Abn logo
Sep 22 2021 @ 23:39PM

తుప్పుపట్టి..పెచ్చులూడి

శిథిలావస్థకు చేరిన డొంకూరు బ్రిడ్జి

 ఉప్పుగాలులతో బీటలువారిన వైనం

శిథిలావస్థకు చేరినా కనీస మరమ్మతులు కరువు

 బిక్కుబిక్కుమంటూ రాకపోకలు

 ఇదీ డొంకూరు వంతెన పరిస్థితి

ఇచ్ఛాపురం రూరల్‌

ఒడిశా, జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో మండలాల ప్రజలకు వారిధిగా ఉన్న డొంకూరు వంతెన శిథిలావస్థకు చేరింది. దశాబ్దాల కిందట నిర్మించిన ఈ వంతెన కనీస మరమ్మతుకు నోచుకోకపోవడంతో తుప్పుపట్టి, బీటలు వారుతోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారంతా ప్రాణాలను చేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ ప్రాంతంలో ఉప్పుగాలులు వీస్తుండడంతో వంతెనకు గల సిమెంట్‌ పెచ్చులుగా రాలిపోయి ఇనుపగజాలు తుప్పుపట్టిపోయాయి. దీంతో ఏక్షణంలో కూలిపోతుందోనని వాహనచోదకులు, గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.

 కనీస మరమ్మతులు లేక...

పదమూడో విడత మహిళా జన్మభూమిలో పాల్గొవడానికి డొంకూరు వచ్చిన అప్పటి సీఎం చంద్రబాబుకు గ్రామస్థులు, మత్స్యకారులు పొగరుబట్టిపై వంతెన లేకపోవడంతో తమ అవస్థలను వివరించారు. చుట్టుపక్కల ఆరు గ్రామాలతో పాటు ఆనుకొని ఉన్న ఒడిశాకు చెందిన నాలుగు గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి చేరుకోవడానికి 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయనకు తెలియ జేశారు. దీంతో రూ.63 లక్షలు మంజూరుచేశారు. తర్వాత అప్పటి జిల్లా మంత్రి తమ్మినేని సీతారాం 2003 జనవరిలో వంతెన పనులు ప్రారంభించారు. 2005లో పనులు పూర్తికాగా 2017లో నిర్వహణ లోపం వల్ల శిథిలావస్థకు చేరింది. అయితే  మరమ్మతులకు అఽధికారులు చర్యతీసుకోవడంలేదని పలువురు వాపోతున్నారు.

భారీ వాహనాలు...

ప్రస్తుతం లక్ష్మీపురం నుంచి రోడ్డు నిర్మాణం జరుగుతుండడంతో నిత్యం వందలాది భారీ వాహనాలు అధిక లోడుతో ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. వంతెనకు ఇరువైపులా సిమెంట్‌తో ఏర్పాటుచేసిన బారికేడ్లు పాడ య్యాయి. గతంలో తుఫాన్లు, వరదలకు మరింత దెబ్బతింది. ఆదమరిచి అటువైపు వెళ్తే కిందకు పడిపోయే ప్రమాదముందని ద్విచక్ర వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు.

 పనులు ప్రారంభిస్తాం

ప్రస్తుతం లక్ష్మీపురం నుంచి బూర్జపాడు వరకూ రోడ్డు పనులు జరుగుతున్నాయని పీఆర్‌ జేఈ ధనుంజయ ఆంధ్రజ్యోతికి తెలిపారు. రోడ్డు పనులు పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు కొత్త బ్రిడ్జి నిర్మాణానికి  పనులు ప్రారంభిస్తామని చెప్పారు.


అధికారులకు తెలియజేశాం..

వంతెన శిథిలావస్థకు చేరుకున్న విషయాన్ని గ్రామానికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేశాం. ఒడిశా వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం వాహనాలు రాకపోకలతో రద్దీగా ఉం టోంది. దీంతో వంతెన పటుత్వం కోల్పోతోంది. ప్రస్తుతం       ఏ క్షణంలో కూలుతుందోనని భయపడుతున్నాం.

-సీహెచ్‌ గురుమూర్తి, డొంకూరు

వంతెనకు మరమ్మతులు చేయాలి

మత్స్యకార గ్రామాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారి కావడంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటోంది. 15 ఏళ్ల కిందట నిర్మించిన వంతెన ఉప్పుగాలి వల్ల సిమెంటు పటుత్వం తగ్గి వంతెన శిఽథిలావస్థకు చేరింది. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం వంతెనకు మరమ్మతులు చేయాలి.

-దున్న జానకిరావు, డొంకూరు