వృద్ధులు రహదారుల్లో నడిచి వెళ్లేలా చెయ్యండి
ABN , Publish Date - May 20 , 2026 | 03:09 AM
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని రహదారులపై వృద్ధులు నడిచి వెళ్లే పరిస్థితి లేకపోవడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఆక్రమణలు తొలగించండి, నడకదారులు పునఃనిర్మించండి: హైకోర్టు
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని రహదారులపై వృద్ధులు నడిచి వెళ్లే పరిస్థితి లేకపోవడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విపరీతమైన ట్రాఫిక్, అస్తవ్యస్థమైన పార్కింగ్, నడకదారులు లేకపోవడం, ఉన్నా ఆక్రమణలకు గురి కావడం వల్ల సీనియర్ సిటిజన్లు రహదారిపై నడిచి వెళ్లే పరిస్థితి లేదని పేర్కొంది. అందువల్ల రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని, ఫుట్‌పాత్‌లను పునఃనిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రహదారులు, ఫుట్‌పాత్‌లు సరిగా నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రిటైర్డ్ జర్నలిస్టు బీ సురేందర్, మరికొందరు సీనియర్ సిటిజన్లు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది మల్లిఖార్జున శర్మ వాదిస్తూ.. సీనియర్ సిటిజన్లు ఆర్టీసీ, మెట్రో స్టేషన్‌ల వరకు నడిచే పరిస్థితి కూడా ఉండటం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితి వారి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోందని తెలిపారు. ఈ పరిస్థితి వారి జీవించే హక్కును కాలరాయడం కిందకే వస్తుందని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఫుట్‌పాత్‌లు, రహదారుల ఆక్రమణల తొలగింపునకు హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసిందని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఆక్రమణలు తొలగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. ‘పిటిషనర్లు సీనియర్ సిటిజన్లతోపాటు సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను లేవనెత్తారు. ఇందులో కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లో కాలనీలు, వీధుల్లో రోడ్డులో సగభాగం వరకు ఆక్రమించి కార్లు పార్కింగ్ చేస్తున్నారు. దాంతో ఇతర వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. ఫుట్‌పాత్‌లు కేవలం నడకదారిన వెళ్లే వారి కోసం మాత్రమేనని ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ ఇతర విభాగాలు రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించడంతోపాటు వాటిని అసలు పరిమాణంలో పునరుద్ధరిస్తూ శాశ్వత నిర్మాణాలు చేపట్టాలి. వీధులు, కాలనీలు, రోడ్లపై అక్రమ పార్కింగ్ లేకుండా రోడ్లను సరిగా నిర్వహించాలి. అక్రమ పార్కింగ్‌లపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొంది. ఈ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల వివరాలతో నివేదిక సమర్పించాలని పేర్కొంటూ తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది.