మాటల మాంత్రికుడికి మరోసారి అధికారం దక్కేనా..?
కేసీఆర్.. సుదీర్ఘ తెలంగాణ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ అవసరమంటూ.. ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలను పార్టీలోకి రప్పించి.. ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పునాదులను పటిష్టం చేశారాయన. 2014 ఎన్నికల ముందు వరకు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్.. నేడు ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ముందుకు వెళ్తోందంటే.. దానికి కేసీఆర్ రాజకీయ చతురతే ప్రధాన కారణం. ఉద్యమ సమయంలో ఎవరినయితే తెలంగాణ ద్రోహి అంటూ విమర్శించారో.. వారినే పార్టీలోకి రప్పించి పదవులు ఇచ్చినా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకున్న నేర్పరి కేసీఆర్. టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల్లోని ప్రముఖ నేతలను చేర్చుకుని పార్టీ బలం పెంచారు. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా.. చెప్పనివి కూడా చేసి చూపించామంటూ ‘ముందస్తు ఎన్నికల’కు సిద్ధమయ్యారాయన. తనయుడు కేటీఆర్‌‌కు పాలనా పగ్గాలు అప్పగించేందుకే ఈ ముందస్తు ఎత్తుగడ అంటూ.. విపక్షాలు విమర్శలు చేస్తున్నా వెరవకుండా.. ప్రచార సంగ్రామంలో దూసుకెళ్తున్నారు.
 
ప్రత్యర్థి పార్టీల్లో బలమైన నేతలు లేకపోవడం.. కేసీఆర్‌కు సానుకూలాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో 68 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న టీఆర్ఎస్.. ప్రస్తుత ఎన్నికల్లో 110 ఎమ్మెల్యే సీట్లను టార్గెట్‌గా పెట్టుకుంది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన కోదండరాం, గద్దర్, విమలక్క, వరవరరావు.. వంటి వారిని పూర్తిగా పక్కనపెట్టేయడం.. తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు.. వంటి వారిని పార్టీలోకి తీసుకోవడంలో కేసీఆర్ తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఎంల ‘మహాకూటమి’కి చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికతో ఆయన వ్యవహరిస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు కర్త, కర్మ, క్రియ.. అన్నీ తానై ఉంటూ... ప్రచారాస్త్రాలను కేసీఆర్ సంధిస్తున్నారు. మరి అంతిమ విజయం ఆయనను వరిస్తుందో లేదో.. వేచిచూడాలి...
ADVT

ADVT
వ్యాపారాలు: వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. క్యాప్సికంను పండించి ఎకరానికి కోటి రూపాయల ఆదాయాన్ని సాధించానంటూ ఆయన అప్పట్లో చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.
 
ఆస్తులు, అప్పులు: 2014లో ఎన్నికల అఫిడవిట్‌కు సమర్పించిన లెక్కల ప్రకారం కేసీఆర్ ఆస్తులు రూ.17 కోట్లు, అప్పులు రూ.7 కోట్లు.
 
కేసులు: ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై చాలా కేసులు నమోదయ్యాయి. 
ఇంకా పదవీ కాలం ఉన్నా.. 9 నెలలు ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ప్రత్యర్థులను ఖంగు తినిపించారు.
 
ఎంఏ(తెలుగు) పూర్తికాగానే.. వ్యాపార రంగంలోకి కేసీఆర్ అడుగుపెట్టారు. కార్మికులను గల్ఫ్ దేశాలకు పంపేందుకు హైదరాబాద్‌లో ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. అప్పట్లో కేసీఆర్‌కు ‘దుబాయి శేఖర్’ అనే పేరు కూడా ఉంది.
 
కేసీఆర్‌కు సంజయ్ గాంధీ అంటే ఇష్టం. ఎన్టీ రామారావు అంటే చాలా అభిమానం. అందుకే తన తనయుడికి ‘తారక రామారావు’ అని పేరుపెట్టుకున్నానని ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ చెప్పుకొచ్చారు.
 
ప్రత్యర్థులను తికమకటపెట్టే వ్యూహాలు పన్నడంలో సిద్ధహస్తుడు. వ్యూహానికి తగినట్లుగా, పరిస్థితులకు అనుగుణంగా తన గొంతులో గాంభీర్యాన్ని, వెటకారాన్నీ మేళవించి ఎదుటి వారికి చెమటలు పట్టించే విలక్షణ నేత కేసీఆర్.
 
తెలంగాణా మాండలికాన్ని పూర్తిగా ఔపోసన పట్టిన సమర్థుడు. అంతేకాకుండా తన ఉపన్యాసంలో సామెతలు, జాతీయాలను, పద్యాలను మేళవించి ప్రజలను ఉర్రూతలూగించే లక్షణం కేసీఆర్‌లో పుష్కలంగా ఉంది.
 
వీటన్నింటికి మూలం కేసీఆర్‌కి తెలుగు సాహిత్యంపై ఉన్న అభినివేషమే అని అంటుంటారు. కేవలం తెలుగు భాషపై మాత్రమే కాదు, ఏకంగా ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలపై మాంచి పట్టున్న నాయకుడు. జాతీయ స్థాయిలో రాజకీయాల్లో ఉంటూ సాహిత్య అభిరుచి కలిగిన వారిలో నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పాయి లాంటి వారైతే, ప్రాంతీయ పార్టీల్లో కేసీఆర్, కరుణానిధిలు కనిపిస్తారు.
 
కేసీఆర్‌కి దైవ భక్తి కూడా మెండుగానే ఉంటుంది. మామూలుగా అయితే రాజకీయ నాయకులు తన మత విశ్వాసాలను బహిరంగ పరచడానికి సాహసించరు. కానీ కేసీఆర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు.
 
యాగాలు చేయడం, గురువులను సేవించడం, గుళ్లకు, గోపురాలకు తిరగడం లాంటివి బహిరంగంగానే చేస్తుంటారు.
 
కేసీఆర్ లో మరో పార్శ్వం కూడా దాగుంది. అదే వ్యవసాయం చేయడం. దీనికి ఏకంగా ఒక ఫామ్ హౌజ్ నే ఏర్పర్చుకున్నారు. రకరకాల రంగుల్లో క్యాప్సికమ్, కీర దోసలను పండిస్తుంటారు. కేవలం పండించడమే కాదు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. మార్కెట్లలో ‘కేసీఆర్ కీర’ అని ఏకంగా పేరే స్థిరపడిపోయింది.