Share News

బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల సందడి

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:42 AM

జిల్లాలోని కోర్టుల బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 31లోగా ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల సందడి

31లోగా ఎన్నికలు పూర్తిచేయాలని నోటిఫికేషన్‌ జారీచేసిన రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌

మహిళలకు 30శాతం రిజర్వేషన్‌

జిల్లాలో ఐదు కోర్టులు, 265మంది న్యాయవాదులు

భువనగిరి టౌన్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కోర్టుల బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 31లోగా ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ ఎన్నికల నుంచి బార్‌ అసోసియేషన్‌లో 30శాతం మహిళా న్యాయవాదులకు రిజర్వేషన్‌ అమలులోకిరానుంది. నోటిఫికేషన్‌ విడుదలవడంతో కోర్టుల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. జిల్లాలో ఐదు కోర్టులు ఉండగా, 365మంది న్యాయవాదులు ఉన్నారు. భువనగిరి కోర్టులో 154 మంది న్యాయవాదులు ఉండగా, యాదగిరిగుట్ట, ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్‌ కోర్టుల్లో 111 మంది న్యాయవాదులు ఉన్నారు.

భువనగిరి కోర్టులో..

భువనగిరి కోర్టు ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి జిల్లా భాస్కర్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. మహిళలకు 30శాతం రిజర్వేషన్‌ ప్రాతిపదికన భువనగిరి బార్‌ అసోసియేషన్‌లో మహిళా న్యాయవాదులకు ఉపాధ్యక్షురాలు, కోశాధికారి, సాంస్కృతిక కార్యదర్శి, మహిళా ప్రతినిధి, ఒక కార్యవర్గ సభ్యురాలి పదవిని కేటాయిస్తూ బార్‌ అసోసియేషన్‌ తీర్మానం చేసింది. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 16న నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణ, 18న ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. 26న ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. ఏప్రిల్‌ 1న బార్‌ అసోసియేషన్‌ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తుంది.

Updated Date - Mar 11 , 2026 | 12:42 AM