రమంగా మొరం తవ్వకాలు

- ప్రభుత్వ, పట్టా భూముల్లో తవ్వకాలు చేపడుతున్న అక్రమార్కులు

- అక్రమంగా వెంచర్లకు మొరం తరలింపు

- ఒక్కో ట్రాక్టర్‌ మొరం రూ.2వేలకు పైగానే విక్రయం

- రాయల్టీని ఎగ్గొడుతూ సొమ్ము చేసుకుంటున్న మొరం దందా నిర్వాహకులు

- అక్రమార్కులకు అండగా నిలుస్తున్న స్థానిక నేతలు

- కనుమరుగవుతున్న గుట్టలు, కొండలు

- మామూలుగానే తీసుకుంటున్న సంబంధిత శాఖలు


కామారెడ్డి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): గుట్టల్లో గుట్టుగా అక్రమ మొరం దందా జోరుగా సాగుతోంది. అక్రమార్కుల ధన దాహానికి కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. ప్రభుత్వ, పట్టా భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా అడ్డంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సైతం గండి కొడుతున్నారు. ప్రైవేట్‌, ప్రభుత్వ భూములు అని తేడా లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ అక్రమార్కులు రూ.లక్షలు గడిస్తున్నారు. ఇటీవల బాన్సువాడ, నస్రుల్లాబాద్‌ మండలాల్లోని రాంపూర్‌, బస్వాయిపల్లి గ్రామ శివారుల్లో అక్రమ మొరం తవ్వకాలు జరపడంతో గుట్టలే మాయమయ్యాయి. ఇలా బాన్సువాడ డివిజన్‌ పరిధిలోనే కాకుండా జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్‌లోని పలు అటవీప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు జోరుగానే సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం పట్టింపులేకుండా పోతుంది.

బాన్సువాడ డివిజన్‌లో మొరం దందా

బాన్సువాడ డివిజన్‌ పరిధిలోని పలు మండలాల్లో మొరం దందా జోరుగా సాగుతోంది. ప్రధానంగా బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాల పరిధిలోని ప్రభుత్వ, పట్టా, అటవీ భూముల్లో ప్రకృతి సంపద చాలానే ఉంది. బాన్సువాడ మున్సిపాలిటీ కావడం, నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంగా ఏర్పడడంతో స్థానికంగా వెంచర్‌లు వెలిశాయి. ఈ వెంచర్లకు అక్రమంగా మొరాన్ని తరలించేందుకు స్థానికంగా ఉండే కొందరు మొరం వ్యాపారులు, స్థానిక నేతలతో కుమ్మక్కై ఈ మండలాల పరిధిలోని ప్రభుత్వ, పట్టా భూముల్లో గల మొరం గుట్టలపై పడింది. ఇటీవల బాన్సువాడ మండల పరిధిలోని రాంపూర్‌ శివారు నుంచి మొదలుకుని నస్రుల్లాబాద్‌ మండలంలోని బస్వాయిపల్లి వరకు అందమైన మొరం గుట్టలు విస్తరించి ఉన్నాయి. ఆ గుట్టలపై కొందరు అక్రమార్కుల కన్ను పడడంతో మొరం తవ్వకాలు చేపట్టారు. స్థానిక రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రోజుల తరబడి జేసీబీలు పెట్టి వందలాది టిప్పర్లలో మొరం తరలించారు. ప్రైవేట్‌ వెంచర్లకు, ఇతర భవన నిర్మాణాలకు వందలాది టిప్పర్‌లలో మొరం తరలిస్తూ అక్రమార్కులు రూ.లక్షలో సొమ్ము చేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. బస్వాయిపల్లి, రాంపూర్‌ శివారులో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. 

అనుమతి లేకుండానే తవ్వకాలు

గ్రానైట్‌, కంకర క్వారీల మాదిరిగానే మొరం తవ్వకాలకు భూగర్భ గనుల, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా శాఖల వారు తవ్వకాలు అనుమతి ఇస్తారు. ఒక్కో క్యూబిక్‌ మీటర్‌ మొరంకు రూ.30 రాయల్టీ చెల్లించాలి. అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికివేస్తేనే కేసులు పెట్టే అటవీశాఖ అధికారులు ఆ చెట్లను కూడా ఆఖరికి భూములను తవ్వేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములు అయినా పట్టా భూములైనా నిబంధనలకు లోబడే అనుమతులు పొందాలి. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో మొరం తవ్వకాలకు అనుమతులు లేవు. అయినప్పటికీ అక్రమంగా మొరం తవ్వకాలను చేపడుతున్నప్పటికీ సంబంధితశాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో ఎక్కడా తవ్వకాలు చేసిన హెక్టార్‌కు రూ.50వేలు గనుల శాఖకు మరో రూ.50 వేలు తపాలా శాఖలో రిజిస్ర్టేషన్‌ కోసం చెల్లించాలి. విక్రయంపై అదనంగా 2.25 శాతం పన్ను చెల్లించాలి. ఇలా చెల్లించకపోవడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో చేపడుతున్న మొరం తవ్వకాలతో రూ. లక్షల్లో ప్రజాధనం అక్రమార్కుల పరమవుతోంది. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో ట్రాక్టర్‌ మొరం రూ.2వేల వరకు విక్రయిస్తుండగా ఒక్కో టిప్పర్‌ మొరం రూ.4వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా ఆదాయానికి గండి కొడుతున్నారు.

స్థానిక నేతల అండదండలతో..

జిల్లాలో కొందరు స్థానిక నేతల అండదండలతో మొరాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా నస్రుల్లాబాద్‌, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, గాంధారి, సదాశివనగర్‌, మద్నూర్‌, తాడ్వాయి, లింగంపేట, పిట్లం మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే అక్రమార్కులు గుట్టలను కరిగించేస్తున్నారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్‌ మండలాల్లో ప్రైవేట్‌, ప్రభుత్వ స్థలంలో గత కొన్ని రోజులుగా మొరం అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. ప్రతీరోజు పదుల సంఖ్యలోనే అక్రమంగా మొరం తరలిస్తున్నారు. గ్రామస్థులు ఎవరైనా అడ్డుకుంటే స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి భయభ్రంతులకు గురి చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం మొరం తవ్వకాలు జరుపుతున్నట్లు అక్రమార్కులు పేర్కొంటున్నారు. కానీ ఇదే విషయమై స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించగా బస్వాయిపల్లి, రాంపూర్‌ శివారులో మొరం తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇలా జిల్లాలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్‌శాఖ, రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

కనుమరుగవుతున్న గుట్టలు

జిల్లాలో అక్రమార్కుల తాకిడికి ప్రకృతి సంపదైన గుట్టలు, కొండలు, రోజు రోజుకూ కనుమరుగవుతున్నాయి. జిల్లాలో సాగుకు అనుకూలంగా లేని ప్రభుత్వ స్థలాలు, గుట్టలు చాలానే ఉన్నాయి. ప్రకృతికి విరుద్ధంగా అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టల్లో తవ్వకాలు జరుపుతున్నారు. జిల్లా సరిహద్దుల్లోనే కాకుండా అటవీప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో ఉన్న గుట్టలను అక్రమార్కులు తవ్వేస్తున్నారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌, గాంధారి, సదాశివనగర్‌, తాడ్వాయి, ఎల్లారెడ్డి, భిక్కనూరు, రాజంపేట్‌, మద్నూర్‌, పిట్లం, బిచ్కుంద లాంటి మండలాల్లో మొరం అక్రమ దందా జోరుగా సాగుతోంది. ప్రతీరోజు వందల టిప్పర్‌లలో, ట్రాక్టర్‌లలో మొరం తరలిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒక్కో ట్రాక్టర్‌ మొరంను రూ.2వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలు అక్రమార్కులను నిలదీస్తే ప్రభుత్వ పనులకు తీసుకెళ్తున్నారని సమాధానం చెబుతున్నారు. అయితే అధికారుల అండదండలతోనే మొరం అక్రమ దందా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.


మా దృష్టికి రాలేదు

- రాజాగౌడ్‌, ఆర్‌డీవో, బాన్సువాడ

బాన్సువాడ మండలంలోని రాంపూర్‌ శివారులో, నస్రుల్లాబాద్‌ మండలంలోని బస్వాయిపల్లి శివారులో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయనే విషయం మా దృష్టికి రాలేదు. రెవెన్యూశాఖ నుంచి మొరం తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అక్రమంగా ఎవరైన మొరం తవ్వితే వారిపై చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ శాఖ దృష్టికి తీసుకురావాలి.

Updated Date - 2021-11-27T05:30:00+05:30 IST