కూడ్లూరులో ఇసుక తవ్వకాలకు సన్నాహాలు
శ్మశానం మాయంపై అధికారులు గప్చుప్
ఆమ్యామ్యాలతో అక్రమాలు మాఫీ
మళ్లీ తవ్వకాలకు రంగం సిద్ధం
రాయదుర్గం, నవంబరు 27: ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారాన్ని కొందరు అధికారులు కప్పిపుచ్చే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. శ్మశానం మాయమవటంపై కూడా అధికారులు మౌనం వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. డీ హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామంలో ఇసుకను తవ్వి, సొమ్ము చేసుకున్న వ్యవహారంలో అధికారులు ఏ మాత్రం అడుగులు ముందుకు వేయకుండా దోచుకున్న వ్యక్తులకు దాసోహమయ్యారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు ప్రభుత్వ భూమిలో ఎనిమిది వేల క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుకను తవ్వి, ఏకంగా శ్మశాన వాటికనే లేకుండా చేసిన వ్యవహారాన్ని తొక్కిపెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా తవ్వకాలను నిలిపేసినా.. ఇదివరకే సాగించిన వాటిపై నోరుమెదపట్లేదు. కొందరు నాయకు లు రంగప్రవేశం చేసి, డీల్ కుదిర్చినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో ఇసుక తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఒప్పందాలు పూర్తయినట్లు తెలిసింది.
నోరు మెదిపితే కష్టమే
కూడ్లూరు గ్రామ శ్మశానంలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోగా.. ఆ అంశం గురించి నోరు మెదిపితే కష్టంగా ఉంటుందనే భయాన్ని కల్పించారు. దీంతో బాధితులు విషయాన్ని ఎవరికి చెప్పుకోవా లో తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. శ్మశానమే కనుమరుగైతే ప్రశ్నించే నాథుడే లేకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ శ్మశానం ఉందనీ, తవ్వకాలు చేసిన మాట వాస్తవమని నిగ్గుతేల్చినప్పటికీ కంటితుడుపు చర్యగా వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది వేలకుపైగా క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వేసి, దోచేసుకున్న ఉదంతాన్ని కూడా కనుమరుగు చేసే పనిలో అధికారులు ఉన్నారంటూ ప్రజలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఈ దోపిడీపై నివేదిక కూడా బయటకు రాకుండా దోచుకున్న వారికి అనుకూలంగా అంతా సిద్ధం చేసి, సమర్పించినట్లు ఆరోపణలు బలంగా వస్తున్నాయి. దీంతో కూడ్లూరు ఇసుక అక్రమ తవ్వకాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. మళ్లీ తవ్వేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంతా తూచ్
ఇప్పటివరకు సాగించిన తవ్వకాలు ఒక ఎత్తయితే ఇకపై పు నరావృతం కాకుండా ఉండేందుకు లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కూడ్లూరు గ్రామంలో 201 సర్వే నెంబర్లో ఇసుకను 30600 క్యూబిక్ మీటర్ల దాకా తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అక్కడ కాకుండా దళితుల శ్మశాన ప్రాంతంలో తవ్వకాలు చేసిన విషయం తెలిసిందే. దారి కోసం తవ్వుకున్నట్లు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో తవ్వకాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. తవ్వకాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొంతమంది నాయకులతో డీల్ కుదిరినట్లు సమాచారం. డీ హీరేహాళ్ మండలంలోని కీలకమైన వైసీపీ నాయకుడి ఇంట్లో సుదీర్ఘ చర్చలు సాగించి, తవ్వకాలకు సంబంధించి చెల్లింపుల ప్రక్రియపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. తవ్వకాలకు ఒకవేళ ఇబ్బందులు వచ్చినా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఎప్పటికప్పుడు వాటిని తప్పించేలా డీల్ కుదిరినట్లు తెలియవచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంతర్గత సమాచారాలు, రహస్య ఒప్పందాలపై ప్రజల్లో చర్చ సాగుతోంది. దీంతో ఇసుక తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.