టెట్‌కు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-06-07T05:30:00+05:30 IST

టెట్‌కు ఏర్పాట్లు

టెట్‌కు ఏర్పాట్లు

  • వికారాబాద్‌ జిల్లాలో పరీక్ష రాయనున్న 9,485 మంది అభ్యర్థులు
  • 24 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణకు వికారాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 12వ తేదీన జరగనున్న టెట్‌ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లలో విద్యా శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఐదేళ్ల తరువాత నిర్వహిస్తున్న టెట్‌ పరీక్షకు ఈ సారి వేలాది మంది అభ్యర్థులు సిద్ధమయ్యారు.


వికారాబాద్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరి సారి 2017, జూలై 23న టెట్‌ నిర్వహించింది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు సుదీర్ఘకాలం తరువాత టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో తమ సత్తా చాటుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఈ నెల 12న టెట్‌ నిర్వహిస్తోంది. జిల్లాలో టెట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు 9,485 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్‌-1 పరీక్షకు 5,740 మంది అభ్యర్థులు, పేపర్‌-2 పరీక్షకు 3,745 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పరీక్షా కేంద్రం లో 240 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా, ఒక్కో గదిలో 24మంది చొప్పున పరీక్ష రాసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.


  • ఒక్కో సెంటర్‌లో 240 మంది, గదికి 24 మంది అభ్యర్థులు ...

 ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు జిల్లాలో మొత్తం 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్‌-1 పరీక్షకు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో 16 కేంద్రాలు, పరిగిలో 5 కేంద్రాలు, తాండూరులో 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే పేపర్‌- 2 పరీక్ష నిర్వహించేందుకు వికారాబాద్‌లో 16 కేంద్రాలు, తాండూరులో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. పేపర్‌-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనుండగా, పేపర్‌ -2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఒక్కో పరీక్షా కేంద్రంలో 240 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా, ఒక్కో గదిలో 24 మంది అభ్యర్థులకు చొప్పున సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు.


  • టీచర్ల నియామకంలో టెట్‌ మార్కులకు వెయిటేజీ...

ప్రాథమిక, ఉన్నత స్థాయిలో బోధనా ప్రమాణాలు పెంపొందించేందుకు 2011 నుంచి ఉపాధ్యాయ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం టెట్‌ తప్పనిసరి చేసింది. ప్రాథమిక స్థాయిలో బోధనకు పేపర్‌-1, ఆ పైస్థాయి బోధనకు పేపర్‌-2 పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. టెట్‌లో సాధించిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో వెయిటేజీ ఉంటుంది. టెట్‌ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తుండగా, దీంట్లో జనరల్‌ అభ్యర్థులు 90 మార్కులు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తేనే టీఆర్టీకి క్వాలిఫై అవుతారు. అలాగే టెట్‌లో సాధించిన మార్కులు ఉపాధ్యాయ నియామకాల్లో వెయిటేజీ దృష్ట్యా కీలకం అవుతాయి. ఈ సారి 120 మార్కులకు పైగానే సాధించాలనే పట్టుదలతో టెట్‌కు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. 


  • వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అప్‌లోడ్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. టీఎ్‌సటీఈటీ.సీజీజీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అప్‌లోడ్‌ చేశారు. హాల్‌ టికెట్‌లో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరులో అక్షర దోషాలు, కులం, లింగం, దివ్యాంగులు తదితర వివరాల్లో పొరపాట్లు ఉంటే పరీక్ష కేంద్రం నిర్వాహకుల వద్ద ఉండే నామినల్‌ రోల్‌లో మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్‌ టికెట్‌పైన ఫొటో, సంతకం సరిగా.. లేదా పూర్తిగా లేకపోయినా.. తాజాగా దిగిన ఫొటోను అతికించి గెజిటెడ్‌ అధికారితో అటెస్టేషన్‌ చేయించి డీఈవోను సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2022-06-07T05:30:00+05:30 IST