కేకేఆర్‌లో చేరమని షారూఖ్ స్వయంగా అడిగాడు: పాక్ మాజీ క్రికెటర్

ABN , First Publish Date - 2022-04-27T02:09:33+05:30 IST

ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ఆడిన పాక్ ఆటగాళ్లకు ఆ తర్వాతి నుంచి ఐపీఎల్‌లో చోటు కరువైంది

కేకేఆర్‌లో చేరమని షారూఖ్ స్వయంగా అడిగాడు:  పాక్ మాజీ క్రికెటర్

ముంబై: ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ఆడిన పాక్ ఆటగాళ్లకు ఆ తర్వాతి నుంచి ఐపీఎల్‌లో చోటు కరువైంది. నవంబరు 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఎంట్రీ లేకుండా పోయింది. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడిన పాక్ మాజీ క్రికెటర్ యాసిర్ అరాఫత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొందరి పేర్లను షార్ట్ లిస్ట్ చేసిందని అయితే, దురదృష్టవశాత్తు వారిలో తాను లేనని యాసిర్ చెప్పుకొచ్చాడు. 2009లో మాత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారూఖ్ ఖాన్ నుంచి తనకో ఆఫర్ వచ్చిందని వెల్లడించాడు.

 

‘‘2008లో నేను కెంట్ తరపున కౌంటీ క్రికెట్ ఆడుతున్నాను. అదే సమయంలో కేకేఆర్ జట్టు ప్రత్యేకంగా ఇండియా నుంచి వచ్చింది. మ్యాచ్ సందర్భంగా వారు నన్ను కలిశారు. వారు నాతో మాట్లాడుతూ.. తాను కేకేఆర్ తరపున ఆడాలని షారూఖ్ కోరుకుంటున్నట్టు చెప్పారు’’ అని అరాఫత్ వెల్లడించాడు. మొదట తాను దానిని జోక్‌ అనుకున్నానని పేర్కొన్నాడు. తనతో మాట్లాడిన వారు ఓ కార్డు చేతిలో పెట్టి తన వివరాలు తీసుకున్నారని వివరించాడు. 


ఆ తర్వాత  కొన్ని రోజులకు ఓ ఈమెయిల్ వచ్చిందని, తమను ఎందుకు కాంటాక్ట్ కాలేదని అందులో ప్రశ్నించారని పేర్కొన్నాడు. అనంతరం మూడేళ్ల కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేస్తూ షారూఖ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించాడని తెలిపాడు. అయితే, ఆ తర్వాత ముంబై పేలుళ్లు జరగడంతో పాక్  ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడడానికి వీల్లేకుండా పోయిందన్నాడు.  బహుశా తనతో సహా ఇతర పాక్ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్‌లో ఆడకపోవడం అదృష్టంగా భావిస్తున్నానని అరాఫత్ చెప్పుకొచ్చాడు. 


2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అరాఫత్ పాకిస్థాన్ తరపున మూడు టెస్టులు ఆడి 94 పరుగులు చేసి, 9 వికెట్లు నేలకూల్చాడు. అలాగే, 11 వన్డేల్లో 74 పరుగులు చేసి 4 వికెట్లు పడగొట్టాడు. 13 టీ20ల్లో 92 పరుగులు చేసి 16 వికెట్లు తీశాడు. 

Updated Date - 2022-04-27T02:09:33+05:30 IST