కేవీపీపై రెడ్‌కార్నర్ నోటీసు అమల్లో ఉందా ?
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:52 AM
టైటానియం లీజులకు సంబంధించిన వ్యవహారంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మిత్రుడు కేవీపీ రామచంద్రరావుపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ జారీచేసిన రెడ్‌కార్నర్ నోటీసు ఇంకా అమల్లోనే ఉందా...
తెలుసుకుని చెప్పాలని సీబీఐకి టీ-హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): టైటానియం లీజులకు సంబంధించిన వ్యవహారంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మిత్రుడు కేవీపీ రామచంద్రరావుపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ జారీచేసిన రెడ్‌కార్నర్ నోటీసు ఇంకా అమల్లోనే ఉందా అని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆరా తీసింది. దీనిపై తెలుసుకుని చెప్పాలంటూ ఆదేశాలు జారీచేసింది. మంగళవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్. తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... రెడ్‌కార్నర్ నోటీసును సవాల్ చేస్తూ కేవీపీ 2014లో దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. కేవీపీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌లో సీబీఐ మాత్రమే కౌంటర్ దాఖలు చేసిందని.. కేంద్ర ప్రభుత్వం, ఇంటర్‌పోల్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ వ్యవహారంలో కేంద్రం కౌంటర్ లేకుండా విషయం తేలదని తెలిపారు. మరోవైపు ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో, పిటిషన్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలా ? లేదా? అనే అంశంపై సమగ్ర వాదనలు వినిపిస్తామని, అప్పటి వరకు సమయం ఇవ్వాలని సీబీఐ కోరింది. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది.