Share News

kumaram bheem asifabad- దిందా గ్రామంలో ఉద్రిక్తత

ABN , Publish Date - Jun 09 , 2026 | 10:13 PM

మండలంలోని దిందా గ్రామంలో మంగళవారం అటవీ శాఖాధికారులు, పోడు రైతుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూముల సరిహద్దుల్లో కందకాలు తవ్వించేందుకు అటవీ శాఖ అధికారులు దిందా గ్రామ పరిసర ప్రాంతాలకు మంగళవారం ఉదయం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న దిందా గ్రామ రైతులు అక్కడికి వచ్చి ఆ భూముల్లో తాము సాగు చేసుకుంటున్నామని, కందకాలు తవ్వవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు.

kumaram bheem asifabad- దిందా గ్రామంలో ఉద్రిక్తత
దిందాలో అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగిన పోడు రైతులు

చింతలమానేపల్లి, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దిందా గ్రామంలో మంగళవారం అటవీ శాఖాధికారులు, పోడు రైతుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూముల సరిహద్దుల్లో కందకాలు తవ్వించేందుకు అటవీ శాఖ అధికారులు దిందా గ్రామ పరిసర ప్రాంతాలకు మంగళవారం ఉదయం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న దిందా గ్రామ రైతులు అక్కడికి వచ్చి ఆ భూముల్లో తాము సాగు చేసుకుంటున్నామని, కందకాలు తవ్వవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోడు రైతులను అదుపులోకి తీసుకునే క్రమంలో మహిళలకు గాయాయ్యాయి. భారీ సంఖ్యలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకు దిగిన పలువురు రైతులు, మహిళలను పోలీసులు, అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని కాగజ్‌నగర్‌ డీఎఫ్‌వో కార్యాలయానికి తరలించారు. తమ సాగు భూములను రక్షించాలని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

ఫ మూడేళ్లుగా వివాదం..

మూడేళ్లుగా ఈ పోడు వివాదం కొనసాగుతోంది. సుమారు 1,600 ఎకరాల భూమిలో రైతులు పోడు వ్యవసాయ చేస్తున్నారు. అందులో సగం భూమిని అటవీ శాఖ స్వాధీనం చేసుకుని మొక్కలు పెంచుతోంది. ఈ విషయంపై ఎఫ్‌ఆర్వో సుభాష్‌ మాట్లాడుతూ కాగజ్‌నగర్‌ అటవీ విభాగం పరిధిలోని కర్జెల్లి రేంజ్‌, దిందా, బండపల్లి బీట్‌లో సుమారు 1,600 ఎకరాల అటవీ భూమి అక్రమణకు గురైనట్లు గుర్తించామని చెప్పారు. ఇందులో గత సంవత్సరం అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టి సుమారు 800 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.స్వాధీనం చేసుకున్న భూమిలో తేమ సంరక్షణ చర్యలు, అడవుల్లో పడిన వర్షపు నీటిని ఇంకేలా చేయడం, మట్టి కోతను అరికట్టేందుకు కందకాలు తవ్విస్తున్నామని తెలిపారు. దిందా గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు అటవీ భూములు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గమనించామన్నారు. అధికారుల పనులకు ఆటంకం కలిగించడం చట్ట రీత్యా నేరమని తెలిపారు. ప్రజలు అటవీ సంపద పరిరక్షణకు సహకారం అందించాలని ఎఫ్‌ఆర్వో విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jun 09 , 2026 | 10:13 PM