పరీక్షలయ్యాకే పెళ్లి చేసుకుందామన్నదని.. ప్రియుడి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:36 AM
ఈ రోజే మనం పెళ్లి చేసుకుందాం అని అడిగితే.. వద్దు.. నా పరీక్షలయ్యాక చేసుకుందాంలే అని ప్రేమించిన యువతి తన ప్రతిపాదనను తిరస్కరించిందని....
పెళ్లి విషయంలో ప్రేమజంట వాగ్వాదం
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
కురవి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఈ రోజే మనం పెళ్లి చేసుకుందాం అని అడిగితే.. వద్దు.. నా పరీక్షలయ్యాక చేసుకుందాంలే అని ప్రేమించిన యువతి తన ప్రతిపాదనను తిరస్కరించిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో వల్లపునేని శశికుమార్(21) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కురవి పోలీసుల కథనం ప్రకారం.. కురవికి చెందిన శశికుమార్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కేసముద్రం శివారులోని ఓ తండా కు చెందిన ఇంటర్ చదువుతున్న యువతి (20).. శశికుమార్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సదరు యువతికి ఫోన్ చేసిన శశికుమార్.. ఈ రోజే మనమిద్దరం పెళ్లి చేసుకుందామని పట్టుబట్టాడు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయని, పరీక్షలు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామని ఆ యువతి బదులిచ్చింది. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా.. ప్రియురాలు తనమాట వినలేదని శశికుమార్ మనస్తాపం చెందాడు. ఆపై, కురవిలోని తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.