మేడారంలో లైంగిక దాడి ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
ABN , Publish Date - Feb 05 , 2026 | 04:40 AM
మేడారం జాతరలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) స్పందించింది.
డెలినా ఖోంగ్డప్ అధ్యక్షతన విచారణ కమిటీ
సభ్యురాలిగా ఎన్‌సీడబ్ల్యూ కోఆర్డినేటర్ ఖట్టర్
నేటి నుంచే విచారణ ప్రారంభించాలని ఆదేశం
నేడు మేడారం రానున్న కమిటీ సభ్యులు
న్యూఢిల్లీ/ములుగు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మేడారం జాతరలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) స్పందించింది. జాతరలో 13 సంవత్సరాల బాలికపై ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలను సుమోటోగా స్వీకరించింది. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారని, ఇది సామూహిక అత్యాచారమని వస్తున్న వార్తలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు స్పందించిన జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయా రహాట్కర్... విచారణకు కమిటీని నియమించారు. ఈ కమిటీకి ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా ఖోంగ్డప్ అధ్యక్షత వహించనుండగా, ఎన్‌సీడబ్ల్యూ సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ సభ్యురాలిగా వ్యవహరించనున్నారు. కమిటీకి సహకరించేందుకు న్యాయవాదిని నియమించాలని ములుగు జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎ్‌సఏ)కు ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచే విచారణ ప్రారంభించాలని కమిటీని కమిషన్ చైర్‌పర్సన్ ఆదేశించారు. ఈ మేరకు గురువారమే కమిటీ మేడారం రానున్నట్లు జాతీయ మహిళా కమిషన్ మీడియా సలహాదారుడు శివంగార్గ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, సంబంధిత అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలపై కమిటీ ఆరా తీస్తుందని, అధికారులు, ఇతరులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటుందని తెలిపారు. కాగా, మేడారం మహాజాతరలో బాలికపై అత్యాచారం జరిగినట్లు సోషల్ మీడియా, మీడియాలో వదంతులు రావడంతో నార్లాపూర్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారని, ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఒక ప్రకటనలో తెలిపారు.