Abn logo
Jul 18 2021 @ 00:51AM

పుట్టింటికి పునీత...

రాణీ కేతేవన్‌...అచంచలమైన ధైర్యం, అకుంఠితమైన నిబద్ధత కలిగిన మహిళ.నమ్ముకున్న విశ్వాసం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదులుకున్న పునీత.ఇన్నేళ్ళకు ఆమె అవశేషాలు పుట్టింటికి చేరాయి.ఇంతకీ ఈ కేతేవన్‌ ఎవరు? ఎక్కడో ఉన్న జార్జియా నుంచి ఆమె అవశేషాలు మన దేశంలోని ఎలావచ్చాయి? అవి ఆమెవే అని ఎలా నిర్థారించారు?


జార్జియాలోని ముఖ్రానీ రాజవంశంలో 1560లో కేతావన్‌ జన్మించింది. కఖేటీ రాజ్యానికి చెందిన ఒకటో డేవిడ్‌ను వివాహం చేసుకుంది. అతను రెండేళ్ళే పాలించాడు. తరువాత తన కొడుకు తైముర్జ్‌ తరఫున రాజ్యపాలనను కేతేవన్‌ సాగించింది. ఆ సమయంలో పర్షియాకు షా అబ్బాస్‌ చక్రవర్తి. క్రైస్తవులు ఎక్కువగా ఉండే జార్జియా మీద అతని కన్ను పడింది. శక్తిమంతుడైన అబ్బాస్‌ దురాక్రమణను తప్పించుకోవడానికి... తన ఇద్దరు సోదరులనూ, తల్లినీ  1614లో పర్షియాకు బందీలుగా తైముర్జ్‌ పంపాల్సి వచ్చింది. ఆ సోదరులిద్దరినీ అబ్బాస్‌ దారుణంగా హింసించి, చంపించాడు. రాణీ కేతేవన్‌ను దాదాపు పదేళ్ళపాటు బందీగా ఉంచాడు. ఆ తరువాత... ఇస్లాం మతాన్ని స్వీకరించి, తన రాణివాసంలో చేరిపోవాలని కేతేవన్‌ను ఆదేశించాడు. కానీ దీనికి ఆమె అంగీకరించలేదు. ఆగ్రహం చెందిన అబ్బాస్‌ ఆమెను కాల్చిన పట్టకార్లతో చిత్రహింసలు పెట్టి చంపాడు. ఈ సంఘటన 1624 సెప్టెంబర్‌ 13న జరిగినట్టు పర్షియా చరిత్రకారులు పేర్కొన్నారు. బహిరంగంగా జరిగిన ఈ దమనకాండకు అగస్టీనియన్‌ శాఖకు చెందిన పోర్చుగీస్‌ సన్న్యాసులు కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని తెలుస్తోంది. కేతేవన్‌ భౌతికకాయాన్ని తూర్పు జార్జియాలోని అలవెర్డీ శ్మశానవాటికలో... ఆమె కుమారుడు తైముర్జ్‌ ఖననం చేయించాడు. 


సెయింట్‌ ఎలా అయింది?

‘‘తన కుమారులిద్దరిని చంపి, తననూ చంపుతానని బెదిరించినప్పటికీ... మతం మారడానికి ఆమె అంగీకరించలేదు.. క్రైస్తవంపై అచంచలమైన విశ్వాసాన్ని కొనసాగించింది. విషాదకరమైన మరణాన్ని పొందింది. అమరురాలైన కేతేవన్‌ను ‘పునీత’ (సెయింట్‌)గా గుర్తిస్తున్నాం’’ అని జార్జియన్‌ ఆర్థడాక్స్‌ చర్చి ప్రకటించింది. ఆ తరువాత, 1723లో జార్జియాపై దాడులు చేస్తామంటూ పర్షియన్‌ పాలకులు బెదిరించడంతో... పవిత్రమైన కేతేవన్‌ అవశేషాలకు ముప్పు కలుగుతుందని భయపడిన చర్చి వర్గాలు వాటిని సురక్షితమైన చోటుకు తరలించాలనుకున్నాయి. గుర్రం మీద వాటిని తీసుకెళ్తూండగా, జరిగిన ప్రమాదంలో... అవి ఒక నదిలో పడిపోయాయి. అవి పూర్తిగా కొట్టుకుపోయాయనే అందరూ అనుకున్నారు. 


గోవా రహస్యం ఎలా బయటపడింది?

ఇది జరిగిన సుమారు 250 ఏళ్ళ తరువాత, పోర్చుగీస్‌ -అమెరికన్‌ చరిత్రకారుడు రాబర్టో గుల్బెన్కియాన్‌ ఒక పుస్తకం రాశారు. చిత్రవధకు గురై మరణించిన రాణిని ఖననం చేశారనీ, అయితే రాణి చేతి భాగం శకలాలను అగస్టీనియన్‌ సన్న్యాసులు కొందరు కనుగొన్నారనీ, ఆ అవశేషాలను గోవాకు తీసుకువెళ్ళి... సమాధి చేశారనీ ఆ పుస్తకంలో వివరించారు. పునీతులుగా గుర్తించిన వారి అవశేషాలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. కేతేవన్‌ అవశేషాలను గోవాకు తీసుకువస్తే, ఆ ప్రాంతంలో క్రైస్తవాన్ని మరింతగా వ్యాప్తి చెయ్యవచ్చని ఆ సన్న్యాసులు భావించారన్నది రాబర్టో అభిప్రాయం. 1973లో ప్రచురితమైన ఆ పుస్తకం జార్జియాతో సహా అప్పటి సోవియెట్‌ యూనియన్‌ ప్రాంతమంతా సంచలనం సృష్టించింది. దీంతో చరిత్ర పరిశోధకుల దృష్టి గోవా మీద పడింది. 1980 నుంచి సోవియెట్‌ యూనియన్‌కు చెందిన పురావస్తు, చరిత్ర నిపుణులు గోవాకు వచ్చి... కేతాతేవన్‌ అవశేషాలను వెతకడం మొదలుపెట్టారు. చివరకు, ఓల్డ్‌ గోవాలోని సెయింట్‌ అగస్టీన్‌ చర్చి ఆవరణలో అవి ఉండవచ్చనే నిర్ధారణకు వచ్చారు. అది ఒకప్పుడు క్రైస్తవంలో అగస్టీనియన్‌ శాఖకు చెందిన... ప్రపంచంలోనే అతి పెద్ద, సంపన్నమైన చర్చిల్లో ఒకటి. కాలక్రమేణా శిథిలమై కుప్పకూలిపోయింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక దీని సంరక్షణ బాధ్యతలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా తీసుకుంది. ఆ చర్చి ప్రాంతంలో సుమారు రెండున్నర దశాబ్దాలపాటు ఎన్నో విడతలుగా పరిశోధనలు సాగాక.. 2005లో... అవశేషాలతో ఉన్న ఒక పెట్టె బయటపడింది. దానిలో చేతి ఎముకలు, మరికొన్ని భాగాలు ఉన్నాయి. వాటికి డిఎన్‌ఎ తదితర పరీక్షలూ, కాల నిర్థారణలూ చేసి.. కేతేవన్‌వేనని 2013లో ధ్రువీకరించారు.


మళ్ళీ స్వదేశానికి...

దాదాపు నాలుగువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవాలో ఉన్న రాణీ కేతేవన్‌ అవశేషాల్లో ప్రధాన భాగాన్ని జార్జియాకు ఈ మధ్యే భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి జయశంకర్‌ బహూకరించారు. మరికొన్ని అవశేషాలను ప్రజల సందర్శనార్థం గోవాలో భద్రపరిచారు. ఎక్కడో జార్జియాలో పుట్టి... రాజ్యాన్ని ఏలి, శక్తిమంతుడైన పరాయి పాలకుడితో తలపడి, ప్రాణం పోయినా తన విశ్వాసాన్ని వదులుకోకుండా పునీత అయిన కేతేవన్‌ జ్ఞాపకం ఇప్పుడు స్వదేశానికి చేరుకుంది. తన దేశ ప్రజల గౌరవాన్నీ, ఆరాధనలనూ అందుకోబోతోంది.

‘‘తన కుమారులిద్దరిని చంపి, తననూ చంపుతానని బెదిరించినప్పటికీ... మతం మారడానికి ఆమె అంగీకరించలేదు.. క్రైస్తవంపై అచంచలమైన విశ్వాసాన్ని కొనసాగించింది. విషాదకరమైన మరణాన్ని పొందింది. అమరురాలైన కేతేవన్‌ను ‘పునీత’ (సెయింట్‌)గా గుర్తిస్తున్నాం’’ అని జార్జియన్‌ ఆర్థడాక్స్‌ చర్చి ప్రకటించింది.