Abn logo
Feb 3 2020 @ 14:27PM

55 ఏళ్ల చదువుల తల్లి!

అది గుజరాత్‌ యూనివర్సిటీ ప్రాంగణం... కాలేజీ టాపర్లుగా నిలిచిన వారిని వేదిక మీదకు పిలిచి గోల్డ్‌ మెడల్స్‌ అందిస్తున్నారు. తల్లితండ్రులు చప్పట్లు కొడుతూ అభినందిస్తున్నారు. అంతలోనే నితీ రావల్‌ బంగారు పతకం అందుకునేందుకు వేదిక మీదకు వచ్చారు. 55ఏళ్ల నితీ ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించి ఇటీవల చరిత్ర సృష్టించారు. ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు చేసిన తరువాత ఆమె చదువులో చూపించిన ప్రతిభ చూసి అందరితో పాటు ఆమె కుటుంబసభ్యులు ఎంతో పొంగిపోయారు.

  

నితీది న్యాయవాదుల కుటుంబం. ఆమెభర్త, కూతురు, కుమారుడు అందరూ లాయర్లే. మంచి సంబంధం రావడంతో కూతురు పెళ్లి చేశారు.కొడుకు ముంబయ్‌లోని ఒక కంపెనీలో న్యాయ సలహాదారుగా చేరాడు. పిల్లలిద్దరూ చక్కగా స్థిరపడడంతో కుటుంబ బాధ్యతల బరువు కొంత తగ్గింది. అప్పుటికి నితీకి తన గురించి ఆలోచించుకునేంత తీరిక దొరికింది. ఉదయాన్నే కోర్టుకు వెళ్లిన భర్త తిరిగి రాత్రి ఇంటికి వచ్చేదాకా ఇంట్లో ఒంటరిగా ఉండడం ఆమెకు బోర్‌గా అనిపించేది. తను కూడా ఏదైనా చేయాలనుకున్నారు. ఆమె మనసు చదువు వైపు మళ్లింది. అప్పటికి ఆమెకు 53 ఏళ్లు. పైగా ఆమె పుస్తకాలు వదిలేసి ముఫ్ఫై ఏళ్లు దాటింది. ‘నేను కూడా లా చదువుదామనుకుంటున్నా’ అని తన భర్తతో చెప్పారు. భార్య మనసు తెలిసిన ఆయన సంతోషంగా ‘సరే’ అన్నారు.

 

‘‘నేను క్లాస్‌రూమ్‌లోకి అడుగుపెట్టగానే విద్యార్థులంతా నన్ను టీచర్‌ అనుకున్నారు’’అని తాను తిరిగి కాలేజీలోకి అడుగు పెట్టిన మొదటి రోజును గుర్తుచేసుకుంటూ నవ్వుతారు నితీ. కుటుంబం ఇచ్చిన మద్దతు, తన కష్టంతో తనకన్నా చిన్నవారైన తోటి విద్యార్థులతో పోటాపోటీగా చదివేవారు నితీ. చదువులో ఆమె చూపిన ప్రతిభకు నాలుగు బంగారు పతకాలు వచ్చాయి. ‘‘నేను న్యాయవాద డిగ్రీ పూర్తిచేశానంటే అదంతా నా కుటుంబసభ్యుల సహకారం వల్లే’’ అని గోల్డ్‌ మెడల్స్‌ అందుకున్న ఆనందంలో అన్నారు నితీ. డిగ్రీ కోర్సు విజయవంతంగా ముగించిన ఈ చదువుల తల్లి లా మాస్టర్స్‌ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.


ప్రత్యేకం మరిన్ని...