‘క్లీన్ ఎనర్జీ’లో రోల్ మోడల్‌గా తెలంగాణ
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:45 AM
క్లీన్ ఎనర్జీలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిపేలా ప్రత్యేక కార్యాచరణతో కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...
సర్క్యులర్ ఎకానమీతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
రూ.700 కోట్లతో నర్మెట్టలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్ట్
1400 మందికి ఉపాధి కల్పన
భూమి పూజలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, నంగునూరు ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): క్లీన్ ఎనర్జీలో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిపేలా ప్రత్యేక కార్యాచరణతో కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం ద్వారా పారిశ్రామిక వృద్థిని, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. సిద్దిపేట జిల్లా నుంగనూరు మండలం నర్మెట్టలో ‘జునో జౌల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్ట్‌కు ఆదివారం నిర్వహించిన భూమి పూజకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇప్పటికీ మన దేశం సుమారు 90 శాతం ముడి చమురును, 60 శాతం ఎల్పీజీని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోందన్నారు. ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ‘‘క్లీన్ ఎనర్జీ’’నే కీలకమన్నారు. అందుకు.. గ్రామాలు ఇంధన కేంద్రాలుగా మారాలని, ఆ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్థితో కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేేసలా పరిశ్రమలను గ్రామాలకు విస్తరిస్తున్నామన్నారు. నర్మెట్టలో ప్రారంభించబోయే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడి రైతులు దేశానికి ఇంధనాన్ని అందించే ‘శక్తిదాతలు’గానూ చరిత్ర సృష్టిస్తారన్నారు. మూడు దశల్లో క్లస్టర్ పద్థతిలో నిర్మించబోయే 10 సీబీజీ ప్లాంట్ల(సామర్థ్యం 100 టన్స్ పర్ డే)లో వరి గడ్డి, ఆవు పేడ, కోళ్ల వ్యర్థాలతో బయో ఫ్యూయల్ గ్యాస్ ఉత్పత్తి చేస్తారన్నారు. ఇక్కడ సుమారు 1400 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని, ఇందులో 30 శాతం మంది మహిళలే ఉంటారన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపన కోసమే ముందుచూపుతో ఈ ప్రాంతంలో భూములు సేకరించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్లే ఇక్కడ అభివృద్ధి మొదలైందన్నారు. మొన్న రూ.300 కోట్లతో ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చినా, ఇప్పుడు బయోగ్యాస్ ప్లాంట్ వచ్చినా రెండింటికీ లింక్ కాళేశ్వరం ప్రాజెక్టే అన్నారు. కాగా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. శంకుస్థాపన అనంతరం జరిగిన సమావేశానికి బీఆర్‌ఎస్ కార్యకర్తలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఎలా అనుమతించారని వారు వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం అందరినీ అనుమతించడంతో గొడవ సద్దుమణిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సంతోష్ బాగ్రోడియా, ఎంపీలు భువనేశ్వరి కలిత, ప్రేమ్ చందర్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, రాయపాటి సాంబశివరావు, జునో జౌల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రాయపాటి నాగశరత్ తదితరులు పాల్గొన్నారు.